Home ఎడిటోరియల్ వర్శిటీలపైనే ఎందుకు కన్నేశారు?

వర్శిటీలపైనే ఎందుకు కన్నేశారు?

JNUఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ ఆవరణలో శనివారంనాడు అనూహ్యమైన పరిస్థితు లు నెలకొన్నాయి. క్యాంపస్‌లో పోలీసుల చర్యలకు, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్యకుమార్ అరెస్టుకు నిరసన తెలిపేందుకు ఈ యూనివర్శిటీకి చెందిన రెండు వేల మంది విద్యార్థులు, అధ్యాప కులు ఆవరణలో గుమిగూడారు. ఈ విషయం తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అక్కడకు రావడం, అంతలోనే మీడియా వాళ్ళు కూడా తమ కెమెరాలతో దూసుకురావడంతో ఒక దశలో తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతలోనే కొన్ని సెకన్ల వ్యవధిలో మరో పదిహేను మంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) కార్యకర్తలు నల్లజెండాలతో లోపలికి ప్రవేశించి, రాహుల్‌గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. విద్యార్థులు శాంతియుతంగానే మానవహారం నిర్వహించారు. అధ్యాపకులు కూడా చేతులుకలిపారు. మానవహారం మూలంగా విద్యార్థులంతా ఒకరిచేతులు ఒకరు పట్టుకొని వెనక్కి జరి గారు. దీంతో మీడియా, ఎబివిపి కార్యకర్తలు ఒక మూలకు వెళ్లాల్సివచ్చింది. ఈ మానవహారంలో వందలాది మంది అధ్యాపకులు కూడా పాల్గొనడం విశేషం. రాహుల్‌గాంధీ క్యాంపస్‌ను వదిలివెళ్ళేంత వరకు ఎబివిపి కార్యకర్తల నినాదాలు కొనసాగు తూనే వున్నాయి. అయితే ఆ నినాదాలేవీ పక్కనున్న వాళ్ళకుతప్ప అందరికీ వినపడే పరిస్థితి అక్కడ లేదు.

బహుశా దేశంలోనే ఇది అత్యంత శాంతియుత మైన కాంపస్. రెచ్చగొట్టే ధోరణులు కన్పించిన ప్రతిసారీ విద్యార్థులు, అధ్యాపకులు ఒకేతాటిపై నిలిచారు. ఈ వర్శిటీ సంస్కృతిలో చర్చలు, వాదోప వాదాలు, అసమ్మతులు ఎల్లప్పుడూ వుండేవే. కానీ ఏనాడూ అది హింసాత్మకం కాలేదు. అసమ్మతిని హింసతోనే అణగదొక్కాలనుకునేవారికి ఇలాంటి సంస్కృతి గురించి తెలిసివుండవచ్చు. కానీ ఆ అను భవం లేనివారికి అది కొత్తగానే వుంటుంది. ప్రజా స్వామ్యయుతంగా తమ అసంతృప్తిని తెలియ జేయాలన్న అంశమొక్కటే వారికి తెలుసు. చాలా యూనివర్శిటీలకు ఇలాంటి కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటీవల వార్తలు చూస్తే, చాలా యూనివర్శిటీ ల్లో సరికొత్త పరిస్థితులు కన్పిస్తున్నాయి. వీటిని అవగాహన చేసుకోవడానికి కీలకమైన మూడు అంశాలను తెలుసుకోవాల్సిన అవసరముంది. అవేమి టేంటే- మొదటిది, యూనివర్శిటీలు ఉద్రిక్తం గా మారిన అన్ని సందర్భాల్లోనూ విద్యార్థులు తమ బాధ్యతాయుతమైన వ్యవహారశైలిని కాస్త అతిగా ప్రదర్శించడం. రెండవది, ఇదే తరహా ‘అతి బాధ్యత’ను మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రదర్శించడం. మూడవది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), భారతీయ జనతాపార్టీ (బిజెపి)లకు చెందిన ముట్టడి సేనలుగా ఎబివిపి తన పాత్రను మరీఅతిగా పోషించడం.

ఈ నేపథ్యంలో మీడియా బాధ్యతారాహిత్యం ప్రస్తావనార్హం. రాజకీయ నాయకులు, సెలబ్రిటీల ఫోటోల కోసం మతిలేని పోటీలతో వారు ఎలాంటి రిపోర్ట్ ఇస్తున్నారో వారికే (మీడియాకే) అర్ధం కావడం లేదు. తమ కథనాలతో గందరగోళ పరుస్తు న్నారు. శనివారంనాడు జెఎన్‌యులో జరిగిన ఘట నే ఇందుకు ఉదాహరణ. ఒక రిపోర్టర్ మైక్ పట్టుకొని ఏదో చెప్తున్నాడు. నేను వింటున్నాను. “రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఇక్కడకు చేరుకోవడంతో జెఎన్‌యులో ఘటనలు రాజకీయం వాతావరణాన్ని సంతరించుకున్నాయి” అని ఆ రిపోర్టర్ చెప్తున్నాడు. నాయకులు రావడమెందుకు? యూనివర్శిటీ క్యాంపస్‌లోకి పోలీసులు రావడం తోనే రాజకీయ వాతావరణం వచ్చేసింది కదా! ఇంకొక రిపోర్టర్ ఏమంటున్నారంటే, “విద్యార్థుల్లో చీలిక వచ్చింది. కొందరు విద్యార్థులు ఎబివిపి కార్యకర్తలతో కలిసి నల్లజెండాలు ప్రదర్శిస్తున్నారు” అని అంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం? వేలాది మంది విద్యార్థులు జెఎన్‌యు వైపు అంటే కన్హయ్య కుమార్ వైపు నిలబడి ఉండగా, కేవలం ఇరవైమంది మాత్రమే నల్లజెండాలు పట్టుకున్నారు. ఇది విద్యార్థి లోకంలో అతిపెద్ద చీలికగా పరిగణించవచ్చా? ఇది తప్పుడు మీడియా రిపోర్ట్ కాదా? యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనల విషయంలోనూ అలాగే జరిగింది. రోహిత్ వేముల ఆత్మహత్య జరిగి, వర్శిటీ ఆందోళనకరంగా మారినంత వరకు మీడియా రిపోర్టులు పూర్తిగా ఏకపక్షంగానే సాగాయి.

కాకపోతే, ఈ రిపోర్టర్లు కూడా యువకులే కదా! వారికి తెలిసిందేదో వారు చెప్తున్నారు. కానీ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి టెలివిజన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉండరు. మీడియా తప్పుడు వార్తలను గ్రహించకుండా మానరు. బ్రేకింగ్ న్యూస్‌ల పేరుతో ఆలోచనారహితమైన కవరేజి లు, స్టుడియోల్లో అర్థరహితమైన అరుపులు, యాంకర్ల కీచుగొంతులు, వారు ఈ దిశగా పోతు న్నారో తెలియకుండా పోతుందా? కానీ ఏదోఒక రోజున ఓ చానల్ పుడుతుంది. అది 24 గంటల చానల్ కానక్కర్లేదు. రాజకీయ వివాదాలపై కచ్చితంగా అర్థవంతమైన చర్చను చేపట్టేందుకు నిజమైన ప్రయత్నం చేస్తుందని ఆశిస్తున్నాను. ఇక మూడో విషయానికొస్తే, ప్రజాస్వామ్య ఆకాంక్షలను వ్యక్తీకరిస్తే అది జాతీయవాద వ్యతిరేక మంట! ఇలా ప్రచారాన్ని చేసేందుకు ఎబివిపి అన్ని యూనివర్శిటీల్లో బాధ్యతను భుజానకెత్తుకున్నది. ఏదో హానికరమైన సమస్య తలెత్తిందని ఫిర్యాదు చేయడం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ హుటాహుటిన రంగంలోకి దిగి బీభత్సం చేయ డం పరిపాటిగా మారిపోయింది. పంజాబ్ యూనివర్శిటీకి గ్రాంట్లు నిలిచిపోయాయి. జీతాలు ఇవ్వడం లేదు. హాస్టల్ ఫండ్స్‌లో అవకతవకలు జరుగు తున్నాయని ఆరోపిస్తూ ఎబివిపి కార్యకర్తలు మానవ వనరుల అభివృద్ధి శాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. అవకతవకలపై వైస్‌ఛాన్సలర్ ఓ విచారణ కమిటీని నియమించారు. అన్ని రికార్డులనూ సమర్పించారు. అయినా గ్రాంట్లు ఆగిపోయాయి, జీతాలు నిలిచిపోయాయి. ఇంత దారుణం ఎక్కడైనా వుందా? హైదరాబాద్ యూని వర్శిటీలో కఠిన చర్యలు తీసుకోవాలని వైస్‌ఛాన్సలర్ ను ఇదే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాడులకు పాల్పడిన ఎబివిపి కార్యకర్తలపై కాదు…అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్‌పై ఆ కఠిన చర్యలు తీసుకున్నారు.

ఇంకో ఉదంతంలో, ఓ హాస్టల్ గదిలో అగ్నిప్రమాద సూచికగా (జెఎన్‌యు) ఓ హావెన్ (ఫిరంగి)ను పెట్టినందుకు ఎబివిపి కార్యకర్తలు హాస్టల్ వార్డెన్‌పై దాడికి దిగారు. మత మనోభావా లను దెబ్బతీశారంటూ వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్ యూని యన్ ప్రెసిడెంట్‌పై భౌతికదాడులకు పాల్పడ్డారు. ఇలా ఎన్నో ఘటనలు దేశవ్యాప్తంగా యూనివర్శిటీ ల్లో జరుగుతున్నాయి. వాటిని మాత్రం మానవ వనరుల శాఖ పట్టించుకోదు. ముజఫర్‌నగర్‌లో మత హింస వెనుక హిందూత్వవాద సంస్థల పాత్రను ఎత్తిచూపుతూ నకుల్ సాహ్నీ చిత్రీకరించిన డాక్యు మెంటరీ ‘ముజఫర్‌నగర్ బాకీ హై’ను ప్రదర్శించ నీయకుండా హింసాత్మకంగా అడ్డు కున్నది కూడా ఎబివిపి కార్యకర్తలే. వివిధ రాష్ట్రాల్లో బీఫ్ ఫెస్టివల్ జరగకుండా ఎబివిపి దాడులు నిర్వహించిన విషయం అందరికీ తెల్సిందే. ఇక తుది అంశానికొస్తే, యూనివర్శిటీ పాలక వర్గం అంటే వైస్‌ఛాన్సలర్లు, ఇతర కీలక అధికారుల పాత్ర ప్రశ్నార్ధకంగా మారింది. ఎబివిపి కార్యకర్తలు ఇచ్చే చిన్నచిన్న ఫిర్యాదులపై కూడా కొందరు వర్శిటీ అధికారులు చూపిన అత్యుత్సాహం విచారకరం. జెఎన్‌యు స్టూడెంట్స్ ప్రెసిడెంట్‌పై రాజద్రోహం నేరాన్ని మోపడం గురించి వేరే చర్చ పెట్టుకుందాం. అసలు రాజద్రోహమనేది వుందా? ఇంతకీ రాజ ద్రోహం అంటే ఏమిటి? ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ లో రాజద్రోహం అనే నేరానికి స్థానమే లేదు. ఇలాంటివాటిని నేరపూరితంగా మార్చే నిబంధనలు సహేతుకం కాదు. సమర్ధనీయమూ కాదు. ఇలాంటి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం, ప్రజాసామ్య వ్యతిరేకం. బ్రిటిష్ పాలనాకాలంలో వచ్చిన ఈ నిబంధనను 2009లో బ్రిటన్‌లోనే రద్దుచేశారు. ఇంకా మనదేశంలో దీన్ని పట్టుకొని వ్రేలాడటం విచిత్రంగా వుంది.

పదేపదే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కథలు చెపుతూ ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఎదగడానికి ‘స్కెచ్’ గీస్తున్నట్లు చెప్పు కుంటున్న మోడీ ప్రభుత్వం మరోసారి వలసకార్మిక వాదాన్ని తీసుకువస్తున్నట్లు కన్పిస్తోంది. ప్రపంచ పెట్టుబడిదారులకు చౌకగా దొరికే కార్మికులను భారత్ అందిస్తుందన్నది ఆయన విధానం. ఇందుకోసం యూనివర్శిటీ విద్యార్థులు, ఇతర యువకులను ఆయన టార్గెట్‌గా పెట్టారు. ప్రస్తుతం నయా ఉదారవాద, హిందూ జాతీయవాద దార్శని కతతో ముందుకుపోతున్న భారత్‌కు ఎప్పటికైనా ఇదొక పెద్ద సవాల్. ఈ క్రమంలో సామాజిక న్యాయం, స్వేచ్ఛాసమానత్వాలు, రాజ్యాంగ విలువ లు ఉంటాయనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ నేపథ్యంలోనే యువతను మేల్కొలపాలి. ప్రజా స్వామ్యీకరణ ఒక కొనసాగే ప్రక్రియ అని గుర్తించి, స్వీయ విమర్శ చేసుకుంటూనే, కుల, లింగ వివక్ష లకు వ్యతిరేకంగా, తాడితపీడిత వర్గాలకు దన్నుగా వ్యవస్థీకృత మార్గాల ద్వారా యూనివర్శిటీలను పరిపుష్టం చేసేందుకు, వర్శిటీ విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు కృషి చేయడం సమష్టి బాధ్యత.

రచయితః ఫెమినిస్ట్ స్కాలర్, జెఎన్‌యు ప్రొఫెసర్
‘ది హిందూ’ సౌజన్యంతో (స్వేచ్ఛానువాదం)