Home ఎడిటోరియల్ వాడుక భాషకు గొడుగు సవర లిపి సృష్టికర్త గిడుగు

వాడుక భాషకు గొడుగు సవర లిపి సృష్టికర్త గిడుగు

umbrella script for the usage language is the creator

ఆదిమ సవరజాతి గిరిజనుల భాషకు లిపిని, నిఘంటును రూపొందించి తెలుగు వాడుక భాషోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన గిడుగు రామమూర్తి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచిపోయారు. తెలుగు భాషలో వ్యవహారిక భాషా వ్యాప్తికి కృషి చేసిన గిడుగు గ్రాంధిక భాషావాదుల పాలిట ‘పిడుగు’ అని ప్రశంసలందుకున్న ఘనాపాటి. ఆయన పూర్తి పేరు గిడుగు వెంకటరామమూరి పంతులు. శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో గిడుగు వీర్రాజు, వెంకటమ్మ దంపతులకు 1963, ఆగస్టు 29న జన్మించారు. విజయనగరం మహారాజా కళాశాలలో (1875) గురజాడ అప్పారావుకు గిడుగు సహాధ్యాయి. బిఎ పట్టా పుచ్చుకొని చరిత్ర విభాగంలో అధ్యాపకులుగా పనిచేశారు.

బాహ్య ప్రపంచానికి సుదూరమైన శ్రీకాకుళం జిల్లాలోని కొండజాతి సవర తెగ గిరిజనుల ఆర్థిక, జీవన స్థితిగతులను గమనించిన గిడుగు వారికి సవర భాషలోనే విద్య నేర్పించి, ప్రత్యేక సవర పాఠశాలలు నెలకొల్పారు. గిడుగు సవరల విద్యపై ఆసక్తి చూపడానికి కారణం వారి వెనుకబాటు తనమే కాదు, వారికున్న చారిత్రక నేపథ్యం కూడా. సింధూ నాగరికత వెల్లివిరియడానికి ముందే సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా సవరలకు ప్రత్యేక నాగరికత, సంస్కృతి ఉంది. రామాయణం, మహాభారతం, వైదిక సూత్రాలలోనూ సవరల ప్రస్తావన ఉంది. రామాయణంలో ఎంతో ఉదాత్తతకు, సేవా భావానికి పేరుగాంచిన ‘శబరి’ సవర తెగ మహిళే కావడం విశేషం. సవరలను ‘నిషాదులు’ గా వ్యవహరిస్తారు. వీరి చిత్రకళను ‘ఎడిసింగ్/ తింగోనో’ అంటారు. వీరివి ప్రకృతి చిత్రాలే. నాడు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల కొండ ప్రాంతాల్లో 1991 లెక్కల ప్రకారం 1,05,465 మంది సవరలు నివసిస్తున్నారు. కాని వీరిలో కనీస అక్షరాస్యత (13.68) కొరవడి, వీరి సాంస్కృతిక జీవనం చతికిలపడి అంతరించే పోయే ప్రమాదం లేకపోలేదు.

శ్రీకాకుళం జిల్లాలో పర్లాకిమిడి పట్టణానికి పరిసర ప్రాంతాల కొండలపై నివసించే సవరలు ఆదిమ నివాసులు. అంటే ఆదిమ గిరిజనులు. కనీసం అక్షర జ్ఞానం లేక బాహ్య సమాజం అంటే తెలియని అమాయకులు. కాని ఆధునిక సమాజాలతో పోల్చితే నీతి, నిజాయితీ గల మానవీయులు సవరలు. తినడానికి తిండి, కట్టడానికి బట్టలేని పరిస్థితుల్లోనూ ప్రత్యేక జీవన సంస్కృతిని విస్మరించని అస్తిత్వంగల ఆదిమ ప్రపంచం వారిది. గతంలో ఎంతో ఉన్నత విలువలతో జీవించిన సవరలు ఈ ఆధునిక సమాజంలో వెనుకబడి ఉండటం రామమూర్తిని బాధించిన అంశం. చదువు చెప్పి విజ్ఞానవంతులుగా చేయగలిగితే సవరల బ్రతుకులు బాగుపడతాయని భావించిన గిడుగు సవర భాషను నేర్చుకున్నారు. సవర వాచకాలను,కథల పుస్తకాలను,పాటల పుస్తకాలను, తెలుగు సవర, సవర తెలుగు నిఘంటులను తయారు చేశారు. వాటిని 1911లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించింది. ఆ పుస్తకాలకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వజూపితే “ ఆ డబ్బుతో ఒక మంచి బడి పెట్టండి. నేను పెట్టిన బడులకు గ్రాంట్లు (నిధులు) ఇవ్వండి” అని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన కోరిక ప్రకారమే ప్రభుత్వం శిక్షణా పాఠశాలలను ప్రారంభించింది. సవర భాషలో రచనలు సేకరించడమే గాక, సవర భాషా వ్యాకరణ నిర్మాణంలో గిడుగు సాధించిన కృషి ఎనలేనిది. సవర జాతీయుల విద్యాభ్యాసం కొరకు పాఠశాలలను ఏర్పాటు చేయించి, నిధుల మంజూరీకి ప్రయత్నించారు. స్వలాభాపేక్షలేని నిస్వార్థపరుడు గిడుగు. ఆయన కృషిని మెచ్చి ఆయనకు ప్రభుత్వం 1913లో ‘రావు సాహెబ్’ బిరుదును బహూకరించింది. పాఠ్య పుస్తకాలలో వాడుక భాషను ప్రవేశపెట్టడంలోనూ, వ్యవహారిక భాషను వ్యాప్తి చేయడంలోను ఆయనకు సాటిలేరు.

1919లో వ్యవహారిక భాష అమలు కోసం గిడుగు ‘తెలుగు’ పత్రికను స్థాపించి తెలుగు భాషా సాహిత్య రంగంలో విశేషమైన పరిశోధన చేశారు. తంజావూరు నుండి చత్రపురం వరకు గల ప్రాంతాలలో తాటాకు గ్రంథాలు పరిశీలించారు. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు మొదలైన సాహితీ వేత్తలతో కలిసి (1919) ‘వర్తమాన ఆంధ్ర భాష ప్రవర్తక’ సమాజాన్ని స్థాపించారు. ఆనాటి నుండి అది తెలుగు భాషోద్యమానికి పునాదిగా మారడంతో మాండలికాలు, వ్యవహారిక భాషలో రచనలు ఆరంభమయ్యాయి.

రామమూర్తి సంఘ సంస్కరణాభిలాషి, గొప్ప మానవతావాది. ఆయన ఇల్లే ఒక పాఠశాల. గిడుగు పెద్ద కుమారుడు సీతాపతి, తాపీ ధర్మారావులు ఆయన వద్ద చదువుకున్నవారే. భాష అనేది సాంస్కృతిక ప్రసరణల ద్వారా వ్యక్తుల మానసిక ఆవరణలు దాటి, సాంఘిక వ్యవస్థతో నేరుగా సంబంధం ఏర్పర్చుకున్న భాష మాత్రమే భవిష్యత్తరాలకు చేరుతుంది. అట్టి భాష వ్యక్తుల అవసరాలు తీర్చగలగాలి. గతించిన తరాల విలువలు భవిష్యత్తరాలకు అందించబడాలి. ఇప్పుడున్న భాష వర్తమాన, నవ తరాలకు అవసరమైన సంస్కృతి, ఆచారాలు, లక్షాలను తీర్చగలగాలని భావించారు గిడుగు. అందుకు అవసరమైన భాషా సంస్కరణలను ప్రారంభించి, ఉద్యమిస్తూ విజయం సాధించిన ఘనత గిడుగు వారికే దక్కుతుంది. తరాలు మారే కొద్దీ సాంప్రదాయ భాష, సంస్కృతులపై ఆధునికత ప్రభావం అన్ని సమాజాల్లో కనిపిస్తున్నట్లే పరిమిత సంఖ్యలో గల గిరిజన సమాజాలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. స్వంత లిపి, అభివృద్ధి, వాడుక చదువులు, వ్యవహార రీత్యా వినియోగం వంటివి లేని స్థితిలో కోయ, గోండి భాషల క్షీణత వేగం పెరుగుతున్నది.

వాడుక భాషను వ్యతిరేకించిన పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తి చూపుతూ 191112 మధ్య “ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం” అన్న గ్రంథాన్ని రాశారు. గిడుగు సవర భాషలో “ A manual of Savara Language” అనే వర్ణనాత్మక వ్యాకరణాన్ని 1930 లో రచించాడు. సవర జాతికి సంబంధించిన అంశాలను చేర్చిన “Castes and Tribes of Southern India” ను రచించిన నృత్య శాస్త్రవేత్త ధరస్టన్‌తో రామమూర్తి చర్చించారు. ఇలా గిడుగు సవర లిపి నిర్మాతగా, ఆదివాసీల అక్షర శిల్పిగా ఖ్యాతి నార్జించారు. అమెరికాలోని హవాయి విశ్వవిద్యాలయంలోని పాశ్చాత్య భాషా వేత్త స్టాన్లీ స్టరోస్టా తన పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథాన్ని సవర లిపిపై విస్తృత పరిశోధన సాగించిన గిడుగుకు అంకితం చేయడం గమనార్హం. గిడుగు పరిశోధనలకు, సవర భాషా కృషికి మెచ్చిన బ్రిటీష్ ప్రభుత్వం 1933లో ‘కైజర్ ఇ హింద్‌” బిరుదుతో పాటు బంగారు పతకాన్ని బహూకరించి సత్కరించింది. మద్రాసు గవర్నర్ చత్రపురానికి వచ్చి ప్రత్యేక దర్బార్‌లో రామమూర్తికి స్వయంగా దానిని అందజేశారు. జార్జి చక్రవర్తి రజతోత్సవ పతకాన్ని కూడా గిడుగుకు అందించారు. ఆ తర్వాత క్రమంగా పర్లాకిమిడి రాజా వారికి, గిడుగుకు వైరం పెరిగింది.

తెలుగు వారు అధికంగా ఉన్న పర్లాకిమిడిని, 200 గ్రామాలను 1935లో అన్యాయంగా ‘ఒడిషా’ రాష్ట్రంలో చేర్చడాన్ని గిడుగు నిరసించారు. 22 ఏళ్లుగా జీవిస్తున్న పర్లాకిమిడిలోని తన ఇంటిని విడిచిన గిడుగు, రాజమండ్రిలో ఉంటున్న తన నాలుగవ కుమారుడు వద్దకు చేరుకున్నారు. 1936లో ఆంధ్ర విశ్వవిద్యాలయం బహూకరించిన ‘కళాప్రపూర్ణ’ బిరుదును వ్యవహారిక భాషావాదులందరికీ అంకితమిస్తున్నట్లు ప్రకటించడం గిడుగు వారికే సాధ్యమైంది. సవరలకు బీజాక్షరాలను నేర్పించిన ‘ఆదిగురువు’గా నిలిచిన గిడుగు 1940, జనవరి 22 తుది శ్వాస విడిచారు. ప్రభుత్వం గిడుగు మార్గదర్శకత్వంలోనైనా అంతరించి పోతున్న ఆదివాసీ భాషల్ని, సంస్కృతుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. వాడుక భాషకు గొడుగు లాంటి గిడుగు జన్మదినమైన ఆగస్టు 29ను ‘తెలుగు భాషాదినోత్సవం’గా మాత్రమే పాటిస్తే సరిపోదు. ప్రభుత్వం 2013ను ‘తెలుగు సాంస్కృతిక వికాస సంవత్సరంగా గుర్తించింది తప్ప తెలుగును అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర శాఖల్లో అమలుకు శ్రద్ధ చూపలేదు. అదే జరిగితే తెలుగు జాతికి వెలుగులు ప్రసరిస్తాయి.