Saturday, April 20, 2024

లోడ్ తగ్గితే గ్రిడ్ దెబ్బతినదు

- Advertisement -
- Advertisement -

cmd prabhaker rao

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలోని లైట్లన్నీ ఆర్పేస్తే విద్యుత్ గ్రిడ్ దెబ్బతింటుందన్న ప్రచారంలో వాస్తవం లేదని విద్యుత్ శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఒక్కసారిగా లోడ్ పడిపోతే గ్రిడ్ దెబ్బతింటున్న కథనాల్లో వాస్తవం లేదని తెలంగాణ జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు తెలిపారు. లోడు తగ్గితే గ్రిడ్ దెబ్బతింటుందని, కుప్పకూలుతుందని ప్రచారం చేసే వారు అసలు ఇంజినీర్లే కాదని ఆయన ఆరోపించారు. ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపివేయడం వల్ల పవర్ గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం పడదని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వార్తలపై ఖండన
గతంలో విద్యుత్ లోడు ఒక్కసారిగా 20 నుంచి -30 శాతానికి పడిపోయిన సందర్భాలున్నాయని అప్పడు గ్రిడ్లకు ఏమీ కాలేదని ప్రభాకర్ రావు తెలిపారు. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రిడ్‌కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు. లైట్లు ఆపివేస్తే గ్రిడ్ కుప్పకూలుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉందని, తమ ఇంజనీర్స్ అందరూ అప్రమత్తంగా ఉన్నారని ఇప్పటికే జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామని ప్రభాకర్ రావు తెలిపారు. సోషల్ మీడియాలో ఇంజినీర్ల పేరిట వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఒకవైపు కరోనా వ్యాప్తి నిరోధానికి యుద్దం, మరోవైపు లాక్‌డౌన్ ఇలా దేశమంతా ఒక్కతాటిపైనే ఉందని చాటేందుకు మన ప్రభుత్వాలు సంకల్పించాయని పవర్‌గ్రిడ్‌కు ఎలాంటి నష్టం జరగదని, నిశ్చంతగా అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

రాజకీయ ఎత్తుగడలో భాగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు అన్నీ ఆర్పేసి.. దీపాలు, కొవ్వొత్తులు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు గానీ వెలిగించాలని పిలుపునిచ్చారు. దీపాలను వెలిగించడం సరికొత్త నవోదయానికి నాందీగా భావించే హిందూ దేశంలో ప్రధాన మంత్రి పిలుపు వెనుక సనాతన హిందూ ఆచారం దాగి వుందని గుర్తించని కొందరు మోదీ పిలుపును తప్పు పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సహజంగానే మోదీని నిత్యం వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంపై నిందలు వేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరికొందరు ఫేక్ ఇంజనీర్లుగా మారి ఒకేసారి పెద్ద ఎత్తున విద్యుత్ లైట్లను ఆర్పేస్తే లోడ్ ఒక్కసారిగా పడిపోయి విద్యుత్ గ్రిడ్లు దెబ్బతింటాయని ప్రచారం చేస్తున్నారని ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగమని వారు ఆరోపిస్తున్నారు.

 

Turning off lights will not affect power grid
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News