Friday, April 19, 2024

గ్రూప్ 1 పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు

- Advertisement -
- Advertisement -

Hyd Collector denied Allegations of Malpractice in Group 1 Exam

గ్రూప్ 1 పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదు
మూడు కేంద్రాలలో ప్రశ్నాపత్రం మారడంతో అభ్యర్థులకు అదనపు సమయం ఇచ్చాం
గ్రూప్ 1 పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై హైదరాబాద్ కలెక్టర్ నివేదిక
ఈ ఘటనపై పూర్తి విచారణ తర్వాత చర్యలు: టిఎస్‌పిఎస్‌సి
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తన నివేదికలో స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఏ పరీక్షా కేంద్రంలోనూ ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోలేదని పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీన జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ టిఎస్‌పిఎస్‌సికి తన నివేదికను అందజేశారు. హైదరాబాద్‌లో మూడు పరీక్ష కేంద్రాలలో ఇన్విజిలేటర్ల తప్పిదం వల్ల గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షను ఆలస్యంగా నిర్వహించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని సెయింట్ ఫ్రాన్సిస్ డీ సేల్స్ (ఎస్‌ఎఫ్‌ఎస్) హైస్కూల్‌లో మూడు గదులలో మొత్తం 47మంది అభ్యర్థులకు ఇంగ్లీష్/తెలుగు ప్రశ్నాపత్రానికి బదులు ఇంగ్లీష్/ నాన్ తెలుగు లాంగ్వేజ్ ప్రశ్నాపత్రం ఇవ్వడంతో.. అభ్యర్థులు అయోమయానికి గురయ్యారని, అయితే సిబ్బంది వెంటనే అప్రమత్తమై అభ్యర్థులకు ఇంగ్లీష్/ తెలుగు ప్రశ్నాపత్రాలు ఇన్విలేటర్లు కొత్త ఓఎంఆర్ షీట్లను అందజేశారని వివరించారు. కొత్త ఓఎంఆర్ షీట్లలో రాస్తే తమ ప్రశ్నాపత్రాలను టిఎస్‌పిఎస్‌సి మూల్యాంకనం చేయదనే అనుమానంతో అభ్యర్థులు నిరసనకు దిగారని, ఈ విషయంపై అభ్యర్థులతో చర్చించి వారికి నచ్చచెప్పడానికి సమయం పట్టిందని అన్నారు. దీంతో వారికి అదనపు సమయం ఇవ్వాల్సి వచ్చిందని కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు.

మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 గంటలకు అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి, అనంతరం వారి నుంచి ఓఎంఆర్ షీట్లను తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఇదే కారణంతో అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ సెంటర్‌లో ఇద్దరు అభ్యర్థులకు 15 నిమిషాలు, ఐదుగురు అభ్యర్థులకు 30 నిమిషాలు, లిటిల్ ఫ్లవర్ హై స్కూల్‌లోని కేంద్రంలో 15మంది అభ్యర్థులకు 7 నిమిషాలు అదనంగా సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. టిఎస్‌పిఎస్‌సితో సంప్రదించిన తర్వాతనే… అధికారుల సూచనల మేరకు కొందరు అభ్యర్థులకు కోల్పోయిన సమయానికి బదులుగా అదనపు సమయం మంజూరు ఇచ్చినట్లు వివరించారు. పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపారు. ఈ సమస్యకు కారణమైన ఇన్విజిలేటర్లపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
పూర్తి విచారణ తర్వాత చర్యలు: టిఎస్‌పిఎస్‌సి
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో సికింద్రాబాద్ మారేడ్‌పల్లిలోని సెయింట్ ఫ్రాన్సిస్ డీ సేల్స్ (ఎస్‌ఎఫ్‌ఎస్) హైస్కూల్ కేంద్రంలో అభ్యర్థులకు అదనపు సమయం ఇచ్చిన ఘటనపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తమకు నివేదిక అందజేశామని టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనిత రామచంద్రన్ తెలిపారు. ఈ ఘటనపై సంబంధించిన అంశాలను పరిశీలించి, పూర్తి విచారణ నిర్వహించిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Hyd Collector denied Allegations of Malpractice in Group 1 Exam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News