Home ఆఫ్ బీట్ కాలం చెట్టుపై శ్రీవిళంబి కోకిల

కాలం చెట్టుపై శ్రీవిళంబి కోకిల

Ugadi2

ఉగస్య ఆదిః ఉగాదిః అంటారు. ఉగ అంటే నక్షత్రం. దీనికి ఆరంభం అని అర్థం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఉగాదినాడే బ్రహ్మ సృష్టికార్యం ప్రారంభించాడు. ఇది పురాణ వచనం. శ్రీ మహావిష్ణువు మత్సావతారం ధరించి సోమకుణ్ణి సంహరించి, వేదాల్ని రక్షించిందీ ఈ రోజేనట. విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులైనదీ ఈ రోజేనట. ఉగాది పర్వదినం ఆచరించిన దాఖలాలు మహాభారతంలో కూడా కనిపిస్తాయి. వసంతవేళ కొత్త చిగుళ్ళు తొడుగుతాయి. కోకిల గానాలతో ప్రకృతి కొత్త సోయగాలు దిద్దుకుంటుంది.

కొత్త జీవితానికి నాంది: ఉగాదినాడు తెల్లవారుజామునే నువ్వుల నూనెతో ఇంటిల్లిపాదీ అభ్యంగన స్నానాలు చేసి, కొత్త దుస్తుల ధారణ, ఇష్టదేవతారాధనతో షడ్రుచుల ఉగాది పచ్చడిని సేవిస్తారు. షడ్రుచుల ఉగాది పచ్చడి మనిషి జీవితంలో కష్టసుఖాలకూ, సంఘ జీవితంలో ఒడిదుడుకులకూ సంకేతం. జడప్రాయమైన జగత్తులో చైతన్యం నింపి మానవాళిలో కొత్త ఆశలు, కొత్త చిగుళ్లు చిగురింపచేసే గొప్ప పండుగ ఉగాది. అప్పటివరకు జరిగిన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, సరికొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో, కొత్త ఆశయాలతో జీవితానికి నూతన అర్థం చెప్పుకుని ముందుకు సాగిపోయేందుకు సంకల్ప దీక్షపూనే రోజు ఉగాది.

తెలుగువారు ఇప్పుడు ఆంగ్ల సంవత్సరాది నాడు హడావిడి చేస్తున్నారు. అలా కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పుకోవడం, కేరింతలు కొట్టడం యూరోపియన్ సంప్రదాయం. ప్రపంచమంతా ఒకే కేలండర్ ఉపయోగిస్తున్నప్పటికీ, బ్రిటీష్ వలసవాద పాలకుల సంప్రదాయాన్ని, ఆనాటి వలస మనస్తత్వంతో ఈనాటికీ మనం కొనసాగిస్తున్నాం. కానీ తెలుగువారి నిజమైన సంవత్సరారంభ వేడుక, తెలుగువారు కేరింతలు కొట్టే నిజమైన సంప్రదాయ పర్వదినం ఉగాది పండుగే. రామాయణకాలంలో వైశాఖ, జ్యేష్ట మాసాలను వసంతం అనేవారట. మనం చైత్రం, వైశాఖాలను వసంతం అంటున్నాం. అయితే కాలగమనంలో ఋతువులలో, వాతావరణంలో మార్పులు రావడం వల్ల కొన్ని తేడాలు వస్తున్నాయి.

వేప పచ్చడి: ఉగాదినాడు మన ఇంటి గుమ్మాలకు పసుపురాసి, కుంకుమబొట్లు పెట్టి, మామిడి ఆకుల దండలతో, పచ్చపచ్చని పూలమాలల దండలతో ఇంటి ద్వారాలను అలంకరించాలి. స్నేహితులను, బంధువులను మన ఇంటికి ఆహ్వానించాలి. ఆనందకరమైన సంభాషణలు చేయాలి. హృదయాలలో ఉల్లాసం నింపుకోవాలి. పాతవైరాలు వదిలపెట్టి, కొత్తగా స్నేహాలు ఆరంభించాలి. అలా వారితో కలిసి ఉగాది పచ్చడి సేవించడంతో దినచర్య ప్రారంభించాలి.
వేపపువ్వు, లేత మామిడికాయ, చింతపండు, బాగామగ్గిన అరటిపండు, చెరకుగడ ముక్కలు, బెల్లం, జామకాయలు, కొత్తకారం, ఉప్పు, వంటివి సమ్మిళితం చేసి పచ్చడి తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరికోరు, పుట్నాల పప్పుపొడి, బెల్లంపొడి ఉపయోగిస్తారు.

పలు ప్రాంతాల్లో ఉగాది:ఉగాది పర్వదినాన్ని తెలుగువారే కాదు, అనేక చోట్ల చేసుకుంటారు. అందుకే ఇది దేశదేశాల పండుగ. తెలుగు, తమిళ, కన్నడ, కొంకణి ప్రాంత ప్రజలీ పర్వదినం చేసుకుంటారు. తమిళనాట ఇది పుత్తాండు పండుగగా ప్రసిద్ధి. తెలుగు, కన్నడ ప్రజలు ఉగాది అనీ, మలయాళీయులు విషు అనీ, మహారాష్ట్రీయులు గుడిపడ్వా అని, సిక్కులు వైశాఖీ, బెంగాలీయులు పొయ్ లా బైశాఖ్ అనీ, రాజస్థానీయులు థాప్మా అనీ, సింధీలు చేటిచెండ్ అనీ ఈ పర్వదినాన్ని పిలుస్తారు. మారిషస్, ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా ఉగాది పర్వదినాన్ని వేరువేరు పేర్లతో చేసుకుంటారు.

పంచాంగ శ్రవణం: సూర్యుడు పన్నెండు రాశులలో సంచరిస్తాడు. ఈ రాశులే మాస సంకేతాలు. ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేయడం, కవితాగోష్ఠులను ఆస్వాదించడం మన సంప్రదాయంగా మారింది. తిథి, వార, నక్షత్ర, యోగం, కరణం అనే ఐదు భాగాల కలయికే పంచాంగం. పంచాంగ శ్రవణం ద్వారా శుభాలు కలుగుతాయి. ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆ ఏడాది వివిధ కాలాలలో జరిగే పరిణామాలను సామూహికంగా వచ్చే కష్టనష్టాలను, అంతరిక్షంలో ఏర్పడే సూర్య, చంద్రగ్రహణాది అద్భుతాలను వివరించి గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా, ముందు జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరిస్తారు.
కవితాగోష్టులు: ఉగాదినాడు ప్రతి ప్రాంతంలో, నగరంలో పండితులు, కవులు ఒకచోట గుమిగూడి కవితాగోష్టులు నిర్వహించడం, గతకాలంలో జరిగిన అప్రతిష్ఠ, అనైతికత, నీతికీ విలువలకూ సమాజం కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకతలను వివరిస్తూ అందమైన తెలుగుభాషలో అద్భుతమైన కవితలు వల్లెవేస్తూ, పండిత పామరులను అలరించడం ఒక సంప్రదాయంగా మారింది.

ప్రభుత్వాలు కూడా ఆనాడు పండితులు, కవులు, కళాకారులు, సాహితీవేత్తలను ఎంపికచేసి గౌరవ పురస్కారాలిచ్చి సన్మానించడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా మారింది. మనలోని ప్రతిభావంతులను, గొప్పవారినీ సత్కరించుకోవడానికీ, తర్వాతి తరాల వారిలో స్ఫూర్తిని నింపడానికి ఇవి దోహదం చేస్తాయి. ఆరోజు ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థలు తమ తమ కొత్త సంకల్పాలను, కొత్త లక్షాలను నిర్దేశించుకుంటాయి. విద్యార్థులు కూడా జీవితంలో తమ లక్షాలను సాధించడానికి, సరికొత్త స్నేహితులను సమకూర్చుకోవడానికీ ఉగాది పర్వదినం ఒక శ్రేష్ఠమైన సమయం. కాలం చెట్టుపై మనం కూర్చున్నాం. మన జీవితకాలం చాలా పరిమితం. మనం అటు బాల్యాన్నీ, ఇటు వృద్ధాప్యాన్నీ తీసేస్తే, మనం సమాజంలో యాక్టివ్‌రోల్ ప్లే చేసేది లెక్కవేసుకుంటే ‘అయ్యో! ఇంతేనా’ అనిపిస్తుంది. అందుకే కాలం చెట్టుపై కూర్చుని కాలాన్ని లెక్కించుకుంటూ ఉన్నంతకాలం కోకిలగానంలో వీనులవిందైన మాటలతో, అందరితో ఐక్యంగా ఉంటూ హాయిగా బతుకుదాం. అందుకు ప్రతి ఉగాది పండుగా మనకు స్ఫూర్తిమంతంగా నిలుస్తుంది.

లలిత తాతిరాజు