Saturday, April 20, 2024

అరుదైన లక్షణం

- Advertisement -
- Advertisement -

Uma Bharati responding to Hathras incident

 

కొన్ని సందర్భాల్లోనైనా, ఒకరిద్దరైనా పార్టీలకతీతంగా మానవత్వాన్ని ప్రదర్శించడం భరించరాని ఉక్కపోతలో చల్లని గాలి వీచినట్టుటుంది. ఊహించని చోటి నుంచి మానవతా స్పందనలు రావడం ఆశ్చర్యాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో మనీషా అనే 19 సంవత్సరాల దళిత వాల్మీకి యువతిపై సామూహిక అత్యాచార ఉదంతంలో ఆ రాష్ట్ర పోలీసులు ప్రదర్శించిన మితిమించిన కాఠిన్యంపట్ల పాలక భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతల స్పందనను గమనిస్తే మానవత్వం తడారిపోయిందనుకున్న ఎడారిలోనూ ఒకటి రెండు కన్నీటి చుక్కలు రాలకపోవనే ఆశ అంకురిస్తుంది. హత్రాస్ అత్యాచార ఘటన పట్ల అంతటా ఆందోళన, నిరసన వ్యక్తమవుతుంటే బిజెపి శ్రేణుల నుంచి మాత్రం ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోడం బాధ కలిగించినా ప్రస్తుత రాజకీయాల్లో అది సహజమే అనిపించింది. అటువంటి తరుణంలో బిజెపి జాతీయ స్థాయి సీనియర్ నాయకురాలు ఉమాభారతి నుంచి, ఆ పార్టీ మహారాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలు చిత్ర వాఘ్ నుంచి వచ్చిన స్పందనలు భేష్ అనిపించాయి.

హత్రాస్ జిల్లా గ్రామంలోని మనీషా తలిదండ్రులను యుపి పోలీసులు గృహ నిర్బంధానికి గురి చేసి ప్రతిపక్ష నేతలను గాని, మీడియా ప్రతినిధులనుగాని అక్కడకు వెళ్లనీయకుండా ఉక్కు పాదం మోపారు. ఈ నేపథ్యంలోఉమాభారతి కరోనా ఆసుపత్రి బెడ్ మీది నుంచి యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఒక ట్విట్టర్ సందేశం పంపించారు. ‘నేను పార్టీలో మీ కంటే సీనియర్‌ను, మీకు అక్క వంటి దాన్ని, కరోనా పాజిటివ్‌తో ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాను. హత్రాస్ ఉదంతానికి వెంటనే మీరు స్పందించిన తీరు బాగుంది, కాని బాధితురాలి కుటుంబాన్ని ఎవరూ కలవడానికి లేకుండా పోలీసులు విధించిన దిగ్బంధం చర్చకు తావిస్తున్నది, ఆందోళనకు గురి చేస్తున్నది. దళిత కుటుంబానికి చెందిన ఆ యువతి అంత్యక్రియలను పోలీసులు రాత్రికిరాత్రి జరిపించి వేశారు. అక్కడికి వెళ్లదలచినవారిని అడ్డుకుంటున్నారు.

పోలీసుల ప్రవర్తన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్నే కాదు బిజెపినే అప్రతిష్ఠపాలు చేస్తుంది. మీడియా వారిని, ప్రతిపక్షం సహా రాజకీయ నేతలందరినీ బాధిత కుటుంబాన్ని కలవడానికి అనుమతించండి, దయచేసి నా మాట వినండి’ అని యోగి ఆదిత్యనాథ్‌కు ఉమాభారతి ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ నుంచిగాని, ఉత్తరప్రదేశ్‌కే చెందిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి గాని రావలసి ఉండిన ఇటువంటి హిత వాక్యాలు ఉమా భారతి నుంచి వచ్చినందుకైనా సంతోషించాలి. గత గురువారం నాడు హత్రాస్‌కు వెళ్లదలచిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను యుపి పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు. అనంతరం పార్లమెంటు సభ్యుడు డెరెక్ ఓబ్రిన్ తదితర తృణమూల్ కాంగ్రెస్ నాయకులనూ అటకాయించారు. టెలివిజన్‌లో ఈ సన్నివేశాలను చూసిన తర్వాత ఉమా భారతి యుపి ముఖ్యమంత్రికి ఆ విధంగా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ తర్వాతనే హత్రాస్‌లో నిషేధాజ్ఞలు తొలగిపోయాయి. సాముహిక అత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని కలుసుకునే అవకాశం మీడియాకు, ప్రతిపక్ష నాయకులకు కలిగింది.

గత శనివారం నాడు మధ్యాహ్నం హత్రాస్‌కు వెళ్లబోతున్న ప్రియాంకా గాంధీని ఢిల్లీ, యుపి సరిహద్దుల్లో ఆమె దుస్తులు పట్టుకొని అడ్డుకున్న పోలీసుపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలంటూ మహారాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలు చిత్ర డిమాండ్ చేయడం కూడా గమనించదగినది. సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంకా గాంధీ హత్రాస్‌కు బయల్దేరినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలకు నోయిడా పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.‘ఒక మహిళా నేత దుస్తులు పట్టుకొని ఆపడానికి ఆ పురుష పోలీసుకు ఎంత ధైర్యం! అతడిపై యోగి ఆదిత్యనాథ్ కఠిన చర్య తీసుకోవాలి’ అని చిత్ర ట్వీట్ చేశారు. ఏ పార్టీలో ఉన్నా అమానుషాన్ని ఖండించడమనే మంచి లక్షణాన్ని కోల్పోకూడదని, అధికారం మానవత్వాన్ని వదులుకొనే స్థాయి దురహంకారానికి దోహదం చేయకూడదని ఈ ఇద్దరు మహిళా నేతలు చాటారు. అందుకు వారు ఎంతైనా అభినందనీయులు.

మనీషా పై సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత కూడా దళిత యువతులపై అమానుష ఘటనలు యుపిలో ఆగకపోడం గమనించవలసిన అంశం. మధ్యప్రదేశ్‌లో మరో దళిత మహిళపై అత్యాచారం జరగగా ఆమె పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. పదేపదే అర్థించినా ఆమె ఫిర్యాదు నమోదు చేసుకోడానికి నిరాకరించిన పోలీసులు ఆమె భర్తను లాకప్‌లో పెట్టి హించించి, వదిలిపెట్టడానికి రూ. 50 వేలు లంచం తీసుకున్నారట. తన స్థితికి అమితంగా కలత చెందిన ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పాలకుల ప్రయోజనాలు కోరి లేదా వాటితో నిమిత్తం లేకుండా పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తూ ఉండడం ఉత్తరాదిలో, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తరచూ జరిగిపోతున్నది. ఇది వర్తమాన భారత ఘోర విషాదం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News