Friday, April 26, 2024

300 ఆసుపత్రులపై కొరడా?

- Advertisement -
- Advertisement -

తీరు మారని దవాఖానాలపై చర్యలకు
రంగం సిద్ధం, 50శాతం పడకల స్వాధీనం
దిశగా ఆరోగ్యశాఖ అడుగులు


మన తెలంగాణ/హైదరాబాద్: ప్రైవేట్ హాస్పిటల్స్‌పై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కరోనా చికిత్స ఫీజుల విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోని హాస్పిటల్స్‌పై బెడ్లు స్వాధీనం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అంతేగాక ఇటీవల వైద్యశాఖ వాట్సాప్ నంబరుకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని హాస్పిటల్స్ ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు. దీంతో ఆయా ఆసుపత్రుల్లో కూడా 50 శాతం బెడ్లను వైద్యశాఖ తమ ఆధీనంలోకి తీసుకోనుందని ఆరోగ్యశాఖలోని ఓ ముఖ్య అధికారి తెలిపారు. సుమారు మూడు వందలకు పైగా ఆసుపత్రులు ఇప్పటి వరకు వైద్యశాఖ ఇచ్చిన నోటీసుకు వివరణ ఇవ్వలేదని మరో అధికారి వెల్లడించారు. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్ నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తుందని హెల్త్ డైరెక్టర్ అధికారుల బృందం అభిప్రాయపడింది. ఇప్పటికే హై లెవల్ కమిటీ సైతం ఈ అంశాన్ని సిఎం దృష్టికి తీసుకువెళ్లింది. సుదీర్ఘ పరిశీలన అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని సిఎం కూడా ఆదేశించినట్లు ఓ అధికారి చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. సదరు ఆసుపత్రులపై ఎమిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకునేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ అయింది.
ప్రైవేట్ హాస్పిటల్స్‌లో జరుగుతున్న ప్రధాన లోపాలు..
కరోనా వైద్యం అందించే 90 శాతం ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదు. ఫైర్ సేఫ్టీ, పరిశుభ్రత, నాణ్యతలేని పరికరాలు, విశాలమైన వార్డులు లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు హైలెవల్ కమిటీ గుర్తించింది. అదే విధంగా కొన్ని హాస్పిటల్స్ చిన్నపాటి బిల్డింగ్‌లను అద్దెకు తీసుకొని, వాటిలో ఎక్స్‌రే, డయాగ్నోస్టిక్ యంత్రాలు, రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసి కరోనా వైద్యాన్ని అందిస్తునట్లు హైలెవల్ కమిటీ గుర్తించింది. అంతేగాక పార్కింగ్ స్థలాలు లేకుండా, పర్మిషన్ లేని భవంతులలో కూడా చికిత్సను అందిస్తున్నారు. తాత్కాలిక ఫర్నీచర్ ఏర్పాటు చేసి గుట్టుచప్పుడు కాకుండా వైద్యం అందిస్తున్నారు. దీంతో పాటు 37 హోటళ్లలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులలో కూడా ప్రభుత్వం సూచించిన నిబంధనలు ప్రకారం ఏర్పాట్లు లేవని హైలెవల్ కమిటీలోని ఓ అధికారి తెలిపారు. దీంతో పాటు కొన్ని హాస్పిటల్స్‌లో అవసరం లేకున్న విచ్చిలవిడిగా టెస్టులు చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అంతేగాక, అధిక బిల్లులు వేస్తూ ప్రజలను పీడిస్తున్నారు. దీంతో సదరు ఆసుపత్రులపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా, నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు స్వాదీనం చేసుకుంటామని ఒకవైపు మంత్రి హెచ్చరించినా గంట లోపలే సుచిత్ర సర్కిల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కరోనా వైద్యానికి సుమారు రూ.10లక్షల బిల్లు వేసింది. దీంతో సదరు బాధితులకు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మందుల ఖర్చు వెయ్యిరూపాయలు మాత్రమే అవుతుందని స్వయంగా మంత్రి చెప్పినా, ఆయా ఆసుపత్రి యాజమాన్యాలు పది లక్షల బిల్లు ఎలావేశారన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది.

TS Govt serious on Private Hospitals overcharging

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News