మన తెలంగాణ/మరిపెడ : రెప్పపాటులో మూడు నిండు ప్రాణాలు అ గ్నికి ఆహుతయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ మృత్యువాత పడ్డారు. ఈ హృ దయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, ఎల్లంపేట స్టేజి సమీపంలోని జాతీయ రహదారి 563పై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం, జోద్‌పూర్, కేజర్ల ప్రాంతానికి చెందిన రాజురాం చౌదరికి ఇద్దరు కుమారులు. లారీ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం నడుపుకుంటూ జీ వనం సాగిస్తున్నారు. అందులో భాగంగానే చేపల దాణా కోసం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వెళ్లిన తండ్రి, చిన్న కుమారుడు సర్వణ్ రాం (23) రెండు లారీలతో విజయవాడ నుంచి రాజస్థాన్‌కు లారీలతో బ యల్దేరారు.
కుమారుడు లారీ ముందు వస్తుండగా పది నిమిషాల వ్యవధిలో తండ్రి లారీ వెనుక నుంచి వస్తోంది. అదే క్రమంలో వరంగల్ జి ల్లా, వర్ధన్నపేట మండలం, నల్లబెల్లి పరిధిలోని రాంనాథ్ తండాకు చెం దిన గుగులోత్ గణేష్ (30) కరీంనగర్ నుంచి గ్రానైట్ లోడుతో కాకినాడకు వెళ్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, ఎల్లంపేట స్టేజీ సమీపంలో సర్వణ్ రాం నడుపుతున్న లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కరీంనగర్ నుంచి కాకినాడకు గ్రానైట్ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రాళ్లు క్యాబిన్లపైకి దూసుకురావటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి డ్రైవర్లు గుగులోత్ గణేష్, సర్వణ్, రాం క్లీనర్ బర్గత్ ఖాన్ (23) సజీవ దహనమయ్యారు. స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఫైర్ సిబ్బంది ఘటనా స్థ్ధలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో కొడుకు లారీ వెనకాలే వస్తున్న తండ్రి రాజురాం చౌదరి తన కుమారుడి వాహనం ప్రమాదానికి గురైనట్లు గుర్తించాడు. మృతుడు గణేష్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. క్లీనర్ బర్గత్ ఖాన్‌కు కూడా ఇటీవలే వివాహమైనట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిపై లారీలు దహనమవుతుండటంతో రెండు వైపులా భారీగా వాహనాలు నిలిపోయాయి. రాకపోకలకు అంతరాయం కలుగకుండా అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సిఐ రాజ్ కుమార్, ఎస్‌ఐలు బొలగాని సతీష్, గండ్ర సంతోష్ జెసిబిల సహాయంతో ప్రమాదానికి గురైన లారీలను పక్కకు జరిపి ట్రాఫిక్‌ను పునరిద్ధరించారు. మృతుడు గణేష్ భార్య అనసూర్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.