Home జాతీయ వార్తలు యుపి చిన్నారి దారుణ హత్యపై అంతటా నిరసన…

యుపి చిన్నారి దారుణ హత్యపై అంతటా నిరసన…

Two year old Girl Murder

 

యుపి చిన్నారి హత్యపై వెల్లువెత్తిన ఆగ్రహం
ప్రాణం తీసిన 5వేల అప్పు వివాదం!
సిట్ ఏర్పాటు, ఐదుగురు పోలీసుల సస్పెన్షన్

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో రెండేళ్ల చిన్నారి పాపను పాశవికంగా హత్య చేసిన సంఘటన మానవత్వం తల దించుకునేలా చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ‘సిట్’ను ఏర్పాటు చేశారు. కేసుపట్ల నిర్లక్షంగా వ్యవహరించినందుకు అయిదుగురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు. పసిపాప దారుణ హత్యను ఖండిస్తూ సెలెబ్రిటీలు, సామాన్యులు ట్వీట్లు చేశారు. కేవలం 24గంటల్లోనే 50 వేల ట్వీట్లు వచ్చాయి. ఈ ఆటవిక చర్యకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదని, కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఒక చెత్తకుప్ప తొట్టి దగ్గర కుక్కలు ఆ చిన్నారి అవయవాలను పీక్కుతింటుండడం స్థానికులు చూడడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

మే 30 నుంచి అదృశ్యమైన బాలిక చివరికి శవమై కుప్పతొట్టిలో కనిపించింది. బాగా తెలిసిన పొరుగు వారే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. చిన్నారిని భయంకరంగా హత్య చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.బాలికను ఊపిరాడకుండాచేసి చంపారని, అయితే అత్యాచారం చేసినట్టు పోస్ట్‌మార్టంలో లేదని అలీఘర్ పోలీసులు తెలిపారు. నిందితులు జహీద్, అస్లాంలపై లైంగిక దాడుల నుంచి బాలలను కాపాడే చట్టం కింద (పోక్సో) తీవ్ర ఆరోపణలతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. నిందితులిద్దరూ చిన్నారి ఇంటికి సమీపంలోనే నివసిస్తున్నారు.

బాలిక కుటుంబం ఆరోపిస్తున్నట్టు ఆ పాప కళ్లు పీకలేదని, కానీ శరీరం శిథిలమైపోవడంతో అలా కనిపించిందని, ఆ అమ్మాయి ఇంటి సమీపంలోనే మృతదేహం కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆ పాప తండ్రి నిందితుల దగ్గర్నుంచి రూ 40,000 అప్పుగా తీసుకున్నారు. 35,000 తీర్చగా ఇంకా అయిదు వేలు చెల్లించాల్సి ఉంది. పాపను కిడ్నాప్ చేయడానికి ముందు జహీద్, అస్లాంలు ఆయనతో గొడవ పడ్డారు. బెదిరించారు.

అయిదుగురు పోలీసుల సస్పెన్షన్

జహీద్‌ను అరెస్ట్ చేయాలని అంతకు ముందు బాధిత కుటుంబీకులు ఒక రోజంతా నిరసన తెలిపారు. గురువారం రోడ్లను దిగ్బంధం చేశారు. నిందితులనే కాక, వారి కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి ఆచూకీ కనిపెట్టడంలో నిర్లక్షంగా వ్యవహరించినందుకు అయిదుగురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు. కేసు తీవ్రత దృష్టా దీన్ని జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అంతేకాక, ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సీనియర్ పోలీస్ అధికారి కులహరి తెలిపారు. ‘చిన్నారిని అస్లాం ఇంట్లో దాచి ఉంచినట్టు ఇంటరాగేషన్‌లో జహీద్ చెప్పాడు. ఆ తర్వాత ఆ శవం కుప్ప తొట్టిలో కనిపించింది’ అన్నారాయన.

ప్రముఖుల దిగ్భ్రాంతి

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హంతకులపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘ఎవరైనా ఓ పసిపాపను ఇంత క్రూరంగా హింసిస్తారా?’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన అలాంటి నేరస్థుల్ని శిక్షించకుండా వదలకూడదని విజ్ఞప్తి చేశారు. ‘అలీగఢ్‌లో రెండేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేశారని తెలిసి షాకయ్యాను. హంతకులను న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు యుపి పోలీసులు చురుకుగా వ్యవహరించాలి’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా ‘ఓ అమాయిక బాలికపై జరిగిన ఈ అమానుష కృత్యం గురించి మాటల్లో చెప్పలేం. ఆ తల్లిదండ్రుల బాధ ఎలాంటిదో చెప్పలేను’ అన్నారు.

 

Two year old Girl Murder in UP

Two year old Girl Murder in UP