Home జాతీయ వార్తలు వరికి రూ. 200 పెంపు

వరికి రూ. 200 పెంపు

మద్దతు ధరపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

క్వింటాలు రూ.1750కి చేరిన సాధారణ రకం వరి ధర
పత్తి 4020 నుంచి 5150కి
కందులు 5450 నుంచి 5675
పెసలు 5575 నుంచి 6975
మినుములు 5400 నుంచి 5600

Paddy-Crop

న్యూఢిల్లీ :  కేంద్ర ప్రభుత్వం వరి పంటకు మద్దతు ధరలను  (ఎంఎస్‌పి)రికార్డు స్థాయిలో పెంచింది. కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ 200 మేర పెంచాలని కేంద్ర మంత్రి మం డలి బుధవారం నాటి భేటీలో నిర్ణయించింది.  వరితో పాటు మొత్తం 14 పంటల ధరలను పెంచారు. ఈ పెంపుదలతో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ 15,000 కోట్లకు పైగా భారం పడుతుంది. ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ తరచూ రైతులతో ఇష్టాగోష్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారి కడగండ్లను తీరుస్తామని హామీ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రైతుల సాగు వ్యయంలో సగానికి పైగా అధిక రేటు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుం టూ కేంద్ర మంత్రి మండలి ఇప్పుడు ఈ పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కీలకమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ)  సమావేశం జరిగింది. ఈ సం దర్భంగానే వరి రైతుల మద్దతు ధర పెంపుదల నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఇంతకు ముందు యుపిఎ రెండో దశలో 201213 ఎన్నికల సంవత్సరంలో  వరికి ఎంఎస్‌పిని క్వింటాలుకు రూ 170 చొప్పున పెంచారు. అప్పట్లో అత్యధిక హెచ్చింపు. ఇప్పుడు ఈ రికార్డును అధిగమిస్తూ రూ 200 మేర పెంచారు. మోడీ నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా నాలుగేళ్లలో క్వింటాలుకు రూ 50 నుంచి రూ 80 మధ్యన పెంచుతూ వచ్చారు. ఇప్పటి కేబినెట్ కమిటీ సమావేశ వివరాలను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ తరువాత విలేకరులకు తెలిపారు. వరితో పాటు 14 ఖరీఫ్ పంటలకు కూడా 201819 పంటకాలానికి సంబంధించి మద్దతు ధరను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. పెంపుదల నిర్ణయంతో సాధారణ రకం వరి ధర క్వింటాలుకు రూ 1750కి చేరుతుంది. ఇప్పటివరకూ ఇది రూ 1550గా ఉంది. ఇక గ్రేడ్ ఏ గ్రేడ్ వరి ధరను క్వింటాలుకు ఇప్పుడున్న రూ 1590 నుంచి రూ 1750కి పెంచారు. పత్తి (మధ్య రకం) ధరను ఇప్పుడున్న రూ 4020 నుంచి రూ 5150కి పెంచారు. పొడువు రకం పత్తి ధరను రూ.4320 నుంచి రూ.5450 కి పెంచారు. ఇక పప్పు ధాన్యాలలో కందులకు క్వింటా లు ధరను ఇప్పుడున్న రూ 5450 నుంచి రూ 5675కు పెంచారు. పెసర్ల ధరలను రూ 5575 నుంచి రూ 6975కు , మినుముల ధరలను రూ 5400 నుంచి రూ 5600కు పెంచాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. పంటసాగు వ్యయానికి కనీసం 1.5 రెట్లు అధికంగా కనీస మద్దతు ధరను ఖరా రు చేస్తామని 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి హామీ ఇచ్చింది. దీనిని ఇప్పుడు ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి తెలిపారు. ఒకటిన్నర రెట్లు మద్దతు ధరలను పెంచుతామని పేర్కొంటూ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిపాదించారు. దీనిని ఇప్పటి కేబినెట్ సమావేశంలో ఆమోదించడం ద్వారా కార్యరూపంలోకి తీసుకువచ్చారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాము ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి వ్యవహరింరామని ప్రధాని తెలిపారు. రైతాంగానికి అభినందనలు అని పేర్కొన్నారు. మద్దతు ధరల పెంపుదలలో ఇది కీలకం చారిత్రకం అని వ్యాఖ్యానించారు.
వరికి సాగు వ్యయం క్వింటాలుకు రూ 1,166
వరి పంట ఉత్పత్తి వ్యయం క్వింటాలు ప్రాతిపదికన చూస్తే రూ 1,116 వరకూ ఉంటుందని ప్రభుత్వ ధరల సలహా మండలి (సిఎసిపి) అంచనా వేసింది. ఇప్పుడు కేంద్ర మంత్రి మండలి రూ 200 మేర మద్దతు ధరను పెంచడం ద్వారా క్వింటాలు ధరలు ఈ సీజన్‌లో రూ 1750కి చేరుతాయని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రైతులలో అసంతృప్తిని తొలిగించి విశ్వాసం పునరుద్ధరించేందుకు ఈ పెంపుదల చర్యలు దోహదం చేస్తాయని చెప్పారు. ఇది చారిత్రక నిర్ణయం అని తేల్చిచెప్పారు. అన్ని విధాలుగా ఆలోచించి అన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని వరి మద్దతు ధరలను పెంచినట్లు, ఇది హడావిడి నిర్ణయం కానేకాదని తెలిపారు. ఖజానాకు రూ 15వేల కోట్ల భారం పడుతుందని వివరించారు. రైతాంగ ఆదాయం రెండింతలు చేయడమే ప్రభుత్వ ఆలోచన అని, ఇప్పటి పెంపుదలతో రైతుల ఆదాయం పెరిగి, వారి కొనుగోళ్ల సామర్థం ఇనుమడిస్తుంది. తత్ఫలితంగా విస్తృత స్థాయి ఆర్థిక కార్యకలాపాలకు మార్గం ఏర్పడుతుందని వివరించారు.
ద్రవ్యోల్బణం పెరగదు : మద్దతు ధరల పెంపుదల నిర్ణయానికి ముందు అన్ని అంశాలను బేరీజు వేసుకున్నట్లు, ప్రత్యేకించి ద్రవ్యోల్బణం అంశం ఆందోళన కల్గించిందని, అయితే ఈ చర్యతో ద్రవ్యోల్బణం పెరగుతుందనడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. గత నాలుగేళ్లలో దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని , ఇక ముందు కూడా ఇదే విధంగా ఉంటుందని వివరించారు. పప్పు ధాన్యాలకు కూడా తగు విధంగా మద్దతు ధరలను వాటి సాగు వ్యయాన్ని బట్టి పెంచినట్లు మంత్రి వివరించారు. రాగుల ధరలను రికార్డు స్థాయిలో క్వింటాలకు రూ 997అధికం చేసినట్లు మంత్రి తెలిపారు. జొన్నలకు క్వింటాలు ధరలను రూ 730 వంతున పెంచారు.
చమురు ధాన్యాల ధరలు : ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చమురు గింజల ధరలు పెరిగాయి. వంటనూనెల గింజలలో సోయాబిన్ కనీస మద్దతు ధర ఇంతకు ముందు రూ 3050 ఉండగా దీనిని ఇప్పడు రూ 3399 స్థాయికి చేర్చారు. పల్లీల ధలను రూ 4890కి ( ఇంతకు ముందు ఇవి రూ 4450గా ఉండేవి), పొద్దు తిరుగుడు గింజల ధరలను క్వింటాలకు ఇంతకు ముందు రూ 4100 ఉండగా దీనిని ఇప్పుడు రూ 5398గా చేశారు. ఇక నల్ల జీలకర్ర ధరలను ఇంతకు ముందు క్వింటాలుకు రూ 4050 ఉండగా దీనిని ఇప్పుడు రూ 5817 గా ఖరారు చేశారు. చమురు గింజల ధరలను సాగు వ్యయంతో పోలిస్తే 50 శాతం పెంచినట్లుగా నిర్థారించారు. రైతాంగమే అతి పెద్ద ఉత్పత్తిదార్లు, వారే వినియోగదార్లు. వారే అన్ని కోణాల్లోనూ దేశానికి వెన్నెముక. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రైతులకు సముచిత ధరలు దక్కకపోవడం దారుణమే. దీనితోనే వారిలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని ప్రధాని అర్థం చేసుకుని తగు విధంగా స్పందించారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. మద్దతు ధరల పెంపు నిర్ణ యం పట్ల ఆహార మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి గింజకు గిట్టుబాటు ధరలు దక్కేలా చేస్తామని తెలిపారు. దేశంలో ఎన్నికలకు ఈ ధరల పెంపుదలకు లింక్ లేదని, ఇది వాస్తవిక పద్థతిలో తీసుకున్న నిర్ణయం అని మంత్రి చెప్పారు. సాధారణంగా ప్రజలు వ్యవసాయ ధరల పెంపుదల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తారని, అదే ఇతర సరుకుల ధరలు పెరిగితే కిమ్మనకుండా ఉంటారని మంత్రి వ్యాఖ్యానించారు.
ఎఫ్‌సిఐ ఆయువుపట్టు
పెంచిన ధరల మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) ఆహార ధాన్యాల సేకరణ జరుపుతుంది. పంపిణీ కూడా ఈ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. గోధుమలు, బియ్యా న్ని ప్రభుత్వ ప్రకటిత మద్దతు ధరల మేరకు కొనుగోలు చేస్తుంది. అమ్మకాలు కొనుగోళ్లు అన్ని కూడా ఆహార భద్రతా చట్టం పరిధిలో చేపడుతారు. ఖరీఫ్‌లో వరి ప్రధాన పంటగా ఉంటుంది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపుగా వరి పంట సాగు మొదలైంది. ఈసారి వర్షాలు సంతృప్తికరంగానే ఉంటాయనే అంచనాల నేపథ్యంలో మద్దతు ధరలను పెంచారు. అయితే ఈ పెంపుదల ఆహార ద్రవ్యోల్బణానికి దారితీస్తుందనే ఆందోళన కూడా ఉంది. 201718 పంట కాలంలో దేశంలో రికార్డు స్థాయిలో 279.51 మిలియన్ టన్నుల ఉత్పత్తి అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బియ్యం, గోధుమలు, పప్పులు, తృణధ్యానాలు బాగా పండినట్లు వివరించాయి.
ఎయిర్ ఇండియా నిర్వహణ వ్యయం పెంపు
నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకు వివిఐపిల విమానాల నిర్వహణ వ్యయం కేటాయింపుల పెంపుదలకు కేంద్రం నిర్ణయం తీసుకుంది . వార్షికంగా దీనిని రూ 200 కోట్లు పెంచాలని ఖరారు చేశారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానిల రాకపోకలకు ఎయిర్ ఇండియా ప్రత్యేక అదనపు రకం విమానాలు లేదా వివిఐపి విమానాలను నిర్వహిస్తుంది. ఇప్పటివరకూ ఈ వ్యయం రూ 336 కోట్లుగా చెల్లించేవారు. దీనిని ఇప్పుడు రూ 534 కోట్లకు పెంచారు. ఇప్పటికే ఈ వైమానిక సంస్థ నష్టాలలో ఉండ టం, ఇటీవలే ప్రభుత్వం దీని వాటాల అమ్మకాలకు తలపెట్టడం జరిగింది. ఈ పరిస్థితిలో సంస్థకు ప్రముఖుల ప్రయాణాల భారం మరింతగా మోపడం తగదనే ఆలోచనతో ఈ ప్రత్యేక విమానాల నిర్వహణా భారాన్ని కేంద్రం మరింతగా భరిస్తుందని కమిటీ తెలిపింది