న్యూఢిల్లీ : తమను తరచూ వేధిస్తున్నాడన్న కక్షతో షాపు యజమానిని తుపాకీతో కాల్చి చంపిన ఇద్దరు బాలనేరస్థులను పోలీసులు పట్టుకోగలిగారు. ఈశాన్య ఢిల్లీ జాఫ్రాబాద్లో చౌహాన్ బంగార్లో శనివారం రాత్రి షాపు యజమాని అఫ్జల్ (26) ను హత్య చేశారు. ఆరు మాసాల క్రితం హతుడు అఫ్జల్కు నిందితులు ఇద్దరికి మధ్య ఘర్షణ తలెత్తింది. అయితే రెండు కుటుంబాలు ఈ వివాదాన్ని అప్పుడు పరిష్కరించుకున్నాయి. కానీ ఆ తరువాత కూడా వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో బాలనేరస్థులు షాపు యజమానిని అంతమొందించాలని పన్నాగం పన్ని నాటు తుపాకీతో కాల్చి చంపారు. నిందితులను జాఫ్రాబాద్ మెట్రో పోలీస్ స్టేషన్లో అదుపు లోకి తీసుకున్నారు. వారి నుంచి నాటు తుపాకీ, తూటాలు స్వాధీనం చేసుకున్నారు.