Home వార్తలు తెలుగు వెలుగుల ఉగాది

తెలుగు వెలుగుల ఉగాది

ఉగాది అంటే నూతన సంవత్సర ఆరంభం. తెలుగు ఉగాది చైత్రమాసపు మొట్టమొదటి తిథితో ప్రారంభం అవుతుంది. చైత్రమాసం నుంచి చిట్టచివర ఉండే ఫాల్గుణమాసం వరకు ఉండే పన్నెండు నెలల కాలాన్ని తెలుగు సంవత్సరంగా పరిగణిస్తారు.

పంచాంగ శ్రవణం ఎందుకు?
అభ్యంగన స్నానం చేసి పచ్చడి తిన్న తర్వాత ఉగాది నాడు ఆచరించే మూడవ కార్యక్రమం పంచాంగ శ్రవణం. పంచాంగం అంటే ఐదు అంగములతో కూడుకున్నది. తిథి, వారం, నక్షత్రం, యోగం,కరణము. ఇవి, మనకు దీర్ఘాయుర్దాయాన్నివ్వడానికి, ఎటువంటి అకాల మృత్యువు దాపురించకుండ ఉండటానికి, ఈ ఐదింటిని ప్రతి రోజు ప్రతివారు చూడాలని ఉవాచ. అందువల్లనే ఉగాది నాడు ఈ ఐదింటి సమన్వయమైన పంచాంగాన్ని వింటారు. అది చెప్పే గోచార ఫలితాలు తెలుసుకుంటారు. సంవత్సర ఫలితాలన్నిటినీ వింటారు.

తెలంగాణ ఉగాది పచ్చడి
Ugadi3కొత్త కుండలో పచ్చడి చేసుకోవడం, మట్టి పాత్రలతోనే పచ్చడి పోయడం, ఆకు దోనెల్లో వేసుకుని పచ్చడి తినడం ఉగాది సంప్రదాయం. తెలంగాణ వేడి ప్రాంతం కాబట్టి మట్టి కుండను వాడతాం. కొత్త కుండను తీసుకుని కడిగి నచ్చినట్టు నామాలు, కుంకుమ పెట్టి మూతి చుట్టూ వేపాకులు కడతారు. ముందుగా కుండలో బెల్లం, ఉప్పు, ఓమ(వాము), మామిడి ముక్కలు, వేపపువ్వు, చింతపండు రసం, నీళ్లు పోసి పల్చగా చేస్తారు. చేతి వృత్తుల వారు ప్రత్యేకించి మూడు రోజులు పండగ చేసుకుంటారు. మొదటిరోజు పనిముట్లను పెట్టి పూజ చేసుకుంటారు. రెండో రోజు ఆ పనిముట్లు వాడేటటువంటి రైతుల్ని కాని, మిగతా కులాల్ని కాని, వాళ్లందరిని పిలిచి భోజనాలు పెడతారు. అంటే ఉగాది ఒక జీవన విధానానికి ప్రతీక.

ఉగాది నవరాత్రులంటే..
పండగలన్నీ కాలంతోపాటు వచ్చేవే. కాలానుగుణంగా వచ్చే పండుగలను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా నియమాలను రూపొందించారు. అలా ప్రతి నియమంలోను ఆ కాలానికి సరిపడే ఆరోగ్య సూత్రాలను అందించారు మన పూర్వీకులు. భారతీయ పండగలన్నీ ఆరోగ్యసూత్రాల ప్రాతిపదికగానే ఉంటాయి. ఉగాది రోజున మనం చేసే కార్యక్రమాలన్నిటిలోను ఆయుర్వేదాన్ని అనుసరించిన ఆరోగ్య నియమాలున్నాయి. వీటి ద్వారా మనసు, బుద్ధి, ఇంద్రియాలకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచడమే ఈ పర్వదిన ఉద్దేశ్యం. రుతు సంధిషు వ్యాధిర్జాయతే.. అని ఆయుర్వేద గ్రంథాలు చెబ్తున్నాయి. ముఖ్యంగా వసంత, శరత్ రుతువులు యమ దంష్ట్రలని దేవీ భాగవతం వంటి పురాణాలు చెప్తున్నాయి. అందుకే శారీరక, మానసిక ఆరోగ్యాల కోసం ఆహార, విహార నియమాలు ఏర్పాటు చేశారు. శిశిరం వెళ్లి వసంతం వచ్చే సమయంలో ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. వాటికి అనుగుణంగా ఉగాది రోజున వసంత నవరాత్రి ఉత్సవాలు అందుకే జరుపుకుంటారు. ఆరు రుచులు అంటే ఆరు రుతువులతో పాటు మూడు గుణాలు కలిపి నవరాత్రులంటారు

ప్రత్యేక విధానంతో ఉగాది
కాల విభజనలో రోజు, పక్షము, వారము, సంవత్సరము, ఆయనము, పగలు, రాత్రి, గంట, అరగంట, నిమిషము, యామము, ఇలా ఎన్నో విభాగాలొచ్చాయి. వీటన్నిటిలో సంవత్సరం ఒక ప్రధానమైనటువంటి ప్రమాణం. 365 రోజులు, పన్నెండు మాసాలు ఒక సంవత్సరం. చైత్రమాసం, శుక్లపక్షం మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి నాడు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. దానికింద మొత్తం 60 సంవత్సరాలు. ఇవే మళ్లీ వృత్తంగా తిరుగుతుంటాయి.
పచ్చడి వెనక కథ
‘తద్ వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘ్రుతైర్ఘుతం భక్షితం పూర్వయామీశ్య తద్వర్షం సౌఖ్యదాయకం’
ఈ శ్లోకం ఉగాది పచ్చడి వైశిష్టం గురించి చెప్తుంది. దానిని ఎలా తయారు చేయాలంటే, నింబ అంటే వేపచెట్టు. వేప పువ్వులు ప్రధానంగా అందులో ఉండాలి. వేపచెట్టుకి కొన్ని ప్రత్యేకతలున్నాయి. అది ఆరోగ్యానిస్తుంది. అందుకే నింబవృక్షం గురించి అమరకోశం ఇలా అంటుంది. వేపచెట్టుని ఆశ్రయించి ఉండటం, వేపచెట్టు కింద పడుకోవడం, వేపచెట్టు గాలి పీల్చడం ఆరోగ్యానికి పరమ కారణాలై ఉంటాయి. అంత గొప్పది వేపచెట్టు. చైత్రమాసం వచ్చేటప్పటికి, వసంత రుతువు వస్తోందనేటప్పటికి పూత వస్తుంది. ఆ పువ్వులో విశేషమైనటువంటి రోగ నిరోధక శక్తి ఉంటుంది. క్రిమిసంహారక శక్తి ఉంటుంది. అటువంటి వేపపువ్వుని నీటిలో కలుపుతారు. శర్కరా అంటే బెల్లం అని అర్థం. బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు. అందుకే ప్రసాదంగా నివేదన చేసేటప్పుడు ఒక బెల్లం గడ్డ కూడా అందులో వేస్తారు. ఎంతకాలం నిలవ ఉన్నా అది చెడిపోదు. అందుకే ఆ బెల్లంగడ్డ ఆ నీటిలో వేస్తారు. వేపపువ్వు వేసినటువంటి నీటిలో బెల్లంగడ్డ వేస్తారు. ఆమ్లఘృతైర్యుతః ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు. చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటిదానిలో ఈ బెల్లంముక్క నాని కరుగుతుంది. వేపపువ్వులోని సారం దిగి అది పైకితేలుతుంటుంది. అందులో ఘృతైర్యుతం అంటే ఆవునేతిని కలపాలి. నెయ్యి అమృతంతో సమానం. రెండు, మంచినీళ్లు అమృతంతో సమానం. అందుకే స్పృహ తప్పిపోతే వెంటనే నీళ్లు తెచ్చి మొహం మీద చిలకరిస్తారు. ఆ బిందువులు పడగానే తమ స్థానాల నుంచి ఉద్ఘతమైన ప్రాణాలు కూడా వెనక్కి వస్తాయి. ఆవిధంగా నీరు అమృతంతో సమానం అయింది. అలాగే, లోకంలో ఏ చెట్టుకీ లేనట్లుగా మామిడి చెట్టును రసాలము అంటారు సంస్కృతంలో. దాని ఆకులు ప్రతి మంచి కార్యంలలో వినియోగిస్తారు. విశేషించి మామిడికాయను ఊరగాయగా కూడా నిలవ ఉంచుకుని తింటుంటారు. కారణం, అందులో అంత ఓషధీశక్తి ఉండటమే. ఉగాది పచ్చడిలో మామిడి ముక్కలు కలుపుకోవడం అలవాటుగా ఉంది. ఉగాది పచ్చడిని మొట్టమొదటి యామంలో తినాలి. దానిని ఎవరైతే పుచ్చుకుంటున్నారో అటువంటి వారికి తద్వర్షం సౌఖ్యదాయకం. అంటే సంవత్సర కాలం అంతా ఆ వ్యక్తి ప్రశాంతంగా జీవించడానికి కావలసినటువంటి వ్యవస్థను మనకి అందిస్తుందని అర్థం.
‘శతాయూర్ వజ్ర దాహాయ సర్వసంపత్ కరాయచ’
సర్వారిష్ట వినాశాయ నింబకడల భక్షణమ్-ఈ శ్లోకాన్ని వేప, బెల్లం మిశ్రమాన్ని తింటున్నప్పుడు ఉచ్ఛరించాలి. ఈ శ్లోకం అర్థం, ఆరోగ్యవంతమైన శరీరం, సమృద్ధిగా సంపద, చెడుని నివారించే వేపను సంగ్రహిస్తున్నాను అని.
ఆయుర్వేదం ఇలా అంటుంది
ఆయుర్వేదంలో, స్వస్తశ్య స్వస్త రక్షణం అంటే, రోగం వచ్చాక వైద్యం చేసుకోవడం పెద్ద విశేషం కాదు, రోగం రాకుండా జాగ్రత్త పడటం అనేది ముఖ్యం. రోగం రాకుండా ఉండాలి అంటే ఆహార నియమాలు పాటించాలి. పొద్దున్న మొదలయ్యే అభ్యంగన స్నానం నుంచి ఉగాది పచ్చడి దాకా అన్నిటిలోను అనేక ఆయుర్వేద నియమాలు తొంగి చూస్తున్నాయి. ఉగాది వచ్చే సమయాన్ని ఆయుర్వేదంలో ఆదాన కాలంగా పరిగణిస్తారు. ఈ కాలంలో పాటించాల్సిన నియమాల గురించి చరక, శుశ్రుత, వాగ్భటాచార్యలు రచించిన ఆయుర్వేద గ్రంథాల్లో సవివరంగా తెలిపారు. అసలు లెక్క ప్రకారం ప్రతిరోజు అభ్యంగన స్నానం చెయ్యాలి. అందుకే కనీసం ఉగాది నాడయినా చెయ్యండి అని చెప్పారు. ఒంటికి నువ్వుల నూనె రాసుకుని శనగపిండి లేక పెసరపిండితో నలుగు పెట్టుకుని తల మీద కొంచె నూనె పెట్టుకుని స్నానం చేయడం వలన మారిన రుతువులు పెరిగిన ఉష్ణోగ్రతల మధ్య సమతూకం ఏర్పడి ఉపకరిస్తుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. స్వేద చర్మాలు ఉత్తేజితమవుతాయి. నరాలు, కండరాలు, ఎముకలు, రక్తం, మాంసం, చర్మం అన్నీ స్థితిస్థాపక శక్తి కలిగి ఉండి శరీరంలోని అన్ని ధాతువులు పరిపుష్టం చెందుతాయి. వేపపువ్వు, బెల్లం, లవణం, చింతపండు, మామిడి, మిరియాలు, వీటితో పాటు జీలకర్ర, అరటిపండ్లు, చెరకు, ఎండు ద్రాక్షలు, జీడిపప్పు, బాదంపప్పు కూడా వేసుకుని ఉగాది పచ్చడి చేసుకునేవారుంటారు.
మనకి దోషాల్ని కలిగించేవి వాత, పిత్త, కఫాలే అని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. వీటి ప్రకారం వేపపువ్వు, తిత్త రసాన్ని, చింతపండు పులుపు కషాయ రసాన్ని, మిరియాల పొడి కఠ రసాన్ని, ఉప్పు లవణ రసాన్ని, మామిడి ఆమ్ల రసాన్ని, బెల్లం మధుర రసాన్ని కలిగి ఉంటాయి. ఇవన్నీ ఉగాది పచ్చడిలో ఉండేటట్లు నియమాలను విధించారు మన పూర్వీకులు. ఇవన్నీ రుతువుల మార్పుల వలన వచ్చే జబ్బుల నివారణకు ఉపయోగపడతాయి. సాధారణంగా రుతువులు మారినప్పుడల్లా క్రిమినలి చికిత్స చేసుకోవాలి. మధురరసం, తీపి గల పదార్థం తీసుకుంటే తృప్తినిస్తుంది. లేతమామిడికాయల్లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఆహారం త్వరగా జీర్ణమయేలా చేస్తుంది. వాతాన్ని తగ్గిస్తుంది. లవణ రసం కలవకపోతే ఆహారం త్వరగా జీర్ణం కాదు. కడ్రసంలో కారం అనేది కొంతవరకే తీసుకోవాలి. ఎందుకంటే అన్ని రుచులు కలిసినప్పుడే మన శరీరం సమతులంగా ఉంటుంది. కారం కోసం మిర్చి లాటిది కాకుండా మిరియాలు తీసుకుంటే కఫం తగ్గుతుంది, కొవ్వు ఏర్పడకుండా ఉంటుంది. తిత్తరసం – ఇది ప్రధాన రసం. కాలేయం సక్రమంగా పనిచేయాలంటే ఆయుర్వేదంలో తిత్తరసం తీసుకోవాలని చెప్తారు. వేప రోగనిరోధకశక్తిని పెంచి రోగాలను తగ్గించే గుణం ఉంటుంది. కషాయరసం శరీరంలో రక్తస్రావం సమస్యలుంటే, కఫం అధికంగా పెరుగుతున్నపుడు సహాయపడుతుంది.

మనదేశంలో ప్రతి రాష్ట్రం తనదైన పద్ధతుల్లో ఉగాది పండగ జరుపుకుంటుంది. కొన్ని రాష్ట్రాలు సూర్యాధారమైన క్యాలండర్‌ను అనుసరిస్తాయి. ఇంకొన్ని చాంద్రమాన క్యాలండర్‌ను అనుసరిస్తాయి. తెలంగాణ, కర్నాటకలో, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఉగాది పేరుతో సంవత్సరాది పండగ చేసుకుంటారు. 

ఇతర రాష్ట్రాల్లో ఉగాది పండుగ

అసోమ్‌ః రంగాలి బిహు పేరుతో కొత్త సంవత్సర వేడుకలు చేసుకుంటారు. ఇది వారికి పంటలు చేతికొచ్చే సమయం. ప్రతి యేడాది మార్చి 15న జరుపుకుంటారు. మొత్తం ఏడురోజులు సంబరాలు చేసుకుంటారు. ఉగాది రోజున బియ్యంతో వంటకాలు చేసుకుని తింటారు. వాటితో బెల్లం, పెరుగు కలిపి తింటారు. మగవాళ్లు, ఆడవాళ్లు బిహు పాటలు పాడుతూ బిహు నృత్యం(అసోమ్ సంప్రదాయ నృత్యం) చేస్తూ పంటలు ఇంటికొచ్చిన ఆనందాన్ని పంచుకుంటారు.
జమ్ము కాశ్మీర్‌ః కాశ్మీరీ హిందువులు చైత్రమాసంలో మొదటిరోజు ‘నవ్‌రే’ పేరుతో కొత్త సంవత్సరం జరుపుకుంటారు. ఈ పండగరోజు ప్రాశస్తం గురించి రాజరాగిణి, ఇంకా, నీలమత్ పురాణంలో ఉంది. మన రాష్ట్రంలోలాగానే జంతరిపంచాంగం/అల్మానాక్ ను భక్తి భావంతో అందరికీ చదివి వినిపిస్తారు. బ్రేక్‌ఫాస్ట్‌కి ముందే బియ్యప్పిండితో చేసిన వడియాలలాటి వాటిని వాయ్ అనే మొక్కతో కలిపి తింటారు. ఇంకో ఆచారం కూడా ఉంది. ఒక పెద్ద ప్లేట్ తీసుకుంటారు. బియ్యం, కొత్త పంచాంగం, కుంకువ, వై అనే మొక్క, ధాన్యపు కంకులు, పెరుగు, ఉప్పు, వెండి, బంగారు నాణాలు, గోధుమతో చేసిన రొట్టె, అక్రోట్లు, బియ్యప్పిండితో చేసిన రొట్టె, ఎండిన పూలు, తాజా పూలు, వీటన్నిటితో పళ్లాన్ని నింపేస్తారు. ఆ పళ్ళెం పైన ఇంకో చిన్న పళ్లెం మూతపెట్టి తెల్లవారగానే దానిని ఇంట్లోని యువతి లేదా యువకుడు మొదటగా ఇంటి పెద్ద దగ్గరకు తీసుకెళ్తారు. తర్వాత ఇంట్లో అందరి దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తారు. ఇలా చేయడం వలన ఇంట్లో మంచి జరుగుతుందని నమ్ముతారు. ఆ పళ్లెం పట్టుకొచ్చిన యువతి లేదా యువకుడికి చూసినవారు డబ్బులు ఇస్తారు. ఇంట్లో అందరూ పళ్లెం లోనుంచి అక్రోట్లను తీసుకుంటారు. తర్వాత వాటిని నదిలో వదిలేస్తారు. దేవీ సహస్రనామాలు, ఇంద్రాక్షి, ఇంకా ఇతర శ్లోకాలను ఆరోజు చదువుతారు. కొత్తబట్టలు వేసుకుంటారు, గుళ్లకు వెళతారు. ఈరోజు నుంచే కాశ్మీర్‌లో నవ దుర్గా పూజ ఆరంభం అవుతుంది. రకరకాల ఆహార పదార్థాలు వండుతారు. స్నేహితులు, బంధువులు అందరినీ పిలిచి కలిసి తింటారు. కహ్వా అనే టీ తయారు చేసుకుని దాన్ని ఒక ప్రత్యేకమైన టీపాట్‌లో పోసుకుని తమతో తీసుకెళ్లి తాగుతారు.
కేరళః మలయాళం క్యాలండర్‌లో ఉండే మొదటి రోజును విషు అనే పేరుతో జరుపుకుంటారు. మలయాళం నెల మేడమ్(ఏప్రిల్-మేలలో) ఈ పండుగ వస్తుంది. అదేరోజున తుళు భాష మాట్లాడే కన్నడిగులు బిసు పేరు మీద కొత్త సంవత్సరం జరుపుకుంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేస్తారు. తలకి నూనె పట్టించి తలస్నానం చేస్తారు. స్నానానికి వాడే నీటిలో వేపాకులు వేస్తారు. ఇంటి ముఖద్వారంలో వేప, మామిడి ఆకులు తోరణాలు కడతారు. నేలమీదంతా ముగ్గులు పెడతారు. పూజలు చేస్తారు. కుటుంబ సభ్యులంతా కొత్త బట్టలు కట్టుకుని పండగ రోజున పంచాంగాన్ని పూజిస్తారు. ఆరోజే తెరిచి చదువుతారు. వేపపూలను బెల్లంతో కలిపి ఇంట్లో అంతా తింటారు. జీవితంలో సంతోషం, విషాదం రెండూ అనుభవంలోకి వస్తాయనే నిజానికి గుర్తుగా తింటారు. విషుక్కనిని ఏర్పాటు చేయడం పండగరోజు ముఖ్యమైన ఘట్టం. కృష్ణుడి బొమ్మ, అద్దం, బియ్యం, వరి ఊక, బంగారు అంచు ఉన్న గుడ్డ(సరోంగ్), దోసకాయ, తమలపాకులు, వక్కలు, దేవుడి పుస్తకం, డబ్బులు, పండ్లు, కూరగాయలు, బంగారు నాణాలు, నగలు, తంగేడు పూలు, దీపం, ఒక ఇత్తడి కుండీలో గంజిపెట్టిన ఒక గుడ్డను విసనకర్రలాగా అమరుస్తారు. రెండు కొబ్బరి చిప్పల్లో నూనె పోసి ఒక గుడ్డతో వత్తులు వేస్తారు. తెల్లవారుఝామున ఎవరైతే రాత్రి విషుక్కలి దగ్గర నిద్రిస్తారో వారు లేచి ఆ దీపాలు వెలిగిస్తారు. ఆ వ్యక్తి ఇంట్లోని మిగతావారిని కళ్లు మూసుకుని అక్కడికి పిలుస్తారు. అందరూ అక్కడికి వచ్చి కళ్లు తెరిచి విషుక్కలిని చూస్తారు. అలా చేయడం అదృష్టం తెస్తుందని నమ్ముతారు. తర్వాత విషుక్కలిని ఇంట్లోని మొక్కలకు, జంతువులకు చూపుతారు. ఆరోజు కొత్తబట్టలు కట్టుకుని రామాయణం చదువుతారు. విషుక్కైనీతమ్ అనే పేరుతో డబ్బులు, బహుమతులు పనివారికి, పిల్లలకు పంచుతారు. సాయంత్రం పిల్లలు టపాకాయలు కాలుస్తారు. వేపంపూరసమ్ అనే చేదు పదార్థాన్ని తయారు చేస్తారు. దానితో పాటే కంజి, తోరమ్, మాంపపచ్చడి(మామిడికాయతో తయారు చేసే కూర)కూడా చేస్తారు.
మహారాష్ట్ర, గోవా
మహారాష్ట్రలో గుడి పడ్వా పేరుతో చైత్రమాసంలో మొదటిరోజును(మార్చి 16న) ఉగాదిగా జరుపుకుంటారు. గుడి అంటే బ్రహ్మధ్వజం అంటే బ్రాహ్మణుల జండా అని అర్థం. జండాకు పూజచేసి ప్రతి ఇంటి గేటు దగ్గర కుడివైపున ఉంచుతారు. చెడు మీద మంచి విజయంగా దాన్ని నమ్ముతారు. గుడి అంటే అదృష్టాన్ని, మంచిని తీసుకొస్తుందని నమ్మకం. పడ్వా అనే పదం ప్రతిపద నుంచి వచ్చింది. అంటే అమావాస్య తర్వాత రోజు అని అర్థం.
చెటి చాంద్-సింథీల థ్యాంక్స్ గివింగ్ డే!
సింథీలు జరుపుకునే కొత్త సంవత్సరం కూడా చైత్రమాసం లోని మొదటిరోజే. సింథీలు కృష్ణుడిని పూజిస్తారు. అందుకే ఈరోజును కృష్ణుడి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సంథీలు నీటి దేవుడైన వరుణుడిని కొలుస్తారు.
పంజాబీలు చేసుకునే పండగ వైశాఖిః సాధారణంగా ఏప్రిల్ 13,14 తేదీల్లో ప్రతి ఏడాది జరుపుకుంటారు. వారి సంప్రదాయ నృత్యాలైన బాంగ్రా, గిద్దాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటారు.
బెంగాలీల పొయిల వైశాఖిః ప్రతి ఏడాది ఏప్రిల్ 13 నుంచి 15 లోపు జరుపుకుంటారు. ప్రజలు పండగ సందర్భంగా ఇళ్లు శుభ్రం చేసుకుని లక్ష్మిని ఆహ్వానిస్తారు. వ్యాపారస్థులు హాల్ ఖతా పేరుతో వినాయకుణ్ణి పూజిస్తారు. పొయిల వైశాఖి కల్లా వినియోగదారులు పాత బాకీలన్నీ తీర్చేయాలని వ్యాపారస్థులు చెప్తారు. పిండి వంటలు వండుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.
తమిళనాడు వర్ష పైరప్పుః తమిళం మాట్లాడేవాళ్లంతా వర్ష పిరప్పు లేక పూతండు వర్తుకల్ పేరుతో కొత్త సంవత్సరం పండగ చేసుకుంటారు. ఇది చైత్రమాసంలో మొదటిరోజున జరుపుకుంటారు. ఆరోజు తెల్లవారగానే బంగారం, వెండి, నగలు, కొత్త బట్టలు, కొత్త క్యాలండర్, అద్దం, బియ్యం, కొబ్బరికాయలు, పండ్లు, కూరగాయలు, తమలపాకులు మొదలైనవాటిని చూడాలి. దానివలన అదృష్టం కలిసి వస్తుందని భావిస్తారు. తలస్నానం చేస్తారు. పంచాంగ పూజ చేస్తారు.