Home జాతీయ వార్తలు ఎవరైనా అద్దె తల్లి కావచ్చు

ఎవరైనా అద్దె తల్లి కావచ్చు

 

సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: సరోగసీ (అద్దె గర్భం) క్రమబద్థీకరణ బిల్లు 2020ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. బుధవారం కేంద్ర మంత్రి మండలి భేటీ జరిగింది. సరోగసీ చట్టం క్రమబద్థీకరణతో సరోగేట్ తల్లి సమీప బంధువే అయి ఉండాల్సిన అవసరం లేదు. సరోగేట్‌కు మారేందుకు సమ్మతించే మహిళ ఎవరికైనా ఈ సరోగసీ అవకాశం కల్పిస్తారు. సరోగసీ ్రప్రక్రియలో చేపట్టిన మార్పులు చేర్పులతో సరోగసీకి వితంతువులు, విడాకులు పొందిన ఒంటరి మహిళలు కూడా సరోగేట్ తల్లులు కావచ్చు. చట్టపరమైన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ క్రమబద్థీకరణ బిల్లు తీసుకువచ్చారు. ఇక సంతానం లేని భారతీయ దంపతులకు ఈ ప్రక్రియతో ఎంచుకునే సరోగేట్ లభించడం తేలిక అవుతుంది. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సిఫార్సులన్నింటినీ ఈ బిల్లులో పొందుపర్చినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ భేటీ తరువాత విలేకరులకు తెలిపారు. మంత్రివర్గ సహచరురాలు స్మృతీ ఇరానీ కూడా విలేకరులతో మాట్లాడారు. ముసాయిదా బిల్లు ప్రతిని సెలెక్ట్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. దేశంలో సరోగసీలో వాణిజ్య ధోరణులు అరికట్టేందుకు, సంతానలేమి వారిపట్ల ఇతరులు ఔదార్యతను చాటుకునేందుకు వీలుగా ఈ బిల్లు క్రమబద్థీకరణ జరిగినట్లు మంత్రులు వివరించారు. దంపతులు ఇద్దరూ భారతీయులు అయి ఉంటేనే ఈ విధంగా సరోగసీకి వెళ్లేందుకు వీలుంటుందని ఇరానీ తెలిపారు. మహిళల సంతాన హక్కులు, పునరుత్పత్తి విషయాలపై ప్రధాని మోడీ ఔదార్య వైఖరిని ప్రదర్శించారని, చట్టపరమైన కట్టుబాట్ల సంక్లిష్టతలు లేకుండా చూశారని మంత్రి తెలిపారు. ఆయన మార్గదర్శకత్వంలోనే తగు బిల్లుకు రూపకల్పన జరిగిందని వివరించారు. 2019లో లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లుకు ఎగువ సభ సెలెక్ట్ కమిటీ తగు సవరణలతో కూడిన సిఫార్సులు వెలువరించింది. వీటిని దృష్టిలో పెట్టుకుని బిల్లును తగు విధంగా రూపొందించినట్లు మంత్రులు వివరించారు. వచ్చే నెలలో తిరిగి మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ విరామానంతర సమావేశాలలో ఈ సవరించిన బిల్లును ఆమోదానికి ప్రవేశపెడుతారు. సరోగసీని క్రమబద్థీకరించే దిశలో సరైన వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఇందులో భాగంగా జాతీయ సరోగసీ బోర్డు కేంద్రస్థాయిలోనూ, రాష్ట్రాలవారిగా వేర్వేరుగానూ సరోగసీ మండళ్లు ఉంటాయి. ఇక సరోగేట్ తల్లికి ఇప్పుడున్న ఇన్సూరెన్స్ పరిధి 16 నెలలను 36 నెలలుగా పెంచారు. ఇదే క్రమంలో సరోగసీ వాణిజ్య ధోరణులు, తద్వారా తలెత్తే అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీవ్రతరం చేయాలని సంకల్పించారు.
జమ్మూ కశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలు
కేంద్ర పాలిత ప్రాంతంగా పరివర్తన అయిన జమ్మూ కశ్మీర్‌లో కేంద్ర చట్టాల అమలుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని మేరకు 37 కేంద్ర చట్టాలను యుటి ఉమ్మడి జాబితాలో అమలుపరుస్తారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేబినెట్ భేటీ తరువాత తెలిపారు. గత ఏడాది ఆగస్టులో కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర చట్టాలు అక్కడ అమలు కావల్సి ఉంది. ఇందుకు అక్కడి అసెంబ్లీ ఆమోదం అవసరం. ఈలోగా కేంద్ర చట్టాలను రాష్ట్ర పునర్వస్థీకరణ చట్టం పరిధిలో అమలు చేసేందుకు ఇప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
జాతీయ జవుళి సాంకేతిక మిషన్‌కు రూ 1480 కోట్లు
జాతీయ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ (ఎన్‌టిటిఎం) ఏర్పాటు, ఈ వ్యవస్థకు రూ 1480 కోట్ల కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వస్త్ర పారిశ్రామిక రంగంలో వినియోగించే టెక్నికల్ ఫాబ్రిక్స్ ఉత్పత్తిలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ మిషన్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రివర్గ భేటీ తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నాలుగేళ్లు అమలు ప్రక్రియతో ఈ ఉత్పత్తుల కాలం కొనసాగేలా ఖరారు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 202324 ఆర్థిక సంవత్సరం వరకూ ఈ మిషన్ సాగుతుందని మంత్రి వెల్లడించారు.

Union Cabinet approved Surrogacy bill