Tuesday, April 23, 2024

న్యాయవాద దంపతుల హత్యకేసు: పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం..

- Advertisement -
- Advertisement -

న్యాయవాద దంపతుల హత్యకేసు
పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. దర్యాప్తుపై ప్రశ్నల వర్షం…

High Court hearing on 3rd TMC of Kaleshwaram project

మన తెలంగాణ/హైదరాబాద్: న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణి హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా సాగుతున్నట్లు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. గత నెల 17 నుంచి 24 వరకు జరిగిన దర్యాప్తు నివేదికను రామగుండం అదనపు సిపి ఉన్నత న్యాయస్థానానికి సమర్పించారు. హత్యలు జరిగిన వెంటనే పోలీసులు స్పందించారని అడ్వొకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వివరించారు. సాక్షాలు, రక్తపు మరకలు, సీసీ ఫుటేజీలు, కాల్‌డేటా రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కీలక ఆధారాలను గుర్తించేందుకు యత్నాలు జరుగుతున్నాయని వివరించారు. పోలీసులు సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం దర్యాప్తు తీరుపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రత్యక్ష సాక్షులను వాంగ్మూలాలను సిఆర్‌పిసి164 ప్రకారం మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశారా? అని ప్రశ్నించింది. ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని, వామన్‌రావు తండ్రి వాంగ్మూలాన్ని ఈ నెల 4న మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనున్నట్లు చెప్పారు.

నలుగురు నిందితులు నేరాన్ని అంగీకరిస్తూ వాంగ్మూలాలిచ్చారని పోలీసులు నివేదించారు. నిందితుల వాంగ్మూలాలను సిఆర్‌పిసి 164 ప్రకారం మెజిస్ట్రేట్ ఎదుట ఎందుకు నమోదు చేయలేదని కోర్టు ప్రశ్నించగా పోలీసులను అడిగి తదుపరి నివేదికలో వివరాలు సమర్పిస్తామని ఎజి పేర్కొన్నారు. ఘటనాస్థలం వద్ద ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణీకులు, వీడియో చిత్రీకరించిన వారి సాక్షాలు కీలకమే కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. వారి వాంగ్మూలాల నమోదుకు మేజిస్ట్రేట్ వద్ద దరఖాస్తు చేస్తామని ఎజి తెలిపారు. హత్య జరిగినప్పుడు రహదారిపై ఉన్న వాహనదారులు, బస్సుల్లోని ప్రయాణీకులను గుర్తించారా? అని హైకోర్టు ప్రశ్నించగా ఇప్పటికే కొందరిని గుర్తించామని, మరికొందరిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. మంథని కోర్టు వద్ద సీసీ దృశ్యాలు సేకరించామని, హత్యాస్థలి వద్ద సీసీ కెమెరాలు లేవని, కొంతమంది రికార్డు చేసిన దృశ్యాలు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపినట్లు ఎజి తెలిపారు. సాక్షుల భద్రతకు చర్యలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. వామన్‌రావు గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశామని, సాక్షుల భద్రతకు తగిన చర్యలు చేపట్టినట్లు అడ్వొకేట్ జనరల్(ఎజి) వివరించారు. రెండు వారాల్లో మరో స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను మార్చి 15కి వాయిదా వేసింది.

TS HC Serious on Police in lawyer murder case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News