Friday, July 18, 2025

దిగ్గజ నేతకు దక్కని ఊరట

- Advertisement -
- Advertisement -

మంత్రి వర్గ విస్తరణాలో జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా జిల్లాకు మంత్రి మండలిలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దిగ్గజ నేతలున్న జిల్లాలో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఇద్దరు నేతలకు మూడుసార్లు పిసిసి పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం ఈసారి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడానికి వెనుకాడుతుంది. తొమ్మిది అసెంబ్లీ సెగ్మెట్‌లున్న ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోసారి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వారే. బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఒకరే మూడుసార్లు గెలిచారు.

అందులోనూ ఆయన గతంలో మంత్రి గా పని చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్ర ఉంది. సమీప బంధువు కూడా. అందులో రేవంత్ పిసిసి పగ్గాలు దక్కడంలో తెర వెనుక మంత్రాంగం నడిపారు. ఇకేముంది రేవంత్ క్యాబినెట్‌లో ఆయన బెర్త్ ఖాయమని భావించారు. మొదటి దఫాలో తనకు మంత్రి పదవి వస్తుందనే భరోసాతో సుదర్శన్ రెడ్డి ఉండే. కానీ తానోకటి తలిస్తే దైవం మరొకటి తల్చినట్లుగా అధిష్టానం ఆయనకు స్పీకర్ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. మంత్రిగా పని (Work minister) చేయడానికి సిద్ధం అయిన స్పీకర్ బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. దీంతో రేవంత్ క్యాబినెట్‌లో ఆయన బెర్త్ దక్కలేదు. కానీ పదేళ్లు పార్టీ అధికారంలో లేకపోయినా ప్రతికూల పరిస్థితులు తట్టుకొని కాంగ్రెస్‌లో కొనసాగుతూ వచ్చారు. జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు.

సమాజంగా మంత్రి పదవి రాకపోవడంతో సుదర్శన్‌రెడ్డి ఆసంతృప్తికి గురయ్యారు. కానీ విస్తరణ ఎప్పుడు జరిపిన మంత్రి పదవి గ్యారేంటే అని ముఖ్యమంత్రి పదే పదే భరోసా ఇచ్చారు. దీంతో ఈసారి మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగిన తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో సుదర్శన్ రెడ్డి ఉంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన మొదట్లో పాలన వ్యవహారాలలో ప్రోటోకాల్ సైతం పక్కకు పెట్టి పని చేశారు. కానీ మంత్రి పదవి విషయంలో ఎడతెగని జాప్యం సాగుతుండడంతో సైలెంట్ అయ్యారు. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ పాలన వ్యవస్థలో ప్రాధాన్యత లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తం అయ్యింది. ఎమ్మెల్యేలు సైతం ఎవరికివారే యమునా తీరన్నట్లుగా వ్యవహరించడంతో పార్టీ విధేయులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.

ఈనేపథ్యంలో మంత్రి విస్తరణపై ఆశావహులతో పాటు పార్టీ శ్రేణుల్లో ఎదురు చూపులు మొదలయ్యాయి. దాదాపు ఏడాదిన్నర నిరీక్షణ తర్వాత అధిష్టానం విస్తరణకు లైన్ క్లియర్ చేసింది. కేవలం ముగ్గురికి అవకాశం ఇవ్వాలని, సామాజిక సమీకరణ ప్రతిపాదన ఉండాలని మెలిక పెట్టింది. అదే సుదర్శన్‌రెడ్డికి ప్రతికూలంగా మారింది. బిసి, ఎస్సీలకే మంత్రి పదవులు ఇస్తున్నట్లు ముందుగానే సంకేతాలు రావడంతో అప్రమత్తం అయినా సుదర్శన్‌రెడ్డి విస్తరణకు రెండు రోజుల ముందు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. కానీ ఢిల్లీ పెద్దల నుంచి సానుకూల హామీ దక్కకపోవడంతో వెనుదిరిగిన సుదర్శన్ రెడ్డి అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు. పార్టీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న తనకు మంత్రి పదవి నిరాకరించడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఒకదశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారటూ ప్రచారం తెరమీదికి వచ్చింది. పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లు బికింది.

హైదరాబాద్‌లో ఉన్న ఏఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ విస్తరణ రోజే రంగంలోకి దిగారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి భవిష్యత్తుకు భరోసా ఇచ్చి బుజ్జగించారు. పార్టీ కోసం పదేళ్లు కష్టపడి పని చేసిన తనలాంటి సీనియర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడం అవమానకరంగా భావిస్తున్నట్లు ఆయన ఆవేదనగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా మంత్రి లేకపోతే సానుకూల ఫలితాలు సాధించడం అంతా సులువేమి కాదని నేతలు చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా జిల్లాకు రెండేసి మంత్రి పదవి దక్కాయి. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలోనూ మంత్రి పదవితో పాటు స్పీకర్ పోస్టు కూడ దక్కింది. మంత్రి వర్గంలో తన సొంత జిల్లాకు ప్రాతినిధ్యం ఉండాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం అధిష్టానం పెద్దల మీద ఒత్తిడి చేస్తున్నారు. తదుపరి విస్తరణలోనైనా దిగ్గజ నేతగా ఉన్న సుదర్శన్ రెడ్డికి ఊరట దక్కుతుందా లేదా..? వేచి చూడాలి..!

  • ఎ. రామకృష్ణ ప్రసాద్,
    (ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో)
    (94410 41433)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News