*సరైన సమయంలో స్పందన కరువు
*అవసరం లేనప్పుడు శిక్షణల పేరిట హంగామా
*దిశానిర్దేశం లేని వ్యవసాయ శాఖ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాడి పంటలను సర్వనాశనం చేస్తున్న క్రిమికీటకాలను అరికట్టే ప్రక్రియపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత శాఖలు కీలకమైన సమయంలో స్పందించకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి జిల్లాలో పత్తి, సోయాబీన్, వరితో పాటు పప్పు దినుసు పంటలను రకరకాల చీడపీడలు ఆశిస్తున్న సంగతి తెలిసిందే. రైతులు లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టి సాగు చేస్తున్న పంటలు క్రిమికీటకాల కారణంగా గాలిలో దీపమవుతోంది. అయితే ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయాధికారులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మట్టి నమూనాల సేకరణ, సాగుపై సలహాలు, సూచనలతో పాటు క్రిమికీటకాల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి శిక్షణలు ఇవ్వాలన్న విధానముంది. అయితే అధికారులు సరైన సమయంలో ఇలాంటి శిక్షణలు ఇవ్వకుండా కాలం ముగిసిన తరువాత శిక్షణల పేరిట హంగామా చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి పంటపై గులాబీరంగు పురుగు దాడి చేసిన సంగతి తెలిసిందే. శాస్త్రవేత్తలకు సైతం అంతుబట్టని రీతిలో గులాబీరంగు పురుగు పత్తి పంటను నాశనం చేసింది. ఈ పురుగు సోకి పత్తి పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీనిపై వ్యవసాయాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపడం, సమీక్షలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు గులాబీరంగు పురుగుదే పెత్తనమైంది. అయితే పంట నష్టపోయి మూడు నెలలు గడిచిన తరువాత జిల్లా వ్యవసాయాధికారులు గులాబీ రంగు నివారణపై శిక్షణ ఇస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం పత్తి చేలల్లో ఎలాంటి పంట లేకపోయినప్పటికీ అధికారులిచ్చే ఈ అవగాహన కార్యక్రమం ఎవరికి ఉపయోగపడుతుందో అంతుపట్టడం లేదని అంటున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా గులాబీరంగు పురుగుతో పాటు మరికొన్ని రకాల క్రిమికీటకాలు పత్తి పంటను సోకే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే సోయాబీన్, వరి పంటలను ఆశించే క్రిమికీటకాల నివారణకు సైతం సకాలంలోనే శిక్షణలు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు ముందుగానే మేల్కొని రాబోయే ఖరీఫ్ సీజన్‌లో పండించే పంటలకు సంబంధించి చీడపీడల నివారణతో పాటు ఆధునిక పంట మెళకువ పద్ధతులు, అనుకూల పంటల సాగు లాంటి అంశాలపై రైతులకు గ్రామ స్థాయిలో శిక్షణలు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.