Saturday, April 20, 2024

నాలుగు సూత్రాల ఆధారంగా కేంద్ర బడ్జెట్..

- Advertisement -
- Advertisement -

Union Budget 2022: Nirmala Sitharaman's Address

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్‌ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. ఇందుకోసం నాలుగు సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించినట్టు ఆమె వెల్లడించారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతం ఇచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ 20222023 రూపొందించినట్టు ఆమె పేర్కొన్నారు. దాదాపు గంటన్నరకు పైగా బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. 11 గంటలకు ప్రారంభించిన మంత్రి 12.30 గంటలకు ముగించారు. ప్రసంగంలో 2022 23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు రూ. 39 లక్షల కోట్లని తెలిపారు. 5 జీ సేవలు, ఈపాస్‌పోర్ట్, క్రిప్టో కరెన్సీపై ట్యాక్స్, డిజిటల్ కరెన్నీ, ఐటి రిటర్న్ దాఖలులో మరో మినహాయింపు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ పెంపు, విద్యార్ధుల కోసం వన్‌క్లాస్… వన్‌ఛానెల్ మొదలైనని ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలుగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ డిడక్షన్ 14 శాతానికి పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. ఐటీ రిటర్న్ దాఖలు వెసులుబాటు కల్పించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించారు. రిటర్న్‌లు సమర్పించిన రెండేళ్ల తరువాత కూడా సవరణలు చేసుకోవచ్చు. త్వరలో ఈ పాస్ పోర్ట్ విధానాన్ని తీసుకువస్తామని ప్రకటించారు.
జనవరిలో రూ. 1.41 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలు
ఈ సంవత్సరం జనవరిలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లులో సరికొత్త రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 2022 జనవరిలో రూ.1.41 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూలైందన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలోనే డిజిటల్ కరెన్సీని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపీని జారీ చేయబోతున్నట్టు చెప్పారు. రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు. డిజిటలైజేషన్, అర్బన్ ప్లానింగ్ చేసే రాష్ట్రాలకు ఈ రుణాలను ఇస్తామన్నారు. వజ్రాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు తెలిపారు. కట్ అండ్ ఫైన్ డైమండ్స్‌పై కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గించినట్టు చెప్పారు.
క్రిప్టో కరెన్సీ ఆదాయంపై పన్ను విధింపు
వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్టు చెప్పారు. పను ఎగవేతను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. క్రిప్టో కరెన్నీ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను విధించనున్నట్టు చెప్పారు. లాంగ్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 15 శాతం పన్ను విధిస్తామన్నారు.
సహకార సంఘాలకు సర్‌ఛార్జి తగ్గింపు
రూ.కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయం గల సహకార సంఘాలకు సర్‌ఛార్జీని 7 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు పన్ను రాయితీని మరో ఏడాది పొడిగించినట్టు తెలిపారు. మానుయఫ్యాక్చరింగ్‌కు కన్సెషనల్ ట్యాక్స్ కొనసాగుతుందన్నారు.
దేశంలో 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్షం
దేశంలో 60 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్షమని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం గతి శక్తి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్తుందని, యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. దేశంలో యువత , మహిళలు పేదలకు సాధికారత కల్పించడంపై ప్రభుత్వ దృష్టి సారించిందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్‌ను సాధించడానికి ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, దీనివల్ల వచ్చే ఐదేళ్లలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు, 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తిని సృష్టించే అవకాశం ఉందని వివరించారు.
రసాయనాలు వాడని సేంద్రీయ వ్యవసాయం
ఈసారి కెమికల్ ఫ్రీ నేచురల్ వ్యవసాయానికి (సేంద్రియ వ్యవసాయం) తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. హానికరమైన రసాయనాలు ఉపయోగించకుండా పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం ప్రస్తుత కరోనా సమయంలో చాలా ముఖ్యమని మంత్రి తెలిపారు. అందుకే ఆ దిశగా కెమికల్ ఫ్రీ నేచరల్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. మొదటి దశలో గంగానది పరివాహక ప్రాంతాల్లోని 5 కిలోమీటర్ల లోపు ఉన్న వ్యవసాయ భూముల రైతులతో పైలట్ ప్రాజెక్టుగా చేపడతామన్నారు. అలాగే రాష్ట్రాలు కూడా ఈ విధానానికి ఊతమిచ్చేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో సిలబస్‌లో మార్పు చేసి సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా పాఠ్యాంశాలు తీసుకు రావాలని కోరారు. ఆర్గానిక్ ఫార్మింగ్, మోడ్రన్ డే అగ్రికల్చర్‌లకు ప్రోత్సాహకాలను తగ్గించాలని తెలిపారు. అప్పుడే సేంద్రియ వ్యవసాయం ఆచరణ లోకి వస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రస్తుత కరోనా సమయంలో ఆరోగ్యానికి రసాయనాలు వాడి పండిస్తున్న ఆహార పదార్ధాలు ఎంతమాత్రం మంచివి కావని మంత్రి అభిప్రాయపడ్డారు. కనుక కెమికల్‌ఫ్రీ నేచురల్ వ్యవసాయం ఈ సమయంలో చాలా అవసరం అన్నారు.
5జీ స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాదే
5జి స్పెక్ట్రమ్‌కు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు ఇస్తామని, 5జి స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాది ప్రారంభమవుతుందని చెప్పారు. 2025 నాటికి దేశం లోని అన్ని గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ విస్తరిస్తుందన్నారు. రక్షణ రంగానికి అవసరమైన వాటిలో 68 శాతం వరకు దేశీయ మార్కెట్ల నుంచే సేకరిస్తామని చెప్పారు. ఎండ్ టుఎండ్ ఈ బిల్ ద్వారా పారదర్శకతను తీసుకొస్తామని తెలిపారు. 2030 నాటికి 280 గిగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి సామర్ధాన్ని సాధించాలని లక్షంగా పెట్టుకున్నట్టు తెలిపారు. సోలార్ ఎనర్జీలో హై ఎఫీషియెన్సీ మాడ్యూల్స్‌కు ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్ రూ. 19,500 కోట్లు అందచేయనున్నట్టు వివరించారు.
తపాలా కార్యాలయాలన్నీ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి..
దేశ వ్యాప్తంగా నూటికి నూరుశాతం తపాలా కార్యాలయాలు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. తపాలా కార్యాలయాలు ఆర్థిక సమ్మిలితత్వంలో భాగస్వాములవుతాయన్నారు. విశ్వాస ఆధారిత పరిపాలన కోసం కృషి చేస్తున్నట్టు చెప్పారు. ప్రజలకు అన్ని సేవలు ఒకే చోట లభించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ పాస్ పోర్టుల జారీ 2022 లో ప్రారంభమవుతుందని, దీంతో ప్రయాణాలు సులభతరం అవుతాయని చెప్పారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ప్రారంభమవుతుందన్నారు.
75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు
టైర్2, టైర్ 3 నగరాలకు మరిన్ని నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. హెలెవెల్ అర్బన్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభిస్తామని చెప్పారు. 2047 నాటికి దేశంలో సగం జనాభా నగరాల్లోనే ఉంటుందని, నగరాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. ఈవెహికల్స్ కోసం బ్యాటరీ స్వాపింగ్ పాలసీని ప్రకటించారు. పట్ణణ ప్రాంతాల్లో ఎలెక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తామని తెలిపారు.
మూడేళ్లలో 100 కార్గో టెర్మినల్స్
రానున్న మూడేళ్లలో 100 కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఆతిధ్య రంగం పునరుజ్జీవం కోసం కృషి చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగంలో అదనంగా రూ. 2 లక్షల కోట్ల క్రెడిట్ సదుపాయం కల్పిస్తామన్నారు.
200 టీవీ ఛానళ్లతో ఈవిద్య
విద్యారంగానికి ప్రోత్సాహంలో భాగంగా 200 టీవీ ఛానళ్లకు ఈ విద్యను విస్తరిస్తున్నట్టు తెలిపారు.పాఠశాలలకు ఈ కంటెంట్ డెలివరీని ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థుల కోసం డిజిటల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, నేషనల్ టెలీ హెల్త్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలతో నూతన తరం అంగనాన్వడీల ఏర్పాటు చేస్తామని, 2 లక్షల అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు.
బలహీన వర్గాలకు 80 లక్షల గృహాలు
2023 నాటికి పీఎం ఆవాస్ యోజన కింద బలహీన వర్గాలకు చెందిన 80 లక్షల మందికి గృహాలను నిర్మిస్తామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు కొత్తగా పీఎం గతిశక్తి పథకం కింద ఓ పథకాన్ని ప్రకటించారు.
చిరుధాన్యాల సంవత్సరంగా 2023
రైతుల కోసం అనేక పథకాలకు నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా మంత్రి ప్రకటించారు. రూ. 2.37 లక్షల కోట్లను ఎంఎస్‌పి కింద రైతులకు చెల్లిస్తామని చెప్పారు.

Union Budget 2022: Nirmala Sitharaman’s Address

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News