Friday, April 19, 2024

టెట్ పేపర్ 3?

- Advertisement -
- Advertisement -

4 Killed in Car Accident in Nagarkurnool

భాషా పండితుల కోసం టెట్ పేపర్ 3
పరిశీలిస్తున్న ప్రభుత్వం
త్వరలో స్పష్టత వచ్చే అవకాశం
ఇప్పటికే ఎపిలో పేపర్ 3 నిర్వహణ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో భాషా పండితుల కోసం పేపర్ 3ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెట్‌లో ఇప్పటివరకు సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జిటి)కి సంబంధించి పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పేపర్-2 నిర్వహిస్తున్నారు. అయితే ప్రత్యేక కోర్సులు చేసిన తెలుగు, హిందీ, ఉర్దూ లాంగ్వేజీ పండిట్ అభ్యర్థులు కూడా పేపర్ 2నే రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ పేపర్‌లో పండిట్‌లకు సంబంధంలేని సబ్జెక్టులైన సాంఘిక శాస్త్రం, గణితం, సామాన్య శాస్త్రంకు సబ్జెక్టుల నుంచి 60 మార్కులు ఉండడంతో తాము టెట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నామని బాషా పండితులు వాపోతున్నారు. మొత్తం 150 మార్కులకు టెట్ పేపర్ 2 పరీక్షను నిర్వహిస్తారు. అందులో జనరల్ ఇంగ్లీష్‌కు 30 మార్కులు, సైకాలజీకి 30 మార్కులు, మెథడాలజీకి 30 మార్కులు ఉంటాయి. అలాగే మాథ్స్, సైన్స్, బయాలజీ, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 60 మార్కులు ఉంటాయి. మ్యాథ్స్, సైన్స్ అభ్యర్థులకు 30 మార్కులు మ్యాథమెటిక్స్‌కు, మరో 30 మార్కులు సైన్స్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ అభ్యర్థులకు మ్యాథ్స్ సబ్జెక్టు నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. సోషల్ అభ్యర్థులకు మాత్రం 60 మార్కులు పూర్తిగా సోషల్ సబ్జెక్టు నుంచే ప్రశ్నలు ఉంటాయి. అయితే భాషా పండితులు కూడా వారికి సంబంధం లేని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. దీని వల్ల తమకు అన్యాయం జరుగుతుందని, తమ కోసం ప్రత్యేకంగా పేపర్ 3 నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము చదువుకున్న భాషా సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తే భవిష్యత్తులో విద్యార్థులకు బోధించడంలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. తమ కోసం పేపర్- 3 నిర్వహించాలని భాషాపండిట్లు కోరుతున్నారు.
సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం భాషా పండితుల కోసం టెట్ పేపర్ -3ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ లాంగ్వేజీ పండిట్లకు వారి సంబంధిత సబ్జెక్టులతో కూడిన ప్రశ్నాపత్రం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆయా సంఘాల నేతలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ రాధారెడ్డిలకు వినతిపత్రాలు సమర్పించగా, వారు సానుకూలంగా స్పందించారు. భాషా పండితుల కోసం పేపర్ 3 నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌లో అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులు మంత్రి, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అధికారులు పేపర్-3 నిర్వహించేందుకు ఉన్న సానుకూల అంశాలపై అద్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందించనున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
30 వేల మందికి ప్రయోజనం
రాష్ట్రంలో టెట్‌కు తెలుగు, హిందీ, ఉర్దూ తదితర భాషా పండితులు సుమారు 30 వేల వరకు ఉంటారని అంచనా. భాషా పండితుల కోసం టెట్‌లో పేపర్ 3ని నిర్వహిస్తే ఈ అభ్యర్థులందరికీ ప్రయోజనం చేకూరనుంది. ఎపిలో నిర్వహిస్తున్న టెట్ పేపర్ 3లో 150 మార్కుల్లో 90 మార్కులు పూర్తిగా అభ్యర్థుల భాషా సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నలే ఉన్నాయి. మెథడాలజీలో ఉండే 30 మార్కుల్లో 24 మార్కులు భాషా పరిజ్ఞానానికి, 6 మార్కులు మెథడాలజీకి కేటాయించారు. అలాగే 60 మార్కులు పూర్తిగా ఆయా భాషా సబ్జెక్టులకే కేటాయించారు. తమకు ఎపిలో తరహాలో పేపర్ 3 ప్రశ్నాపత్రం ప్రత్యేకంగా రూపొందిస్తే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయ నియామకాలలో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉన్న నేపథ్యంలో మెరుగైన స్కోర్ సాధించేందుకు అభ్యర్థులు కష్టపడుతుంటారు. భాషా పండితులకు ప్రత్యేకంగా పేపర్ 3 నిర్వహించడం ద్వారా తాము టెట్‌లో మంచి స్కోర్ సాధించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
భాషా పండితులకు న్యాయం చేయాలి: శానమోని నర్సింహులు, ఆర్‌యుపిపిటిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో భాషా పండితుల కోసం పేపర్ 3 నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శానమోని నర్సింహులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమకు సంబంధం లేని సబ్జెక్టులతో టెట్ పేపర్ 2 రాయడం వల్ల భాషా పండితుల అన్యాయం జరుగుతుందని వాపోయారు. తమ సమస్యపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పేపర్ 3 నిర్వహణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
పేపర్ 3 నిర్వహించాలి: గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ప్రధాన కార్యదర్శి
భాషా పండితుల కోసం ప్రత్యేకంగా పేపర్ 3 నిర్వహించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్,తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భాషా పండితులు టెట్ పేపర్ 2 రాయడం వల్ల తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

TS Govt may conduct TET Paper 3 for Pandits

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News