Home కామారెడ్డి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి…

Road Accident

 

బోనాల పండుగకు వస్తుండగా ఘటన, భిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద ఘటన

కామారెడ్డి : ఆషాఢమాసంలో బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొనాలన్న ఉత్సాహంతో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తుండగా వారిని మృత్యువు కబళించింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున మండల పరిధిలో గల టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లాకు చెందిన గట్టు స్వామి చిలుకనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతనితో పాటు ఆయన సడ్డకుడు అయిన తార్నాకకు చెందిన మరో వ్యక్తి ఇట్ల శ్రీనివాస్‌లు ఇద్దరూ ద్విచక్ర వాహనం పై కామారెడ్డి పట్టణంలో జరిగే బోనాల పండుగకు వస్తున్నారు.

అప్పటికే వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణానికి వెళ్ళిపోయారు. వీరిద్దరూ ద్విచక్ర వాహనం పై అర్థరాత్రి ఇంటి నుండి బయలుదేరారు. భిక్కనూర్ టోల్‌ప్లాజ్ వద్ద ఉన్నటువంటి డివైడర్‌ను ఢీకొట్టారు. అందులో గట్టు స్వామి (25) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన పిట్ల శ్రీనివాస్ (35)ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా తూప్రాన్ ప్రాంతంలో మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. మృతి చెందిన వారిద్దరూ సడ్డకులు కావడంతో కామారెడ్డి పట్టణంలో ఉన్న వారి అత్తమామల ఇంట్లో విషాదఛాయలు నెలకొన్నాయి.

అక్కడ మహంకాళి బోనాలు జరగవలసి ఉండగా వారి ఇంటి నుండి బోనాలను అమ్మవారికి సమర్పించలేకపోయారు. మృతి చెందిన స్వామి చిలుకనగర్‌లో టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మరో మృతుడు శ్రీనివాస్ డ్రైవర్‌గా పని చేస్తూ వారి కుటుంబాన్ని నడుపుతున్నాడు. దీంతో కుటుంబాన్ని పోషించే ఇద్దరి పెద్దదిక్కు కోల్పోడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Two Teenagers Killed in Road Accident