Friday, March 29, 2024

ఇద్దరు మావోయిస్ట్ కొరియర్ల అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /భద్రాచలం: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 39 బెటాలియన్ సీఆర్‌పిఎఫ్, దుమ్ముగూడెం ఎస్‌ఐఇ రతీష్ తన సిబ్బందితో కలిసి దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మావోయిస్ట్ కొరియర్లను అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఎఎస్‌పి రాజేష్‌చంద్ర తెలిపారు. గురువారం స్థానిక ఎఎస్‌పి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బైరాగులపాడు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని ప్రశ్నించగా వారి వద్ద సీపిఐ మావోయిస్ట్‌కి సంబంధించిన గోడపత్రాలు లభ్యమయ్యాయి. గోడపత్రాలపై ఎర్రటి అక్షరాలతో చర్ల శబరీ ఏరియా ఆదివాసీ విప్లవ కూలీ సంఘం, ఆదివాసీ విప్లవ మహిళా సంఘం పేర్లతో వ్రాయబడి ఉంది.

పోలీసులకు లభ్యమైన గోడపత్రాలపై ఈ విధంగా ఉంది.

1. ప్రభుత్వం 50 ఆకుల తునికాకు కట్టకు రూ.3 చెల్లించాలని.

2.ప్రమాదవశాత్తు చనిపోయిన తునికాకు కూలీకి నష్టపరిహారం రూ.5 లక్షలు చెల్లించాలి.

3. పత్తి, మిర్చి కూలీకి రోజుకు రూ.250 చెల్లించాలి.

4. వరి, మొక్కజొన్న కూలీకి రోజుకు రూ. 350 చెల్లించాలి.

5. యజమానులారా కూలీలను మోసం చేయకండి. గ్రామగ్రామాన సార,బ్రాందీ బందుకై పోరాడండి.

పోలీసులకు చిక్కిన కొరియర్లలో మొదటి వ్యక్తి శ్యామల రవి, చర్ల మండలం కలివేరుకు చెందినవాడు. ఇతడు ఐటిసీ పేపర్‌బోర్డులో సెంట్రిగ్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. రెండవ వ్యక్తి దుమ్ముగూడెం మండలం వీరభద్రపురంకు చెందిన కణితి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఇతడు వ్యవసాయం పనులు చేస్తున్నట్లు ఎఎస్‌పి తెలిపారు. వీరు గతంలో మావోయిస్ట్ పార్టీకి కొరియర్లుగా పనిచేశారని, పార్టీ ఆదేశాల మేరకు వాల్‌పోస్టర్లను తీసుకువెళుతున్నట్లు ఆయన చెప్పారు. నిందితులను విచారించి కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. ఈ సమావేశంలో దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రతీష్‌లు పాల్గొన్నారు.

two Maoist couriers Arrested in Kothagudem

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News