Friday, April 26, 2024

చెప్పనలవికాని అమానుషం

- Advertisement -
- Advertisement -

Sampadakiyam

 

మహారాష్ట్రలో మొన్న గురువారం నాడు ఇద్దరు సాధువులను, వారు ప్రయాణం చేస్తున్న కారు డ్రైవర్‌ను కొట్టి చంపిన అమానుషాన్ని ఖండించడానికి మాటలు చాలవు. ఈ దారుణంలో చనిపోయిన ఇద్దరు సాధువులలోనూ ఒకరు 70 ఏళ్ల వృద్ధుడు. సూరత్‌లో, తెలిసిన వారింట అంత్యక్రియలకు వెళుతున్న వీరిని, పసిపాపలను ఎత్తుకుపోయే దొంగలుగా అనుమానించి హతమార్చారు. అతిపెద్ద మూక, కారును అడ్డగించి రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ దుర్మార్గం మహారాష్ట్రలోని పాల్‌ఘడ్ జిల్లాలో చోటు చేసుకున్నది. కాపాడడానికి వెళ్లిన పోలీసు బృందం మీద కూడా దాడి చేసి వారిలో ముగ్గురిని గాయపర్చారు. దానితో వారు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోయారు. భయానుమానాలు కలిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా పట్టి బంధించి వారికి అప్పజెప్పడం పద్ధతి. అటువంటి చట్టబద్ధమైన ఆధునిక మనస్తత్వం ప్రజలకు బొత్తిగా అలవడకపోడం వల్లనే ఇటువంటి మూక దాడులు, అమానుష హత్యలు జరుగుతున్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

నిప్పు ఒక చోట కాల్చివేసి మరోచోట ముద్దు పెట్టుకోదు. గతంలో మైనారిటీలు, దళితులపై మూక హత్యలు జరిగినప్పుడు దేశమంతా ఒక్క కంఠంతో ఖండించి ఉంటే ఇప్పుడు ఇలాంటివి జరిగి ఉండేవి కాదు. ప్రజలే కాదు చట్టాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానాల్లోని వారు కూడా ఒక్కొక్కసారి అదుపు తప్పి అవధులు మీరి దానిని తమ చేతుల్లోకి తీసుకొని తామే శిక్షలు అమలు చేయడమూ జరుగుతున్నది. అందుచేత ప్రజలకు కూడా ఆ ధోరణి అలవడిపోతున్నదని అనిపిస్తే ఆక్షేపించవలసిన పని లేదు. ఆగకుండా కారులో పారిపోతున్నందున అనుమానం బలపడి రాళ్లు, కర్రలతో దాడికి దిగి ఉండవచ్చుననుకోడానికీ ఆస్కారం లేదు. ఎందుకంటే 200 మందితో కూడిన అతిపెద్ద సమూహం అది. కారును ఆపడం, వారిని బంధించి పోలీసులకు అప్పగించడం అంతటి పెద్ద మూకకు అలవికాని పని కాదు. ఈ దారుణ ఘటనలో హతులు, హంతకులు ఒకే వర్గానికి చెందిన వారై పోయారు కాబట్టి సరిపోయింది.

వేర్వేరు మతాలకు చెందిన వారై ఉంటే ఇప్పటి పరిస్థితుల్లో అది ఎటువంటి ప్రతీకార దాడులకు, అశాంతికి దారి తీసి ఉండేదో చెప్పలేము. అసలే గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో మతపరమైన హింసాత్మక ఘటనలు, మూక హత్యాకాండ లు తరచూ జరుగుతున్నాయి. హేతువాదులను బలి తీసుకోడం, విశ్వవిద్యాలయాల మీద దాడులకు తెగబడడం కూడా సంభవించాయి. సాధువులంటే దేశ ప్రజల్లో ఆరాధనా భావం సహజం. కారులో వెళుతున్న ఇద్దరూ సాధువులు కావడం వారిలో ఒకరు వృద్ధుడు కావడం అనే వాస్తవం కూడా ఈ దారుణాన్ని ఆపలేకపోయింది. అంటే దుర్మార్గులు ఏ వేషంలోనైనా రావచ్చుననే అభిప్రాయం ఏర్పడి ఉండడమే ఇందుకు కారణం. సినిమాల్లో చూపించేటట్టు గళ్ల లుంగీ, బనియన్ ధరించేవాడే రౌడీ కానక్కరలేదు. పోలీసు దుస్తుల్లో మోసాలకు, దొంగతనాలకు పాల్పడే వారిని తరచూ చూస్తున్నాం. అలాగే ఫలానా మంత్రి, ముఖ్యమంత్రి, ఉన్నతాధికారికి పిఎనని చెప్పి నకిలీ నియామక పత్రాలిచ్చి నిరుద్యోగులను నిలువు దోపిడీ చేసే వారికి కరువు లేదు.

అప్పుడెప్పుడో సాక్షాత్తు ప్రధాని గొంతుతోనే ఫోన్‌లో మాట్లాడి ఆ రోజుల్లో బ్యాంకు నుంచి రూ. 60 లక్షలు తెప్పించుకున్న ‘ఘనుడి’ కేసు తెలిసిందే. అందుచేత సాధువులను కూడా ఆ వేషంలోని దొంగలని ఆ మూకకు అనిపించి ఉండవచ్చు. కాని ఆ సాధువుల మొర వినకుండా కొట్టి చంపడంలోని మూక మూర్ఖత్వం, అజ్ఞానమే భయపెడుతున్నాయి. ఇందుకుగాను పోలీసులు 110 మందిని ఆరెస్టు చేశారు. అందులో 9 మంది మైనారిటీ తీరని బాలలు. దేశానికి అతి గొప్ప రాజ్యాంగమున్నది. చట్టం నిర్దేశించిన పద్ధతిలో తప్ప ఎవరి ప్రాణాలను తీసే హక్కు, అధికారం ఎవరికీ లేదని అది చాలా గట్టిగా చెపుతున్నది. ఈ విషయాన్ని భారత రాజ్యాంగం 21వ అధికరణ స్పష్టం చేస్తున్నది. ఇక్కడ జీవించే హక్కు అంటే కేవలం ఊపిరితో ఉండే హక్కు మాత్రమే కాదు, సకల మానవ మర్యాదలతో, హుందాతనాలతో బతికే హక్కు అని అర్థం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసింది.

కాని దానిని మన ప్రజలకు హృదయ గతం చేయడంలోనే మనం విఫలమవుతున్నాము. అంగ, అర్ధ బలమున్న వారికి, కొండొకచో రాజకీయ నాయకులకు, పోలీసులకు సైతం తెలిసేలా చేయలేకపోతున్నాం. కరోనా లాక్‌డౌన్‌ను ఉల్లంఘించాడన్న కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లిలో ఒక యువకుడిని పోలీసులు కొట్టగా అతడు గుండెపోటుతో మరణించాడన్న సమాచారం తెలిసిందే.మహారాష్ట్రలో గతంలోనూ సామాజిక మాధ్యమాల్లో వదంతు లు పుట్టడంతో మూక హత్యాకాండలు అనేకం జరిగాయి. దేశంలో పలు చోట్ల కూడా సంభవించాయి. ఈ ఘటనల్లో హతులు ఎక్కువగా దళితులు, మైనారిటీలే.ప్రజలకు గల జీవన హక్కు ను గుర్తించే స్థాయి విద్య, మానవీయ చైతన్యం దేశంలో బొత్తిగా కలగకపోడమే ఈ దురాగతాల కు మూలకారణం. ఇకనైనా దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని అస్థిగతం చేయడం అత్యంత అవసరం.

 

Two saints and car driver were killed in Maharashtra
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News