Home తాజా వార్తలు కరోనా కట్టడిలో మీ చర్యలు భేష్

కరోనా కట్టడిలో మీ చర్యలు భేష్

Union govt compliments TS for low case fatality

 

పిహెచ్‌సిలు, బస్తీ దవాఖానాల్లోనూ కొవిడ్ టెస్టులు నిర్వహించడం అభినందనీయం
మరణాల రేటు జాతీయస్థాయి కన్నా తెలంగాణలో తక్కువగా ఉంది
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రశంసలు
పాజిటివ్‌ల సంఖ్య తగ్గడం మొదలైంది
గణనీయంగా నిర్ధారణ పరీక్షలు
ఆసుపత్రుల్లో అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం : సిఎస్

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర కేబినెట్ కార్యదర్శి అభినందించారు. కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా రాష్ట్రంలో తక్కువగా ఉన్నాయన్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, క్యాబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా 12 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో రాష్ట్రాలలో కరోనా నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలపై సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచడంతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో టెస్టులు నిర్వహించడాన్ని కేంద్ర కార్యదర్శి మెచ్చుకున్నారు.

ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం మొదలైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచామని, లక్షణాలు ఉండి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగటివ్ రిజల్ట్ వచ్చిన వారికి ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.

 

Union govt compliments TS for low case fatality