Home జాతీయ వార్తలు వలసకూలీల కోసం వెయ్యి బస్సులు

వలసకూలీల కోసం వెయ్యి బస్సులు

migrant workers

 

స్వస్థలాలకు వెళ్లేందుకు ఢిల్లీలో ఏర్పాట్లు

లక్నో : చిక్కుపడ్డ వలసకార్మికుల తరలింపు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేయి బస్సులను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో కూలీలు, వలసకార్మికులు ఉపాధి కోల్పొయ్యారు. దీనితో వారు తమ ప్రాంతాలకు కాలినడకన బయలుదేరుతున్నారు. దీనితో రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఆంక్షలతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించి కూలీల తరలింపు కోసం బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికార ప్రతినిధి ఒకరు శనివారం తెలిపారు. నోయిడా, గజియాబాద్, బులంద్‌షహర్, అలీగఢ్ వంటి పలు ప్రాంతాలలో కూలీలు ఎటువెళ్లలేని స్థితిలో రోడ్డున పడ్డారు.

వీరి పరిస్థితి గురించి ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఉన్నతస్థాయిలో సమీక్షించి బస్సుల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. దీనితో శనివారం రాత్రి నుంచే ఈ వేయి బస్సులకు అవసరం అయిన డ్రైవర్లు, కండక్టర్లకు సమాచారం పంపించారు. శనివారం ఉదయం లక్నోలోని ఛార్‌బాగ్ బసు స్టేషన్‌కు సీనియర్ పోలీసు అధికారులు తరలివచ్చారు. ఇక్కడి నుంచి కూలీల బస్సు ప్రయాణానికి తగు విధంగా ఏర్పాట్లు చేశారు. వారికి ఆహారం, మంచినీరు అందేలా చేశారు. లక్నో నుంచి బయలుదేరిన బస్సులు కాన్పూర్, బలియా, వారణాసి, గోరఖ్‌పూర్; ఫైజాబాద్ ఇతర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. అక్కడున్న వారిని తీసుకుని వారివారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు జరిగాయి.

హైవేల వెంబడి కూలీలకు నీరు, ఆహారం
లాక్‌డౌన్‌తో తరలివెళ్లుతున్న వేలాది మంది వలసకూలీల విషయంపై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. అనివార్యంగా వెళ్లుతున్న కూలీలకు జాతీయ రహదారి వెంబడి ఆహారం, నీరు అందించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) ఛైర్మన్, టోల్‌గేట్ల నిర్వాహకులకు మంత్రి తరఫున ఈ మేరకు ఆదేశాలు అందాయి. స్వస్థలాలకు వెళ్లే వారికి అన్ని విధాలుగా సాయం చేయాల్సిన బాధ్యత ఉందని మంత్రి స్పష్టం చేశారు.

వలస కార్మికులకు ప్రభుత్వం అండ : అమిత్‌షా
న్యూఢిల్లీ : కరోనా అల్లకల్లోలంలో దేశ వ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌లో వలస కార్మికులకు ప్రభుత్వం అం దగా ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తక్షణం వల స కార్మికులకు, యాత్రికులకు, ఎవరైతే స్వరాష్ట్రాలకు వస్తారో వారికి పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కరోనాను నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని వలస కార్మికుల పునరావాసానికి వెచ్చించ వచ్చని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

విపత్తు నిధులతో కూలీలకు సాయం
రూ 29 వేల కోట్లు రాష్ట్రాలు వాడుకోవచ్చు

విపత్తు నిర్వహణ సహాయ నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్) నిధులను కేంద్రం వలస కూలీలకు మళ్లిస్తుంది. ఈ నిధుల పరిధిలో మొత్తం రూ 29,000 కోట్లు ఉంటాయి. వీటిని రాష్ట్రాలు కూలీలకు తక్షణ సాయం కోసం వాడుకోవచ్చునని కేంద్రం తెలిపింది. 21 రోజుల కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న కార్మికులు, వలసకూలీలకు ఆహారం, తాత్కాలిక నివాసం కల్పిస్తారు. ఈ నిధుల డబ్బులను ఇందుకోసం వినియోగిస్తారు. ఈ మేరకు విపత్తు నిర్వహణ నిధి నియమనిబంధనలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం మార్చివేసింది.

ప్రకృతి వైపరీత్యాలు సమయంలో రాష్ట్రాలకు తక్షణ సాయం కింద ఈ నిధుల పరిధిలో సాయం అందుతోంది. ప్రస్తుత కరోనా తరుణంలో ఈ డబ్బులను పేదల కోసం వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వర్తమానం పంపించారు. కరోనా వైరస్‌ను పారదోలేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటుందని ప్రధాని మోడీ ఇటీవలే జాతినుద్ధేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు. వలసకూలీలు, పేదలకు ఆహారం, వైద్య చికిత్స, దుస్తుల పంపిణీ వంటివి జరుగుతాయని ప్రధాని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఇప్పుడు విపత్తు నిధులను సహాయక చర్యలకు కేటాయిస్తున్నారు.

UP govt arranges 1,000 buses to migrant workers