Thursday, April 25, 2024

8నుంచి రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..?

- Advertisement -
- Advertisement -

RTC Bus

మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో ఈ నెల 8వ తేదీ నుంచి సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో గత 70 రోజులుగా రోడ్డెక్కని సిటీ బస్సులు మరో ఐదు రోజుల్లో మళ్లీ రోడ్లపైకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సడలింపులు ఇవ్వడంతో సిటీ బస్సులతో పాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఆర్‌టిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బస్సులు ఏ విధంగా నడపాలనే దానిపై చర్చించారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయని, ఈ నేపథ్యంలో సిటీలో బస్సు సర్వీసులు లేకపోవటంతో అటు సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమావేశంలో చర్చించారు. నగరంలో నిత్యం 33 లక్షల మంది ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం సాగిస్తారు, అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోందన్నారు. ఇక షేర్ ఆటోల్లో ప్రయాణం ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో అటువైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, దాంతో ఎక్కువ మంది సొంత వాహనాలను రోడ్డెక్కించారని తెలిపారు. దాంతో నగర రోడ్లపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు.

త్వరలో అధికారిక ప్రకటన
ఇప్పటికే రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రజా రవాణాకు అనుమతించారు. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత దృష్ట్యా జిల్లాల నుంచి వచ్చే బస్సులను తొలుత నగర శివార్ల వరకే అనుమతించారు. కొన్ని రోజులకు సిటీలోకి వచ్చేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత నెల 27న తీసుకున్న నిర్ణయం మేరకు ఎంజిబిఎస్ వరకూ బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రాత్రి వేళలోనూ ఆటోలకు అనుమతించారు. కానీ, హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకూ సిటీ బస్సులు, మెట్రో రైళ్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. అంతర్ రాష్ట్ర రవాణాకు సంబంధించి కూడా మంత్రి చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సిటీ త్వరలో సిటీ బస్సు సర్వీసులపై అన్ని అంశాలను చర్చించి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

TSRTC Buses resume from June 8th in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News