Home ఎడిటోరియల్ వర్శిటీల్లో ప్రతిభకు పట్టం!

వర్శిటీల్లో ప్రతిభకు పట్టం!

PhD

 

విశ్వవిద్యాలయాల స్థాయిలో బోధనా సిబ్బంది నియామకానికి పిహెచ్‌డిని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం తప్పనిసరి చేసిన పరిస్థితులలో, భవిష్యత్తులో అధ్యాపక వృత్తిలో స్థిరపడే పరిశోధకులకు, పరిశోధనతో పాటుగా బోధనలో మెళకువలు నేర్చుకోవడం కోసం బోధన పరమైన అంశాలలో కూడా అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ఆయా యూనివర్శిటీలు మీద ఉంటుంది. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా కేవలం ప్రాక్టీస్ దృష్ట్యా జాతీయ ఉపకార వేతనాలు అందుకుంటున్న పరిశోధకులకు వారానికి రెండు నుంచి 5 తరగతులు సంబంధిత సబ్జెక్టులో బోధించే వెసులుబాటును విశ్వవిద్యాలయాల నిధుల సంఘం కల్పించింది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో బోధన సిబ్బంది కొరత వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో, పరిశోధకుల సేవలు వినియోగించుకునే ఇటువంటి నిర్ణయాలు అటు విద్యార్థి లోకానికి, ఇటు పరిశోధకుల సమూహానికి మేలు చేసేదిగా ఉంటాయి. ఈ అంశంపై గతంలోనే చాలా విశ్వవిద్యాలయాలు సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చాలా విభాగాలలో ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. దీంతో విద్యార్థులతో పాటుగా పరిశోధకులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు.

ఉన్నత విద్యా వ్యాప్తిలో విశ్వ విద్యాలయాల పాత్ర అత్యంత కీలకం. విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్య అభివృద్ధికై దోహదపడే విధంగా ఉండాలి, కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కనబడడం లేదు. జ్ఞానాన్ని పంచాల్సిన యూనివర్శిటీలు నేడు బోధనా సిబ్బంది లేక వెలవెలబోతున్నాయి. సీనియర్ అధ్యాపకులు చాలా మంది పదవీ విరమణ పొందడంతో బోధన కుంటుపడుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుల కొరత వేధిస్తున్నది, సరైన సంఖ్యలో అధ్యాపకులు లేక సరిగ్గా బోధన జరగకపోవడంతో విద్యార్థులలో సైతం నైరాశ్యం పెరిగి, సరిగ్గా తరగతులకు హాజరు కావడం లేదు. ఏ విశ్వవిద్యాలయంలో చూసిన అత్యధిక విభాగాలలో విద్యార్థుల హాజరు సంఖ్య 50 శాతానికి మించడం లేదు అనేది అంగీకరించాల్సిన సత్యం. కాంట్రాక్ట్, తాత్కాలిక అధ్యాపకులతో విశ్వవిద్యాలయాలు కొంత నెట్టుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో విద్యార్థులను తరగతి గదుల్లోకి తరలించడంలో విఫలం అవుతూనే ఉన్నాయి. శాస్త్ర సంబంధ విభాగాలలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ సామాజిక శాస్త్రాలు, ఇతర విభాగాలలో విద్యార్థుల ఉపస్థితి సంఖ్య ఏమాత్రం మెరుగుపడడం లేదు.

సాధారణంగా సాంప్రదాయ విశ్వవిద్యాలయాలలో బోధ నా రంగం తో పాటుగా పరిశోధన రంగానికి కూడా సమాన స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది. అయితే అధ్యాపకుల కొరతతో పరిశోధన రంగం సైతం క్రమేపీ నిర్వీర్యం అవుతుంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేయడం కోసం సిఎస్‌ఐఆర్-నెట్, యుజిసి నెట్ వంటి దేశవ్యాప్త పరీక్షల ద్వారా ఆయా విభాగాలలో నాణ్యమైన విద్యార్థులను గుర్తించి, వారికి పరిశోధనల కోసం కొంత ఆర్థిక సహాయాన్ని సైతం విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యుజిసి) ద్వారా అందజేయడం జరుగుతుంది, దాని కోసం ప్రతి ఏటా రెండు సార్లు జాతీయ అర్హత పరీక్షను ఆయా విభాగాల వారీగా నిర్వహించి ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడం జరుగుతున్నది. అయితే దేశ వ్యాప్తంగా నిర్వహించే ఇటువంటి పరీక్షలలో ప్రతిభ కనబరచి ఉత్తీర్ణులైన విద్యార్థులపై సైతం కొన్ని విశ్వవిద్యాలయాలు చిన్నచూపు చూస్తున్నాయి.

పరిశోధనా రంగంపై మక్కువతో అతి కష్టమైన పరీక్షలను దాటుకుంటూ వచ్చినప్పటికీ పరిశోధనలు చేయడానికి వారికి అవకాశాలు కల్పించడంలో విశ్వవిద్యాలయాలు తాత్సారం చేయడంతో ఆయా విద్యార్థులు తీవ్ర నైరాశ్యంతో మునిగిపోతున్నారు. కేటగిరి -I కింద ప్రతి యేటా నోటిఫికేషన్ విడుదల చేసి ఆయా విభాగాలలో అర్హులైన అభ్యర్థులకు పరిశోధన రంగంలో ప్రవేశం కల్పించే అవకాశాలు ఉన్నప్పటికీ దానిపై నిర్ణయం తీసుకోవడంలో విశ్వవిద్యాలయాలు, అధికార యంత్రాంగం ఆలోచించక పోవడం శోచనీయం. కేటగిరి- I కింద ఉస్మానియా విశ్వవిద్యాలయం మినహా రాష్ట్రంలో మరే ఇతర విశ్వవిద్యాలయం కూడా ప్రతి యేటా ప్రవేశాలు కల్పించకపోవడం బాధాకరమైన అంశం. దీనితో ఆయా విద్యార్థులలో పరిశోధనపై ఆసక్తి క్రమంగా తగ్గిపోతున్నది, పరిశోధనలు దేశ ప్రగతికి, విధానపరమైన నిర్ణయాలలో తోడ్పడాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వేళ, ప్రతిభ కలిగిన విద్యార్థులకు పరిశోధనలు చేయడానికి ప్రవేశాలు కల్పించకపొవడంతో నాణ్యమైన పరిశోదనలు జరగకుండా పోయే ప్రమాదం ఉంది.

ఇది దేశ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారుతోంది. దీనిపై అధికార యంత్రాంగం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.మరోపక్క విశ్వవిద్యాలయాల స్థాయిలో బోధనా సిబ్బంది నియామకానికి పిహెచ్‌డిని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం తప్పనిసరి చేసిన పరిస్థితులలో, భవిష్యత్తులో అధ్యాపక వృత్తిలో స్థిరపడే పరిశోధకులకు, పరిశోధనతో పాటుగా బోధనలో మెళకువలు నేర్చుకోవడం కోసం బోధన పరమైన అంశాలలో కూడా అవకాశాలు కల్పించవలసిన బాధ్యత ఆయా యూనివర్శిటీలు మీద ఉంటుంది. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకుండా కేవలం ప్రాక్టీస్ దృష్ట్యా జాతీయ ఉపకార వేతనాలు అందుకుంటున్న పరిశోధకులకు వారానికి రెండు నుంచి 5 తరగతులు సంబంధిత సబ్జెక్టులో బోధించే వెసులుబాటును విశ్వవిద్యాలయాల నిధుల సంఘం కల్పించింది.

రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలో బోధన సిబ్బంది కొరత వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో, పరిశోధకుల సేవలు వినియోగించుకునే ఇటువంటి నిర్ణయాలు అటు విద్యార్థి లోకానికి, ఇటు పరిశోధకుల సమూహానికి మేలు చేసేదిగా ఉంటాయి. ఈ అంశంపై గతంలోనే చాలా విశ్వవిద్యాలయాలు సానుకూల నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చాలా విభాగాలలో ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. దీంతో విద్యార్థులతో పాటుగా పరిశోధకులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. బోధనా రంగంలో సరైన అవకాశాలు లభించక మెళకువలు నేర్చుకోలేక చాలా మంది ఉద్యోగార్జిత పరీక్షలలో విఫలమవుతున్న సంఘటనలు అనేకం. అలా జరగకుండా పరిశోధకులకు సరైన ప్రాక్టీస్ లభించే విధంగా అవకాశాలు కల్పించవలసిన బాధ్యత విశ్వవిద్యాలయాల అధికారుల మీద ఉంటుంది. తద్వారా బోధనలో మరింత లోతు పెరిగి భవిష్యత్‌లో విశ్వవిద్యాలయాలు మరింతగా అభివృద్ధి చెందే వీలు కలుగుతుంది.

విశ్వవిద్యాలయాలు ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఉండాలి. జాతీయ అర్హత పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థులకు పరిశోధన రంగంలో ప్రవేశాలు కల్పించేందుకు గాను ప్రతి ఏటా కేటగిరి -I కింద ప్రకటనలు విడుదల చేసి, వారికి పరిశోధనా రంగంలో అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి. సీనియర్ అధ్యాపకులు పదవీ విరమణ పొందుతున్న దశలో, తరగతుల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టవలసిన బాధ్యత విశ్వవిద్యాలయ అధికారులపై ఉంది. విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వాలు అందజేస్తున్న మూలధనం క్రమంగా తగ్గుతున్న దశలో ఆర్థిక భారం తగ్గించుకోవడంతో పాటుగా ప్రతిభకు గుర్తింపు ఇచ్చే విధంగా అర్హులైన పరిశోధకులకు బోధన రంగంలో సైతం అవకాశాలు కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా పరిశోధన రంగంతో పాటు బోధన రంగం కూడా మరింత బలోపేతం అవుతుంది. ఆ దిశగా విశ్వవిద్యాలయాలు నిర్ణయాలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేకూరుస్తాయని ఆశిద్దాం.

University Funding Committee is mandatory for a PhD