Friday, April 19, 2024

సరిహద్దుల్లో అంబులెన్స్‌లు ఆపొద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా ప్రశ్నించింది. అయితే లిఖిత పూర్వకంగా ఎలాంటి ఆదేశాలూ లేవని ఎజి హైకోర్టుకు నివేదించారు. అయితే మౌఖిక ఆదేశాలేమైనా ఉన్నాయా? అని మరో ప్రశ్న వేసింది. ఈ విషయాన్ని సిఎస్‌ను అడిగి చెబుతామని ఎజి పేర్కొన్నారు. అయితే ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్నాటక నుంచి ఆర్‌ఎంపి పిస్క్రిప్షన్‌తో హైదరాబాద్‌కు వస్తున్నారని ఎజి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒక సర్కులర్, అడ్వైజరీ లేకుండా ఎలా నిలిపివేస్తారని నిలదీయడంతో పాటు సరిహద్దుల వద్ద అంబులెన్సులు ఆపవద్దని పోలీసులను ఆదేశించింది. అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్స్ ఎందుకు నిలిపివేస్తున్నారని, హైదరాబాద్ అనేది మెడికల్ హబ్ అని ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారని హైకోర్టు పేర్కొంది. ప్రజలను ఇక్కడికి రావొద్దు అని చెప్పడానికి మీకు ఏం అధికారం ఉందని, హాస్పిటల్‌లో వైద్యం కోసం వచ్చే వారిని మీరెలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. కేర్, అపోలో ఆస్పత్రిలో అంతర్ జాతీయ పేషెంట్లు ఉంటారని, వాళ్ళను కూడా అడ్డుకుంటారా అని హైకోర్టు పేర్కొంది.

దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఎంతో మంది పేషంట్లు ఎన్నో రాష్ట్రాల నుండి వస్తుంటారని,ఈక్రమంలో ఢిల్లీలో పోలీసులు అంబులెన్స్ లను ఆపేస్తున్నారా అంటూ మండిపడింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే అంబులెన్స్‌లను ఆపడం ఏంటని, గతంలో మేం చెప్పినట్టు మొబైల్ టెస్ట్‌ను కూడా మీరు నిర్వహించలేక పోయారు కానీ ఇప్పుడేమో అంబులెన్స్‌లను ఆపేస్తున్నాని హైకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 14,19 1(డి) ప్రకారం అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను నిలిపి వేసి ఉల్లంఘనకు ప్రభుత్వం పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు తగ్గిండంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. అదే విధంగా మేం ఆదేశాలు ఇచ్చిన రోజు ప్రెస్‌మీట్ పెట్టి లాక్‌డౌన్ అవసరం లేదని సిఎస్ ఎలా చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదిలావుండగా బుధవారం నాటి నుంచి రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు హైకోర్టుకు ఎజి ప్రసాద్ నివేదించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారాంతపు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ పొడిగించమని అడిగితే పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు కేసులు తగ్గుతున్నప్పుడు అకస్మాత్తుగా లాక్‌డౌన్ అంటున్నారని అసహనం వ్యక్తం చేసింది.ఉదయం 6 గంటల నుంచి 10 వరకు జనం గుమిగూడకుండా చూడాలని సూచించింది.లాక్‌డౌన్ సమయంలో కరోనా టీకా రెండో డోసు తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లాక్ డౌన్ వల్ల సాయంత్రపు వేళల్లో ఏమైనా సడలింపులు ఉన్నాయని అడగగా, ఎలాంటి రిలాక్షేషన్స్ లేవని అడ్వకేట్ జనరల్ తెలిపారు.
వలస కూలీల పరిస్థితిపై:
అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటిస్తే వలస కూలీలు ఉన్నట్లుండి ఎలా వెళ్తారని ప్రశ్నించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రద్దీ ఎలా నియంత్రిస్తారని ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే సగం మంది వలస కూలీలు వెళ్లిపోయారని చెప్పిన ఎజి, వలస కూలీల బాగోగులు ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ఒక్కసారిగా లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇంత తక్కువ టైమ్‌లో ఎలా వారి ప్రాంతాలకు వెళతారని ప్రశ్నించింది. గతేడాది వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని హైకోర్టులో తెలిపింది. రోజువారీ కూలి చేస్తూ బతికే వాళ్ళు వలస కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తోందని మరోసారి ప్రశ్నించగా ఇప్పటికే 50 శాతం వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ సొంతూళ్లకు వెళ్లారని తెలిపారు.
గడవు కోరిన ఎజి ః
లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌పై పూర్తి వివరాలు తెలపడానికి హైకోర్టును అడ్వకేట్ జనరల్ మూడు రోజుల సమయం కోరారు. అప్పటి వరకు జనాలు ప్రాణాలు కోల్పోవాలా అని సీరియస్ అయ్యింది. మందుల రేట్లు, ప్రైవేట్ హాస్పిటల్ అధిక బిల్లులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ సమయంలో హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని తామెలా ఆదేశాలిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఆక్సిజన్‌పై అప్రమత్త అవసరం:
కొవిడ్ నిబంధనల అమలుపై కార్యాచరణ రూపొందించాలని ఆక్సిజన్ సరఫరాపై కేంద్ర, రాష్ట్రాలు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. డిమాండ్‌కు తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కొవిడ్ మూడో దశ కూడా పొంచి ఉందని అంటున్నందున ప్రణాళిక చెప్పాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలపై జివొఇవ్వాలని సూచించింది. రంజాన్ వేడుకలపై..ఈనెల 14న రంజాన్ వేడుకలను వీడియోగ్రఫీ చేయాలని పోలీసులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రంజాన్ వేడుకలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని చెప్పింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది.
సిపిలకు హైకోర్టు సూచనలు :
రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు హైకోర్టు కీలక సూచనలు చేసింది. లాక్‌డౌన్ కారణంగా వెసులుబాటు కల్పించే సమయం మొత్తాన్ని వీడియో గ్రఫీ చేయాలని మూడు కమిషనర్లేటకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది ఆయా పీఎస్ పరిధిలో వీడియో గ్రఫీ చేయాలని ఆదేశించింది. కోవిడ్ నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

TS HC serious on police for stop ambulances at border

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News