Saturday, April 20, 2024

ఉదయం ఎండలు… సాయంత్రం వానలు

- Advertisement -
- Advertisement -

Unseasonal Rains

 

పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
48 గంటల్లో వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానలు
అప్రమత్తంగా ఉండాలని వాతావరణ, విపత్తుల శాఖ సూచన

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పగటిపూట ఓ వైపు ఎండలు భగభగలాడుతుంటే మరోవైపు అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ 41 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవ్వగా, భద్రాచలం 39.5, హన్మకొండ 39, హైదరాబాద్ 39.7, ఖమ్మం 41.6, మహబూబ్‌నగర్ 40.4, మెదక్ 41.8, నల్లగొండ 40.5, నిజామాబాద్ 41.4, రామగుండం 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. దీని ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తా తీరం వెంబడి గంటకు 30- నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీచే ఆవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి
మరో వైపు తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో వచ్చే ఐదు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్‌నగర్, మలక్‌పేట, కొత్తపేట్, సైదాబాద్, చంపాపేట్, సంతోష్‌నగర్, మాదన్నపేట్, ఉప్పల్, పాతబస్తీ బహదూర్‌పురా, చార్మినార్ తదితర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.

వర్షం కురిసేటప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి: విపత్తుల శాఖ అధికారులు
సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తుల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేటప్పుడు రైతులు, కూలీలు, పశువుల, గొర్రెల కాపరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదయిన వర్షపాతం
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నమోదయిన వర్షపాతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి 20.3 మిల్లీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి 14.5, హైదరాబాద్13.3, రంగారెడ్డి 13, మెదక్ 23.5, సంగారెడ్డి 15.8, వికారాబాద్ 10.3, యాదాద్రి భువనగిరి 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

Unseasonal Rains in Telangana
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News