Friday, March 29, 2024

కొత్తగా 2 లక్షల మందికి రైతుబీమా

- Advertisement -
- Advertisement -

31 లక్షల మంది అన్నదాతలకు బీమా రెన్యూవల్

రూ.1173.54 కోట్లు విడుదల వ్యవసాయ శాఖ ఉత్తర్వులు
ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు

తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా 1.73 లక్షల మంది నుంచి 2.23 లక్షల వరకు అర్హులైన రైతులు నూతనంగా రైతుబీమా పథకం పరిధిలోకి రానున్నారు. అలాగే దాదాపు 30.5 లక్షల నుంచి 31 లక్షల మంది రైతులకు బీమా పథకాన్ని రెన్యువల్ చేస్తున్నారు. ఆగస్టు ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతుబీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రైతుల పక్షాన మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రైతుబీమా కోసం ప్రభుత్వం రూ.1173.54 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇందులో 18 శాతం జిఎస్‌టితో కలిపి ప్రీమియం రూ.1141 కోట్లు కాగా, రూ.32.54 కోట్లు స్టాంప్‌డ్యూటీ నిధులు విడుదల చేశారన్నారు. ఆగస్టు 14వ తేదీ 2020 నుంచి ఆగస్టు 13, 2021 వరకు ఈ బీమా వర్తిస్తుందన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు 32.73 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వస్తున్నారన్నారు.

ఈ ఏడాదితో 59 ఏండ్లు నిండి న రైతులు అనర్హులవుతారన్నారు. 14 ఆగస్టు 19 61 నుంచి 14 ఆగస్టు 2002 మధ్య జన్మించిన వారు అర్హులుగా తెలిపారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ నిధులు విడుదల చేసినందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గత రెండేళ్లలో ఎల్‌ఐసికి రైతుబీమా పథకం కోసం ప్రీమియం కింద రూ.1775.95 కోట్లు చెల్లించారు. గత రెండేళ్లలో ఇప్పటి వరకు 32,267 మంది రైతు కుటుంబాలకు రైతుబీమా కింద రూ.5 లక్షల చొప్పున రూ.1613.35 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఎల్‌ఐసి వద్ద పరిశీలనలో 1800 మంది రైతుల బీమా క్లెయిమ్స్ ఉన్నాయన్నారు. దీని కింద చెల్లించాల్సిన నిధులు రూ.90 కోట్లు ఉంటుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా రైతుబీమా లాంటి పథకం లేదన్నారు. ఎక్కడా మధ్యవర్తి, పైరవీకారు లేకుండా సిఎం రూపొందించిన పథకమన్నారు. రైతు ఏ కారణం చేత చనిపోయినా ఐదారు రోజుల్లో రైతు కుటుంబానికి రూ.5 లక్షల జమ చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా చేయడం సిఎం కెసిఆర్ సూక్ష్మదృష్టికి నిదర్శనమన్నారు. ఎవరు ఏం మాట్లాడినా రైతులు, పేదలు, సామాన్యులకు న్యాయం చేయడంపైనే నిరంతరం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయంతో భరోసా, జీవితానికి ఒక ధీమా కల్పించినట్లు తెలిపారు.

TS Govt to Renewal Rythu Bheema Scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News