శాస్త్రోక్తంగా జరిగిన శుభకృత్ నామ సంవత్సరాది
ఉగాది పుట్టుపూర్వోత్తరాలు: శ్రీ శోభకృత్ నామ నామ సంవత్సరాది సందర్భంగా భారతీయులు ముఖ్యంగా తెలుగు వారు ఉగాది పర్వదినాన్ని శనివారంనాడు శాస్త్రోక్తంగా జరుపుకున్నారు. బ్రహ్మ ప్రళయం పూర్తైన తరువాత తిరిగి సృష్టి ప్రారంభమయ్యే సమయాన్ని ’బ్రహ్మకల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని ‘ఉగాది‘ గా వ్యవహరిస్తారు. ’ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణిస్తాం. పురాణాల ప్రకారం ఉగాదికి అసలు పేరు యుగాది. అంటే యుగానికి ఆరంభమని అర్థం. ఉగాది అనే పేరులో ‘ఉగ‘ అనగా నక్షత్ర గమనం అని అర్థం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. అనగా ఈ సృష్టి ఆరంభమైన దినమే ఉగాది పర్వదినంగా పరిగణించబడింది. యుగము అంటే ద్వయము లేక జంట అని కూడా అర్ధం వస్తుంది. వేదాలను హరించిన కారణంగా సోమకుడనే రాక్షసుడిని వధించిన మత్యావతారుడైన విష్ణువు, ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభ తరుణాన్ని పురస్కరించుకుని ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చింది. అదేరోజైన చైత్రశుక్ల పాడ్యమి నాడు ఈ విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. చారిత్రక వృత్తాంతం ప్రకారం చైత్రశుక్లపాడ్యమి అయిన ఉగాదినాడు శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తుడై శాలివాహన యుగకర్తగా వర్థిల్లిన కారణం కూడా ఉగాది ఆచరించడానికి ప్రధాన కారణమంటారు.
నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి:
ధర్మసింధు కారులు పంచవిధులు సూచించిన విధంగా ఇప్పటికీ భారతీయులు ఉగాది ఆచరణ విధానం శాస్త్రోక్తంగా పాటిస్తారు. ప్రతీ ఒక్కరూ తమ తమ ఇళ్ళు శుబ్రపరుచుకుని తోరణాలతో అలంకరించుకుని, మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో ఇంటిని అలంకరిస్తారు. ఉగాది రోజున వేకువజామునే ప్రతి ఒక్కరూ తైలంతో, కుంకుడితో అభ్యంగన స్నానం చేస్తారు., నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధిగా భావిస్తారు. మహాలక్ష్మిదేవిని నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి స్నానం చేసినట్లైతే లక్ష్మి, గంగా మాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. మనిషికి చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు.. ప్రాణులన్నీ కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.
ఉగాది పచ్చడి ఉన్నత జీవనానికి సాంకేతం:
సమస్త ప్రజానికం నూతన వస్త్ర ధారణ చేసి, భగవధ్యానం లో భాగంగా నూతన సంవత్సరాది స్తోత్ర పూజ చేస్తారు. దేవుని గదిలో మంటపాన్ని మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో నిర్మించి, అందులో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను ఇష్టదేవతారాధనతో బాటు పూజించి, తదనంతరం సూర్యభగవానుడికి మనస్పూర్తిగా నమస్కారం చేసుకుంటారు. తదనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, రకరకాల పిండి వంటలు తయారు చేసి దేవతామూర్తులకు నైవేద్యం పెట్టి ప్రసాదం స్వీకరిస్తారు. ఇలా ప్రతి సంవత్సరాదికీ పాటించి నిష్టగా పూజ చేస్తారు. మన పూర్వీకులు ఉగాది కార్యక్రమాలలో ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరాదికీ నిర్వహించేవారు. ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించాలి. ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని సంవత్సరాది స్తోత్ర పూజలోని భావం
పూర్ణ కుంభదానం:
ఉగాది నాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన అనేది ఆచారంగా వస్తోంది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం లాగ కట్టి దానిపై కొబ్బరిని పెట్టిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజారోహణం అంటారు. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.
తదనంతరం యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలైన మామిడి, అశోక, నేరేడు, మోదుగ ఆకులు, వేప చిగుళ్ళు, సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేస్తారు. తదనంతరం కలశానికి భక్తితో ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం ఉంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభ దానం ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుంది.
పంచాంగ శ్రవణం:
నిత్య వ్యవహారాల కోసం ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన ‘గ్రిగేరియన్ క్యాలెండరు‘ ను ఉపయోగిస్తూ వున్నాగానీ.. శుభకార్యాలు, పూజాపునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగాన్ని ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ఉగాదిరోజున ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం భారతీయులకు ఆనవాయితి. తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనే పంచ అంగాల సమ్మేళనమే పంచాంగం. పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరం వైపుగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది, గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఏరువాక ఎప్పుడు సాగాలి, వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకం ప్రకారం, ఉగాది నాడు పంచాంగశ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారు.
పంచాంగం ఉగాదితో అమల్లోకి వస్తుంది. అది కొనసాగుతూ, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగాన్ని ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి