Home తాజా వార్తలు రామప్పకు వారసత్వం దక్కేనా ?

రామప్పకు వారసత్వం దక్కేనా ?

Ramappa-Temple

మన తెలంగాణ/హైదరాబాద్: రామప్ప ఆలయాన్ని పరిశీలించేందుకు యునెస్కో బృందం సెప్టెంబరు 25న రాష్ట్రానికి రానుంది. ప్రపంచ వారసత్వ గుర్తింపు రేసులో రామప్ప తుది దశలో ఉంది. సెప్టెంబరు 24వ తేదీన యునెస్కో బృందం రాష్ట్రానికి వచ్చి, హైదరాబాద్‌లో బసచేస్తుంది. మరుసటి రోజు ఈ బృందం పాలంపేటలోని రామప్ప దేవాలయానికి చేరుకొని, గుడి, గుడి పరిసరాలను పరిశీలిస్తుంది. ప్రతి ప్రత్యేకతను రికార్డు చేసి, యునెస్కో తరపున ప్రపంచ వారసత్వ హోదాకు ఇవ్వా లో, వద్దో నిర్ణయిస్తారు. నీటిలో తేలియాడే ఇటుకలను ప్రపంచానికి పరిచయం చేసిన ‘రామప్ప’కు హోదా ఇవ్వడంపై యునెస్కో అధ్యయనం చేస్తుంది. గతంలో చా ర్మినార్, కుతుబ్‌షాహీ సమాధులకు ప్రపంచ వారసత్వ హో దాను తిరస్కరించిన యునెస్కో ఈసారి రామప్ప దేవాలయాన్ని పరిగణనలోకి తీసుకొని చురుకుగా పరిశీలిస్తుంది. ఈ అద్భుత దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించాల్సిందిగా 2017లో భారత ప్రభుత్వం యునెస్కోకు దరఖాస్తు చేసింది. దాని ప్రత్యేకతలు, అది అద్భుత నిర్మాణంగా మారటానికి అందులో నిగూఢమైన అంశాలను వివరిస్తూ డోషియర్ (దరఖాస్తు ప్రతిపాదన) దాఖలు చేసి, చాలా కాలం అయ్యింది.

సెప్టెంబరు 25న రామప్ప దేవాలయాన్ని పరిశీలించేందుకు యునెస్కో బృందం వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న నిర్మాణాలు లేవు.దీంతో రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో చార్మినార్, గోల్కొం డ, కుతుబ్‌షాహీ సమాధులను యూనిట్‌గా చేసి యునెస్కోకు దరఖాస్తు చేశారు. కానీ నగరానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు అక్కడి కబ్జాలు చూసి అవాక్కయ్యారు. కట్టడాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ప్రైవేటు నిర్మాణాలుండటం, కట్టడాలకు అతి చేరువగా వాహనాలు వెళ్తుండటం, ఓ పద్ధతి లేకుండా దుకాణాలు వెలియటంతో గుర్తింపు ఇవ్వలేమని యునెస్కో తిరస్కరించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రామప్ప దేవాలయాన్ని యునెస్కో దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించి కేంద్రాన్ని కోరింది. దీంతో 2017లో కేంద్రం యునెస్కోకు దరఖాస్తు చేసింది. అయి తే, ఆలయ ప్రత్యేకతలకు సంబంధించిన వివరాలు సరిగా లేవంటూ యునెస్కో తిప్పి పంపింది. యునెస్కో కన్సల్టెంట్ ప్రొఫెసర్, నర్తకి, ఆర్కిటెక్ట్ అయిన చూడామణి నందగోపాల్‌ను అధికారులు పిలిపించి ఆలయ ప్రత్యేకతలపై అధ్యయనం చేయించి ఆ వివరాలను యునెస్కోకు పంపారు.

ఇప్పుడు ఆ నివేదికలో చూపిన ప్రత్యేకతలు, క్షేత్రస్థాయిలో ఉన్నాయో, లేవో పరిశీలించడంతో పాటు అదనపు సమాచారం కోసం, వాస్తవికత కోసం యునెస్కో బృందం పాలంపేటకు వస్తుంది. ఇన్నాళ్లుగా పెద్దగా రామప్ప దేవాలయాన్ని పెద్దగా పట్టించుకోని అధికారులు యునెస్కో బృం ద పర్యటన కోసం ముందస్తు ముస్తాబులు చేస్తున్నారు. గతంలో గోల్కొండ, చార్మినార్‌కు యునెస్కో హోదా తిరస్కరించిన నేపధ్యం తెలవడంతో, అటువంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్త ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాలయ నగరంగా మారుస్తూ రామప్ప దేవాయానికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న దేవాలయాన్నింటినీ అతి త్వరలో, వీలైనంత ముస్తాబు చేయడానికి అధికారులు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రోజుకో అధికారి చొప్పున ఎవరో ఒకరు క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనులు పర్యవేక్షిస్తున్నారు. తొలుత ప్రధాన రోడ్డు నుంచి రామప్ప దేవాలయం వరకు 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. దుకాణాల సముదాయాన్ని తొలగించారు. పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ప్రతి మలుపులోనూ ఏ ప్రదేశం, ఎంత దూరం ఉందో తెలుపుతూ సైన్ బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నారు. చెత్తకుండీలు సైతం అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను ములుగు జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

రామప్ప విశేషాలు..
ఇది రామలింగేశ్వరస్వామి దేవాలయం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో సైన్యాధిపతి రేచర్ల రుద్రదేవుడు దీన్ని నిర్మించారు. ఆ ఆలయానికి శిల్పిగా వ్యవహరించి అద్భుత పనితనాన్ని ప్రదర్శించిన రామప్ప పేరుతోనే దేవాలయానికి నామకరణం చేశారు. ఇలా శిల్పి పేరుతో ఆలయం భారతదేశంలో ఇంకెక్కడా లేదు. క్రీ.శ. 1213లో ఆలయ ప్రాణ ప్రతిష్ట జరిగిందని అక్కడి శాసనం చెబుతోంది. పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుత ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామశివారులో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరువలో రామప్ప పేరుతో పెద్ద చెరువు కూడా ఉంది. దానికి అనుబంధంగా కొన్ని ఉప ఆలయాలున్నా, ఇప్పుడవన్నీ పర్యవేక్షణ కరవై శిథిలమయ్యాయి. మన దేశంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ కట్టడాలు 38 ఉన్నాయి.

UNESCO team will inspect Ramappa temple on Sep 24th