Home ఎడిటోరియల్ అంతే లేని ఆకలి

అంతే లేని ఆకలి

children

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా ప్రజల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా బాలల, మహిళల, ఇతర అణగారిన వర్గాల వారిలో పోషకాహార లోపానికి దారి తీసే ఆకలి సమస్యను పరిష్కరించలేక పోవడం జాతికే సిగ్గు చేటు. ఆకలి, పోషకాహార లోపం, బాలల్లో ఎదుగుదల నిలిచిపోవడం, శిశు మరణాల వంటి ప్రమాణాల ప్రకారం ఈ ఏడాది ప్రపంచ ఆకలి సూచిక (జి.హెచ్.ఐ.) విడుదల చేశారు. ఈ సూచికలో భారత్ స్థానం ఆకలి తో అలమటిస్తున్న దేశాల జాబితాలో ఉంది.

2030 కల్లా ప్రపంచంలో ఎక్కడా ఆకలి బాధ ఉండకూడదని ఐక్యరాజ్య సమితి ఈ శతాబ్దిలో సాధించవలసిన లక్ష్యాలలో ప్రధానమైందిగా భావించింది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రభుత్వాలు తగిని వ్యూహాలు రూపొందించాలి. దీనికి తగిన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఫలితాలు సాధించడానికి కృషి చేయాలి. ఈ లక్ష్యం సాధించడం కోసం ప్రపంచ ఆకలి సూచిక వివిధ దేశాలలో ఆకలి సూచిక తయారు చేస్తూ ఉంటుంది. మన దేశంలో 2013లోనే ఆహార భద్రతా చట్టాన్ని రూపొందించినా, ఆహార ధాన్యాల కొరత లేకపోయినా ఆకలి తాండవిస్తూనే ఉంది. తగిన ఆహారం అందే మౌలిక హక్కుని హరిస్తూనే ఉంది. పొరుగున ఉన్న అనేక ఆగ్నేసియా దేశాల పరిస్థితి మనకన్నా మెరుగ్గా ఉన్న దశలో మనం ఈ సమస్యను పరిష్కరించలేక పోతున్నాం.

భారత్‌లో జనాభా ఎక్కువ కనక, ఈ ప్రాంతం లో ఆకలి మీద ప్రభావం చూపుతుంది కనక ఈ పరిస్థితిని ఆకలి సూచిక ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణిస్తోంది. భారత్‌లోని ఆరు నెలల నుంచి 23 నెలల వయసున్న శిశువుల్లో కేవలం 23 శాతం మందికే సరైన ఆహారం అందుతోందని ఈ సూచిక స్పష్టం చేసింది. అయిదేళ్లలోపు బాలలు ఉండవలసిన బరువు కన్నా తక్కువే ఉంటున్నారు. అంటే పోషకాహార లోపం ఎక్కువ గా ఉందన్న మాట. ఈ లోపం 28 శాతం ఉంది. ఇది మిగతా దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. అయిదేళ్ల లోపు పిల్లలు ఉండవలసిన బరువు కన్నా తక్కువ ఉండడం అంటే నిరంతరం పోషకాహార లోపం ఉన్నట్టే. ఈ లోపం 37 శాతం ఉంది. అయితే గత ఏడాదితో పోల్చి ఈ ఏడాది సూచికను తయారు చేయడం లోపభూయిష్టమైందన్న విమర్శలు ఉన్నాయి. సమాచారాన్ని సవరిస్తున్నా, సూచిక తయారు చేసే పద్ధతి మారుస్తున్నా మన దేశం మాత్రం ఆకలి విషయంలో అట్టడుగుననే ఉండడం ఆందోళన కలిగించే విషయమే.

మన దేశంలో పోషకాహార లోపం ఉన్న వాస్తవాన్ని అంతర్జాతీయ ఆకలి సూచిక మరో సారి రూఢి చేసింది. యునెస్కో ‘ప్రపంచ బాలల స్థితిగతులు’ అన్న నివేదిక కూడా ఈ వాస్తవాన్నే వెల్లడిస్తోంది. ఈ నివేదిక ప్రకారం బాలల్లో అనారోగ్యం, ప్రధానంగా పోషకాహార లోపం, రక్త లేమి, స్థూల కాయం లాంటి సమస్యలున్నాయి. ప్రపంచంలో అనేక చోట్ల బాలల పరిస్థితి ఇదే రీతిలో ఉంది. మన దేశంలో అయిదేళ్లలోపు శిశు మరణాల సగటు ప్రతి వెయ్యి మందికి 37 కే పరిమితమైనా 2018లో శిశు మరణాలు 8,82,000 ఉండడం ఆందోళనకరమైందే. వీరిలో 62 శాతం మంది పుట్టిన నెల లోపలే గిడ్తున్నారు. అయిదేళ్ల లోపు శిశువుల మరణాల్లో 69 శాతం మరణాలకు పోషకాహార లోపమే ప్రధాన కారణంగా ఉంది. ఈ వయసులో ఉన్న ప్రతి రెండవ శిశువు అంటే 50 శాతం మంది పోషకాహార సమస్యనే ఎదుర్కొంటున్నారు.

35 శాతం బాలల్లో ఎదుగుదల సవ్యంగా లేదు. 17 శాతం మంది బాలలు పోషకాహార లోపం వల్ల బాధ పడ్తున్నారు. 33 శాతం మంది ఉండవలసిన బరువు కన్నా తక్కువ ఉంటున్నారు. ఆరు నుంచి 23 నెలల వయసున్న వారిలో 42 శాతం మంది బాలలకే సరిపడినంత ఆహారం అందుతోంది. 21 శాతం మంది బాలలకే వైవిధ్యం ఉండే ఆహారం అందుతోంది. మహిళల్లో సగం మంది రక్తహీనత వల్ల బాధ పడ్తున్నారు. 40.5 శాతం మంది బాలల్లో ఇదే సమస్య ఉంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన గణాంకాలు కూడా అయిదేళ్ల లోపు పిల్లల్లో 34.7 శాతం మందిలో సరైన ఎదుగుదల లేదని తేల్చింది. 17.3 శాతం మందికి పోషకాహారం అందడం లేదని, 33.4 శాతం పిల్లలు బరువు తక్కువగా ఉన్నారని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

పోషకాహార లోపానికి అనేక కారణాలున్నాయి. వివిధ రాష్ట్రాల మధ్య అంతరాలున్నాయి. పేదరికం, ఆహార ధాన్యాలు, పప్పులు చాలినన్ని అందుబాటులో లేకపోవడం, ఆహారంలో పోషక విలువలు లేకపోవడం, ప్రభుత్వ పంపిణీ విధానం సక్రమంగా లేకపోవడం, ఉన్న ధాన్యం పంపిణీ సవ్యంగా లేకపోవడం మొదలైన విషయాల్లో రాష్ట్రాల మధ్య తేడాలు ఉన్నాయి. ఇంట్లోనే మహిళలకు సమాన స్థానం కొరవడడం, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్య వసతితో పాటు జన్యు సంబంధ సమస్యలు, పర్యావరణ అంశాలు సైతం అంతరాలకు కారణమే. ప్రభుత్వాలు ఈ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోకపోవడం, రాజకీయ సంకల్ప బలం లోపించడం, ఉన్న వ్యవస్థలు ఫలితాలు సాధించడానికి అనువైనవి కాకపోవడం మొదలైనవన్నీ ఈ సమస్యకు కారణాలే.

ప్రస్తుతం అమలవుతున్న పథకాలలో మాతృ వందన పథకం ఉంది. ఈ పథకం ద్వారా గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు కొన్ని షరతులకు లోబడి నగదు సహాయం అందుతుంది. అలాగే పోషణ్ అభియాన్, జాతీయ పోషకాహార మిషన్ మొదలైనవి 2022 కల్లా పోషకాహార సమస్య లేకుండా చేయడానికి ఉద్దేశించినవే. అయితే జరుగుతున్న వ్యవహారాన్ని చూస్తే ఇది సాధ్యమయ్యేట్టు కనిపించడం లేదు. ఒక పరిశోధనా పత్రంలో ఈ అనుమానమే వ్యక్తం చేశారు. క్రెడిట్ సూయిస్ గ్లోబల్ వెల్త్ నివేదిక ప్రకారం భారత్ త్వరితగతిన అభివృద్ధి చెందుతోందంటున్నా ఆకలిని, పోషకాహార లోపాన్ని నివారించలేక పోతున్నామన్నది వాస్త వం. అందువల్ల ప్రజలందరికీ సమ తులాహారం అందేట్టు చేయడం ప్రభుత్వాల బాధ్యత. దీని కోసం ప్రభుత్వం అవసరమైన పెట్టుబడి పెట్టాలి. మానవాభివృద్ధి జరగాలంటే జనం సజావుగా బతకాలి.

UNICEF report said that 17% of Indian children suffer