Home తాజా వార్తలు ఉద్యోగుల జీతాలకు ఇక్కట్లు

ఉద్యోగుల జీతాలకు ఇక్కట్లు

atm

 బ్యాంకుల రెండు రోజుల సమ్మెతో వేతన జీవుల్లో గుబులు

 ఏటిఎంల వద్ద పెరగనున్న రద్దీ

ముంబై: బ్యాంకు ఉద్యోగుల బుధవారం నుంచి చేపట్టనున్న సమ్మెతో వేతన జీవుల్లో గుబులు మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు నెలాఖరున బ్యాంకుల్లో జీతాలు పడతాయి. సరిగ్గా నెలాఖరు సమయంలోనే బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులపాటు సమ్మె తలపెట్టారు. అంటే ఈనెల 30, 31 తేదీల్లో బ్యాం కుల సేవలతో పాటు ఎటిఎలపైనా ప్రభావం పడనుంది. మళ్లీ జూన్ 1వ తేదీ శుక్రవారం నుంచి బ్యాంకులు సేవలను ప్రారంభిస్తాయి.  దీంతో ఉద్యోగులు జీతాలు ముందే క్రెడిట్ అయినా విత్‌డ్రా చేసుకోవడం కష్టంగా మారింది. ఎటిఎంల వద్ద ఇక్కట్లు తప్పవని భావిస్తున్నారు. మే 30, 31 తేదీల్లో బ్యాంకుల బంద్ ఉండడంతో.. పలు కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాలను మంగళవారమే క్రెడిట్ చేసినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల వేతనాలు మంగళవారం పడినప్పటికీ, మరుసటి రోజు ఎటిఎంల నుంచి విత్‌డ్రా చేసుకునేందుకు బంద్ ప్రభావం ఉండనుంది. బంద్‌లో ఎటిఎం గార్డులు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎటిఎంలు మూతపడనున్నాయని, దీనివల్ల జీతాల ఉపసంహరణ కష్టతరంగా మారనుందని భావిస్తున్నారు. థర్డ్ పార్టీతో కలిసి బ్యాంకులు ఎటిఎంలను నింపినప్పటికీ, ఎటిఎంల సెక్యూరిటీకి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశముంది. ఇవన్నీ చూస్తే కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. బ్యాంక్‌ల బంద్ నేపథ్యంలో ఎక్కువ మంది కస్టమర్లు ఎటిఎంల వద్దకు రావడం, భారీగా నగదు విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో నగదు కొరత కూడా ఏర్పడుతుందని అపెక్స్ బ్యాంకు యూనియన్ ఎఐబిఇఎ జనరల్ సెక్రటరీ సిహెచ్ వెంకటచలం ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. అయితే ఈ రెండు రోజులు మాత్రం ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కేవలం 2 శాతం వేతన పెంపును మాత్రమే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆఫర్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకులు సమ్మె చేపడుతున్నాయి. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా విఫలమయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన జన్‌ధన్, డిమానిటైజేషన్, ముద్రా, అటల్ పెన్షన్ యోజన పథకాల పనులు గత రెండేళ్లుగా బ్యాంకు ఉద్యోగులు అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారని, అయి నా ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని యూనిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ల  కన్వీనర్ దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు. కాగా మే 30న ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు  సమ్మె నిర్వహించనున్నారు.  2012 సంవత్సరం నవంబర్ 1న వేతన ఒప్పందంలో భాగంగా వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంచాలని ప్రతిపాదించగా, దీనికి బదులుగా 2 శాతం పెంపును ఐబిఎ ఆఫర్ చేసింది. దీన్ని బ్యాంక్ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి.