Home తాజా వార్తలు ‘వర్క్ ఫ్రం హోం’ పేరిట మల్టీ లెవల్ మోసం

‘వర్క్ ఫ్రం హోం’ పేరిట మల్టీ లెవల్ మోసం

unemployed

 

నిరుద్యోగ యువతకు వల.. ఇద్దరి అరెస్ట్
పోలీసులకు ఫిర్యాదుతో వెలుగుచూసిన వైనం

మల్కాజిగిరి : మల్టీ లెవల్ మార్కెటింగ్ ముసుగులో వర్క్ ఫ్రం హోం పేరిట నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేసిన ఇద్దరిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్‌లోని ఆలుగడ్డ బావికి చెందిన మునుకుల షాలిని (24), రామాంతాపూర్‌లో నివాసముండే బరిగె బాల్ రాజ(30)లు కలిసి సికింద్రాబాద్‌లోని కార్కాణాలో వర్క్ ఫ్రం హోం పేరిట మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులను ఆకర్శించి ఉద్యోగం ఆశ కల్పించేవారు.

ఇందులో చేరే వారు మొదట రూ.2500 చెల్లించాలి. అనంతరం వారికి కొన్ని నియమ నిబంధనలు పెట్టి కొంత పనిని ఇచ్చేవారు. వారు చెప్పిన ప్రకారం పని చేస్తే నెలకు కొంత డబ్బు వస్తుందని మభ్య పెట్టే వారు. మల్లా పూర్ అశోక్ నగర్‌కు చెందిన టి. మౌనిక ఉద్యోగం ఆశతో తన స్నేహితురాలి ద్వారా ఇందులో రుసుము చెల్లించి చేరింది. తరువాత షాలిని తమ సంస్థను మల్కాజిగిరిలోని వాణీ నగర్‌కు మార్చారు.

మౌనిక తన స్నేహితులను దాదాపు 30 మందిని చేర్చింది, కానీ సంస్థ నిర్వాహకులు చెప్పినట్లుగా తమకు ఎలాంటి డబ్బులు రాక పోవడంతో నిర్వాహకులను నిలదీయగా వారు నిర్లక్షంగా సమాధానం ఇవ్వడమే కాకుండా డబ్బులు చెల్లించి చేరిన వారిపట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితులు మోసపోయామని గ్రహించి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సంస్థ నిర్వాహకులు షాలిని, బాల్ రాజ్‌ను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Two people arrested for cheating the unemployed