Friday, March 29, 2024

యుపిలో బిజెపి ఓడితే!?

- Advertisement -
- Advertisement -

BJP releases list of 30 star campaigners for UP polls

భారతదేశ సామాజిక నిర్మాణ వ్యవస్థ ఎలా ఉంది? దేశానికి ఫాసిజం ప్రమా దం పొంచి ఉన్నదా? ఉంటే అది ఏ రూపంలో ఉంది? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, ఓడితే ఎలా ఉంటాయి? కశ్మీరీలు ఏం కోరుకుంటున్నారు? కరణ్ థపార్ జరిపిన ఇంటర్వ్యూలో అరుంధతీ రాయ్ వివరించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
కరణ్: ముస్లింలతో, దళితులతో మనం వ్యవహరించిన తీరు గురించి మీరు రాశారు. “గత ఐదు సంవత్సరాలుగా భారతదేశం తనను తాను తన్నుకునే జాతిగా ఎదిగింది. పట్టపగలు, బహిరంగంగా దళితులను, ముస్లింలను కొడుతున్న దృశ్యాల వీడియోలను యూ ట్యూబ్‌లో ఆనందంగా అప్‌లోడ్ చేశారు.” మనమేమైనా క్రూరమైన దేశంగా తయారవుతున్నామా? మన ప్రభుత్వం వల్ల ఇలా క్రూరంగా తయారవుతున్నామా?
అరుంధతి: మన దేశం ఎప్పుడో క్రూరంగా తయారైంది. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ప్రజలకు వ్యతిరేకంగా సైన్యాన్ని దింపకుండా ఒక్క రోజు కూడా లేదు; అది ఈశాన్యం కావచ్చు, కశ్మీరు కావచ్చు, హైదరాబాదు కావచ్చు. కులం అనేది మన దేశంలో క్రూరంగా అమలు జరుగుతోంది. సామాజికంగా, లైంగికంగా, మానసికంగా చేసే హింస, దాని ప్రదర్శన క్రమానుగతంగా క్రూరంగా జరుగుతోంది. హత్రాస్‌లో, ఖైర్లాంజి వంటి సంఘటనలు రోజు తరువాత రోజు చూడవచ్చు. ఇది సామాజిక హింస. అది జరిగినప్పుడు రాజకీయ పార్టీలు ఓట్ల కోసం దళితులను బుజ్జగిస్తాయి. అదే ముస్లింలపైనో, క్రిస్టియన్లపైనో హింస, అత్యాచారాలు, ఊచకోత, కొట్టడం, చంపడం వంటి సంఘటనల్లో మీరు పాలుపంచుకుంటే బిజెపిలో చేరడానికి మీకు మంచి అవకాశం వస్తుంది. మీకు పూలదండలేస్తారు. మిమ్మల్ని మంత్రిని చేస్తారు. ఏదో ఒకరోజు హోంమంత్రి నుంచి ప్రధాని కూడా కావచ్చేమో! అమిత్‌షా ఖైరానాంద్ వెళ్ళి “మొగలులతో వందేళ్ళుగా యుద్ధం చేస్తున్నాం” అన్నారు. మొఘల్‌ను ముస్లింకు ప్రత్యామ్నాయ పదంగా వాడారు. ముస్లిం చిత్రాన్ని విదేశీ జాతికి వారసులుగా, క్రిస్టియన్లను పశ్చిమ దేశాలకు వారసులుగా చూపుతున్నారు. కులం పీడన నుంచి బైటపడడానికి లక్షలాది మంది భారతీయులు ముస్లింలుగా, క్రిస్టియన్లుగా, సిక్కులుగా మారారు. వీరంతా హిందూ కుల వ్యవస్థ బాధితులు.
కరణ్: మీరు రాసిన ‘ఆజాది’ పుస్తకానికి రాసిన ముందు మాటలో మీ మాటలను ఉటంకిస్తున్నాను.“ముఖంలోనే ఫాసిస్టు మౌలిక స్వభావం కనిపిస్తున్నప్పటికీ, ఆ పేరుతో పిలవడానికి మనం వెనకాడుతున్నాం” మన చుట్టూ ఉన్న ఫాసిజం లక్షణాలను మీరు ఏం గమనించారు?
అరుంధతి: భారత దేశాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా సహజంగా ఫాసిస్టు లక్షణాలు ఎలా ఉంటాయో రాశాను. ప్రస్తుతమున్న సామాజిక సోపానక్రమంలో ఒక సంక్షోభాన్ని చూడవచ్చు. మండల్ కమిషన్ నివేదిక రాబోతోందనగానే ఒబిసి రిజర్వేషన్ వస్తోందని భయపడ్డాం. మండల్ వ్యతిరేక నిరసనల మధ్య కొత్త కుల పార్టీలు పుట్టుకొచ్చాయి. ‘చాలా కాలంగా వస్తున్న పౌరాణిక భావనలు, గతించిన జాతీయత, అతి స్వచ్ఛత అన్న ఊహ, జాతి ఆధిక్యత, జాతీయ తేజాన్ని పునరుద్ధరించడం’ వీటిని గుర్తించడం? బ్రాహ్మణులు నేలపైన వెలిసిన దేవతారూపాలు అన్న భావనను బలవంతంగా మోయడం. ‘జాతీయపాలక వర్గాల మద్దతుతో ఒక ఉద్యమాన్ని తీసుకురావడం’, బాబ్రీ మసీదు విధ్వంసానికి అద్వానీ రథయాత్ర. భారతీయ మార్కెట్లు బార్లా తెరుచుకుని ప్రైవేటీకరణ జరగడం. ఇది వ్యాపారం మొత్తాన్ని దెబ్బతీయడం, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యమైన సమస్య అయ్యిం ది. ఏకపార్టీ వ్యవస్థ ఆధిపత్యం ఏర్పడడం, బైట నుంచి, అంతర్గతంగా జాతి భద్రతకు ముప్పుపొంచి ఉందని సృష్టించడం, అప్పుడప్పుడు వర్ణం, జాతి, మతంపేరుతో ముప్పుఉందని ప్రచారం చేయడం, శ్రామిక వర్గంపైన సర్వాధికారులున్న ప్రభుత్వం దాడులు చేయడం, పెట్టుబడిదారీ విధానానికి వచ్చే సవాళ్ళను కింది స్థాయిలోనే అణచివేయడం, ప్రజాస్వామిక, స్వయంప్రతిపత్తి వ్యక్తికరణను లాగేసుకోవడం. ‘వీధి పోరాట యోధులను, మిలిటెంట్లను భయపెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం, కొన్నిసార్లు ప్రతిపక్ష శక్తులను హత్యచేయడం’ ఆర్‌ఎస్‌ఎస్ మిలీషియా, భజరంగ్‌దళ్, విశ్వహిందూపరిషత్‌లను చదవండి.‘పురుషాధిక్యపు వాక్చాతుర్యాన్ని సాయుధీకరించడం, అమెరికా, యూరప్ విషయంలో స్త్రీ వాదానికి వ్యతిరేకంగా, కులతత్వం, వర్ణవివక్ష, విదేశీయుల పట్ల విద్వేషాన్ని పెంచడం. మతిస్థిమితం తప్పి, పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం.
కరణ్: నరేంద్ర మోడీ అంతర్గతంగా ఫాసిస్టా?
అరుంధతి: అవును. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతం బహిరంగమే. ముస్సోలినీని, హిట్లర్‌ను కీర్తించిన విషయం అందరికీ తెలిసిందే. జర్మనీలో యూదులతో ముస్లింలను పోల్చారు.భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనే వారి ఆలోచన మనందరికీ తెలిసిందే.వారి ప్రయోగాలు మనకు తెలుసు. వాళ్ళు పట్టుకోల్పోతున్నారు. వాళ్ళు విజయం సాధిస్తారని నేననుకోవడంలేదు.దాన్నొక విఫల ప్రయోగంగా, ప్రజలు వెళ్ళే మార్గంలో మనం కూడా ప్రయాణం చేయాలి.
కరణ్: ఫాసిస్టు రాజ్యం వచ్చే ప్రమాదంలో ఉన్నామా?
అరుంధతి: ‘హిందూత్వ’ వాదాన్ని ఇప్పటికీ వాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో ప్రమాదమైతే ఉంది. ఎన్నికల్లో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ఎన్నికల్లో బిజెపి కనుక ఓడిపోయినట్టయితే, ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్టే. అది మతప్రాతిపదికన హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ వారి ప్రభుత్వమే కనుక వస్తే ఆ హింసను అదుపు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తే రెండేళ్ళ తరువాత 2024లో జరిగే ఎన్నికలను చూడండి.ఈ రెండేళ్ళలో దాని బాధ్యత ప్రభుత్వంలో ఏమీ ఉండదు. ఉన్మాదాన్ని సృష్టిస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
కరణ్: ఫాసిజానికి దారితీసే సిద్ధాంతం ఇప్పటికే భారతదేశంలో ఉందని మీరు అంటున్నారు. మనం వేగంగా స్పందించకపోతే జర్మనీలో జరిగిన దారుణమైన నేరాలే భారతదేశంలో కూడా నిర్దాక్షిణ్యంగా జరగవా?
అరుంధతి: ఆ నేరాలే మరొక రూపంలో మొదలయ్యాయి. జర్మనీలోలా కాకుండా ‘నోట్లరద్దు’, ముస్లింలను ‘పరాయి’ వారిగా చూడడం. కరోనా లాక్‌డౌన్ సమయంలో తబ్లగి జమాత్‌వారు వైరస్‌ను వ్యాపింపచేస్తున్నారని ఒకరకమైన మారణహోమం భాషను వాడడం చూసే ఉంటారు. యూదులు విషజ్వరాలను వ్యాప్తి చేస్తున్నారని నాజీలు కూడా ఇలాగే ఆరోపించారు. 1935లో వచ్చిన జాత్యాహంకార న్యురెంబెర్గ్ చట్టాల వంటివే జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్‌ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ). ప్రభుత్వం అంగీకరించిన పత్రాలను పౌరులు సమర్పించాకే వారి పౌరసత్వం మంజూరవుతోంది. యూరప్‌లో జరిగినట్టు భారత దేశంలో చంపడం, ఊచకోత కోయడం జరగకపోవచ్చు.
కరణ్: మీకెలా తెలుసు? మీరు ఊహించినట్టే జరుగుతుందా?
అరుంధతి: ఇక్కడ ప్రయాణం చేస్తూ, కళ్ళు, చెవులు తెరుచున్న ప్రజలతో మాట్లాడుతూ, ఈ దేశంలో నివసించే ఒక వ్యక్తిగా నేనలా భావిస్తున్నాను. కాషాయ పవనాలు బలంగా వీచిన గడిచిన ఎన్నిక సమయంలో ఉత్తరప్రదేశ్‌లాంటి రాష్ర్టంలోని పట్టణాలలో, గ్రామాలలోకెళ్ళి ప్రజలు ఏం అనుకుంటున్నారో మీరు వింటే తెలుస్తుంది.
కరణ్: భారత ప్రజలు మతవాదులు కాదని, వారు సోదరులపైకి తిరగబడరని, ముస్లింలు, క్రైస్తవులు సోదరులని, ప్రభుత్వం కానీ, ఆర్‌ఎస్‌ఎస్ కానీ వారిని మతవాదులుగా మార్చితే; దీనిని ఫాసిస్టు రాజ్యంగా మార్చాలని చూస్తే, భారత ప్రజలు ప్రతిఘటించరా?
అరుంధతి: దాన్ని కోరుకునే వారు ఎప్పుడూ ఉంటారు. యూరప్‌లో మాదిరిగా ‘మేహం’ వంటి మారణకాండను ఇక్కడ సృష్టించగలరని నేననుకోవడం లేదు. మనకు బలమైన ప్రతిపక్షం లేదు. ప్రజలు ఏదో ఒక మేరకు అర్థం చేసుకుంటున్నారు.
కరణ్: తప్పుడు వార్తలు, తప్పుడు చరిత్ర అనేవి ఫ్యాసిజం ఏర్పడడానికి, పెరగడానికి దోహదం చేస్తాయా?
అరుంధతి: ఫాసిజం గురించి ప్రజలకు తెలుసు. కానీ, నేటి చరిత్ర తాజా విషయాలను కోరుతుంది. పురాణాలే చరిత్రగా రూపాంతరం చెందుతున్నాయి. చరిత్ర పురాణాలుగా మారుతోంది. వాట్సప్ విశ్వవిద్యాలయం, టివి సీరియళ్ళు, సినిమాల ద్వారా అది వ్యాప్తి చెందుతోంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, చరిత్రలోని మరొక అసంబద్ధత. సమస్యల కథనాన్ని కప్పిపెడుతోంది. అత్యాధునికమైన ఆ కథనాలు భారతదేశ చరిత్ర గురించి చెపుతాయి. ఆ చరిత్ర మహిళల కథలను, వేరే జెండర్ కథలను, లైంగిక కథలను, కులం కథలను, అంబేద్కర్, ఫూలే, సావిత్రిబాయిఫూలే, బిర్సాముండా, అయ్యంకలి కథలను చెపుతాయి. ప్రస్తుత సంఘటనలుగా చరిత్ర కథలో మన సమాజాన్ని నడుపుతున్న చోదకశక్తి కులం.ఈ రోజు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నాయి.సూక్ష్మమైన కుల ఓటు బ్యాంకుపైన ప్రతి ఒక్కరూ కులపండితులే.లేకపోతే దాని గురించి మాట్లాడం. హిందూ త్వ నకిలీ వార్తల గురించి కాదు. ఉదాహరణకు దళితుల గురించి మాట్లాడే సమాజం ఉంది. వాళ్ళే పారిశుద్ధ్య పనులు చేస్తుంటారు, మ్యాన్ హోల్స్‌లో పడి చనిపోతుంటారు.
కరణ్: జనొతన్ షెల్ స్మారక ఉపన్యాసాలలో మీరు కశ్మీరి ప్రజల గురించి రాసిన దానినే నేను ఉటంకిస్తున్నాను. “భారతదేశంలో వారెందుకు భాగస్వాములు కావాలి? వారు కోరుకునేది స్వేచ్ఛే అయినట్టయితే, వాళ్ళు పొందవలసింది స్వేచ్ఛే” దాని గురించి వివరిస్తారా?
అరుంధతి: కశ్మీర్ అనేది సమాధులతో నిండిఉన్న లోయ. నరేంద్ర మోడీ కంటే ముందు నుంచే అవి మొదలయ్యాయి. రాజ్యాంగంలోని 370 అధికరణాన్ని రద్దుచేయడంతో పరిస్థితి తీవ్రమైంది. సామూహిక అదృశ్యాలు, ఉరితీతలు, ప్రజలకళ్ళ ముందు కనిపిస్తున్న భయాందోళనలే కశ్మీర్ కథ. వీటన్నిటినీ మిగతా దేశ ప్రజలకు తెలియకుండా చేశారు. కశ్మీరీ కథను మతోన్మాద జాతీయ మీడియా ద్వారా మధ్యవర్తీకరించారు. నిజానికి అక్కడేం జరుగుతోందో చాలా మంది భారతీయులకు తెలిసినట్టయితే, వారు మరొక రకంగా ఆలోచించేవారు. కనుకనే, వార్తలేమీలేని లోయగా కశ్మీరు కనిపిస్తోంది. అందుకునే కశ్మీరి జర్నలిస్టులు మౌనంగా ఉండిపోయారు, అరెస్టవుతున్నారు, బెదిరింపులకు లోనవుతున్నారు. ఇప్పుడు మీరు భారత్‌కు అనుకూలంగా ఉండడం కాదు, బిజెపికి అనుకూలంగా ఉండాలి. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, వేలాదిమంది జైళ్ళలో మగ్గుతున్నారు. ఇంటర్‌నెట్ కనెక్షన్ తొలగించారు, ఫోన్లు పనిచేయవు, లోయనంతా ముళ్ళకంచెతో చుట్టేశారు. ఆ విశాలమైన జైలు నుంచి ఇక్కడి ముస్లింలతో భారత్ ఎలా వ్యవహరిస్తోందో చూస్తున్నారు.

                                                                                      రాఘవశర్మ, 9493226180

UP Elections 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News