Friday, March 29, 2024

అంతర్యుద్ధం దిశగా మయన్మార్

- Advertisement -
- Advertisement -

UN envoy warns of possible civil war in Myanmar

సైన్యంపై ప్రతీకార దాడులకు
సిద్ధమవుతున్న పౌరులు
ఐరాస ప్రత్యేక రాయబారి క్రిస్టినే స్కానర్

ఐక్యరాజ్యసమితి: మయన్మార్‌లో అంతర్యుద్ధం జరిగే అవకాశమున్నదని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి క్రిస్టినే స్క్రానర్ బర్జెనర్ హెచ్చరించారు. ఆ దేశ ప్రజలు సైనిక పాలన పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆమె తెలిపారు. స్వీయ రక్షణ దాడుల నుంచి ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నారని ఆమె పేర్కొన్నారు. సంప్రదాయిక ఆయుధాలేగాక ఆధునిక సాయుధ శిక్షణ కూడా తీసుకుంటున్నారని తెలిపారు. గత మూడు వారాలుగా థాయ్‌లాండ్‌లో ఉంటూ మయన్మార్‌కు చెందిన పలు వర్గాల నేతలతోపాటు సైనిక పాలకులతో చర్చలు సాగించారు. వైరి పక్షాలను చర్చలకు అంగీకరింపజేసి శాంతి నెలకొల్పడం అంత తేలిక కాదని చర్చల అనంతరం ఆమె వెల్లడించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఆంగ్‌సాన్‌సూకీ నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చిన సైనిక పాలకులు ముఖ్య నేతలను జైళ్లలో బంధించారు. దాంతో, ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆందోళనలను సైనిక పాలకులు హింసాత్మకంగా అణచివేశారు. సైన్యం చేతుల్లో ఇప్పటికే 800మంది చనిపోయారని, 5300మందిని జైళ్లలో పెట్టారని, 1800మందికి అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయని క్రిస్టినే తెలిపారు. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయని ఆమె తెలిపారు.

ఇప్పటికే చిన్, కయా, కరెన్నీ రాష్ట్రాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నదని ఆమె పేర్కొన్నారు. దాదాపు ఐదు దశాబ్దాలపాటు సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో 2015లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఆంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ(ఎన్‌ఎల్‌డి) పార్టీ ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డికి 82 శాతం పౌరులు మద్దతు తెలిపారు. అయితే, ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైనిక పాలకులు ఆరోపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News