Home వార్తలు ఎదురులేని జకో

ఎదురులేని జకో

tennisలండన్ : ప్రపంచ నెం.1 నొవక్ జకోవిచ్ ఈ సీజన్‌ను ఘనంగా ముగించాడు. ఈ ఏడాది ఆద్యంతం అద్భుతంగా రాణించిన జకోవిచ్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్ సింగిల్స్ టైటిల్‌ను వరసగా నాల్గో ఏడాదీ సొంతం చేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై వరుస సెట్లలో చిత్తుచేశాడు. గంటా 22 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో జకోవిచ్ 6-3, 6-4తో గెలిచాడు. డ్యూస్‌కు దారితీసిన తొలిసెట్ మొదటి గేమ్‌ను ఫెదరర్ సొంతం చేసుకున్నా.. తరువాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గిన జకోవిచ్ 3-1తో నిలిచాడు. తరువాత నాలుగు గేమ్‌లలో చెరో రెండు గెలిచినా.. తొమ్మిదోగేమ్‌లో ఫెదరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జకోవిచ్ సెట్‌ను 6-3తో 40 నిమిషాల్లో కైవసం చేసుకున్నాడు. ఇక రెండోగేమ్‌లో పాయింట్ల కోసం ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. ఎవరి సర్వీస్‌లను వారు కాపాడుకోవడంతో స్కోరుబోర్డు 4-4 వరకు సమంగానే నడిచింది. అయితే తొమ్మిదోగేమ్‌ను 40-0తో ఏకపక్షంగా నెగ్గిన జకో పదోగేమ్‌లో మరోసారి ఫెదరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచాడు. మ్యాచ్‌లో జకోవిచ్ కంటే మెరుగ్గా ఆడిన ఫెదరర్ 31 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. రెండోసెట్ చివరి పాయింట్‌ను కూడా డబుల్ ఫాల్ట్‌తోనే మ్యాచ్‌ను సమర్పించుకున్నాడు. వరుసగా నాలుగు వరల్డ్ టూర్ టైటిళ్లు నెగ్గిన తొలి ప్లేయర్ జకోవిచ్. ఓవరాల్‌గా జకోకు ఇది ఐదో వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్. ఆరు టైటిళ్లతో ఫెదరర్ తొలిస్థానంలో ఉన్నాడు.