Friday, April 19, 2024

సంపాదకీయం: సమితి సంబురాలు

- Advertisement -
- Advertisement -

 United Nations 75th anniversary occasions మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ సందర్భం కరకు కరోనా మృత్యు విలయ నాట్యం నేపథ్యంలోనూ హర్షించదగినది, ఆహ్లాదకరమైనది. ఎన్ని ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని శాంతి సామరస్యాల కోసం, మరింత వాసయోగ్యమైన, ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం, పేదరిక నిర్మూలన కోసం, మానవ హక్కుల సాధన కోసం పని చేసే వేదికగా సమితి కొనసాగుతూ ఉండడమే మానవాళికి సంతోషదాయకం. డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అమెరికా అంతర్జాతీయ సహకారం నుంచి నెమ్మది నెమ్మదిగా దూరమవుతున్నప్పటికీ స్థూలంగా పరస్పరత అంతరించిపోలేదని సమితి ఉనికి చాటుతున్నది. అయితే మారిన, మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ప్రపంచ వేదిక స్వరూప స్వభావాల్లో మార్పు చోటు చేసుకోకపోడం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న లోపం.

మంగళవారం నాడు 75వ వార్షికోత్సవాల ప్రారంభ వేళ ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ లోపాన్ని దృఢంగా ఎత్తి చూపారు. వర్తమాన సవాళ్లను ఎదుర్కోడానికి కాలదోషం పట్టిన వేదికలు సరిపోవని, ఐక్యరాజ్య సమితిలో సమగ్ర సంస్కరణలు తీసుకురాని పక్షంలో దాని విశ్వసనీయతకు ముప్పు వాటిల్లుతుందని ప్రధాని చేసిన హెచ్చరిక ముమ్మాటికీ వాస్తవం, అర్థవంతం. వచ్చే జనవరి నుంచి భద్రతా మండలిలో రెండేళ్ల తాత్కాలిక సభ్య దేశంగా ఇండియా బాధ్యతలు నిర్వహించనున్నది. ప్రధాని మోడీ హెచ్చరికకు ఈ నేపథ్యంలో విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచంలో అత్యధిక జనాభా గల రెండవ దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య సమాజం అయిన ఇండియాకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోడం, వీటో అధికారాలున్న ఆ ఐదు దేశాల నిరంకుశ పెత్తనానికి ఎదురు లేకుండాపోడం, 1945లో అప్పటి పరిస్థితులను బట్టి నెలకొన్న మండలి ఈ నాటికి అనుగుణంగా పరివర్తన చెందకపోడం స్పష్టంగా కనిపిస్తున్న లోపాలు.

75వ వార్షికోత్సవాల సందర్భంగా సర్వప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) ఆమోదించిన రాజకీయ ప్రకటనలోనూ బహుళ పక్ష భాగస్వామ్యంలో సంస్కరణలు చేపట్టవలసిన అవసరాన్ని నొక్కి పలికారు. రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్స పరిస్థితుల్లో అవతరించిన ఐక్యరాజ్య సమితి ఘర్షణలు, ఉద్రిక్తతలు లేని నూతన విశ్వ సమాజ అవతరణను లక్షంగా చేసుకున్నది. కాని ఆచరణలో అది దుస్సాధ్యంగానే రుజువవుతున్నది. ఏకాభిప్రాయాన్ని సాధించి, దేశాల మధ్య సామరస్య ఒప్పందాలను కుదిర్చే వేదికగా సమితి వైఫల్యం నిలువెత్తున దర్శనమిస్తున్నది. 2003లో అమెరికా, దాని మిత్ర దేశాలు కలిసి ఇరాక్‌పై జరిపిన యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితి ఖండించిన సంగతి తెలిసిందే. జన విధ్వంసక ఆయుధాలు తయారు చేస్తున్నదనే రుజువు కాని కారణం మీద సద్దాం హుస్సేన్ ఏలుబడిలోని ఇరాక్‌పై జార్జిబుష్ నేతృత్వంలో అమెరికా, దాని మిత్ర దేశాలు జరిపిన దాడి ఐక్యరాజ్య సమితి నియమావళికి విరుద్ధమని, అది అక్రమ యుద్ధమని అప్పటి సమితి ప్రధాన కార్యదర్శి కోఫి అన్నన్ స్వయంగా ప్రకటించారు.

ఇప్పుడు ఇరాన్ విషయంలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా ఏకపక్షమైనవే. ఒబామా అధ్యక్షుడుగా ఉండగా అమెరికా బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాలతో కలిసి ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి ట్రంప్ నేతృత్వంలోని అమెరికా తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా చైనా, భారత దేశం పట్ల ప్రదర్శిస్తున్న అమిత్ర వైఖరి కూడా ఆ కోవలోనిదే. అటు అమెరికాతో ప్రచ్ఛన్న యుద్ధంలో తలమునకలై, ఇటు ఇండియాపై ప్రత్యక్ష ఘర్షణకు దిగుతున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తాము ఆ రెండు రకాల వైరాలకు వ్యతిరేకమని సమితి తాజా వార్షికోత్సవాల సందర్భంగా ప్రకటించడం కంటే హాస్యాస్పదం ఏముంటుంది? అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోటీ ప్రపంచానికి అదనపు తలనొప్పులు కలిగించే స్థాయికి చేరుకున్నది. దీనిని దృష్టిలో ఉంచుకునే సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గమనార్హమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఆర్థిక బల సంపన్నమైన రెండు దేశాలు ప్రపంచాన్ని చీలుస్తున్నాయి, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేం అని గుటెర్రెస్ చేసిన వ్యాఖ్య సమితి సదాశయాలకు ఎదురు కానున్న అగ్ని పరీక్షను గురించి హెచ్చరిస్తున్నది. ఆయన సూచించినట్టు ప్రపంచమంతటా ఘర్షణలు, కాల్పుల విరమణకు భద్రతా మండలి వేదికగా చిత్తశుద్ధితో కూడిన కృషి జరగాలి. అమెరికా, చైనాల మధ్య ఉత్పన్నమైన ప్రచ్ఛన్న యుద్ధానికి తెర దించాలి. అప్పుడే నూతన ప్రపంచ అవతరణకు దారులు పడతాయి. లేని పక్షంలో నీతులది, చేతలది చెరో దారై ప్రపంచం, ప్రపంచ వేదిక తీవ్రమైన సంక్షోభానికి లోనవుతాయి. విశ్వవ్యాప్తంగా గల కోట్లాది పేద, బలహీన వర్గాల ప్రజలు మరింతగా దిక్కులేని వారవుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News