Home తాజా వార్తలు తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు కన్నుమూత

తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు కన్నుమూత

TS movement stalwart Dr Kolluri Chiranjeevi dies

 

సిఎం కెసిఆర్ సంతాపం
కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కెటిఆర్, మంత్రి ఈటల దిగ్భ్రాంతి, పలువురు ప్రముఖుల సంతాపం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమవీరుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి కన్నుమూశారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ చిరంజీవి కోల్లూరి వయస్సు 74 ఏళ్లు. గత కొంత కాలంగా అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఎంఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున 1:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబం ఆసుపత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉందని తెలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ సిఎం అత్యవసర నిధి నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. చిరంజీవిని రక్షించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1947 ఫిబ్రవరిలో చిరంజీవి వరంగల్‌లో జన్మించారు. తల్లి టీచర్, తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.

కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘం నేతగా చురుకుగా పనిచేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి ఆ తర్వాత పీపుల్స్ వార్ గ్రూప్ (ప్రస్తుత మావోయిపస్టు పార్టీ)లో పనిచేశారు. కొండపల్లి సీతారామాయ్యతో పాటు పనిచేశారు. 1977లో పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. ఆ తర్వాత బిఎస్పీలో చేరి ఆ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాంకు దగ్గరయ్యారు. ‘బహుజన పత్రిక’కు ఎడిటర్‌గా పనిచేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమంలోనూ యాక్టివ్‌గా ఉన్నారు.

సిఎం సంతాపం
తొలి తరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్‌గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంత్రి కెటిఆర్ పరామర్శ
కొల్లూరి పార్థివ దేహానికి మంత్రి కెటిఆర్ నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. డాక్టర్‌గా ఉన్నత చదువులు చదివి సమాజం కోసం బతికిన చిరంజీవి జీవితం ఆదర్శనీయమన్నారు. డాక్టర్ చిరంజీవి మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డాక్టర్ కొల్లూరి చిరంజీవి పార్థివ దేహాన్ని సందర్శించి మంత్రి ఈటల నివాళులర్పించారు.

TS movement stalwart Dr Kolluri Chiranjeevi dies