Home ఎడిటోరియల్ ప్రతిపక్షాలకు యుపి పరీక్ష

ప్రతిపక్షాలకు యుపి పరీక్ష

edit

ఉమ్మడి ఫ్రంట్‌గా ఏర్పడాలని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు వచ్చే ఏప్రిల్‌లో ఉత్తప్రదేశ్‌లో పరీక్ష ఎదురుకానుంది. అప్పుడు ఆ రాష్ట్రంలో పది రాజ్యసభ సీట్లకు ఎన్నిక లు జరుగుతాయి. ఇప్పటినుంచి 2 నెలల కాలంలో ఆ సీట్లు ఖాళీ అవుతాయి. అయినప్పటికీ రాజకీయ వర్గాలలో ఈ సరికే ఎన్నికల హడావిడి ఊపందుకుంది. బహుజన సమాజ్‌పార్టీ, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ తమ విభేదాలను మరిచి ఈ ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థులను నిలబెడతాయా అన్నది రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా ఉంది. రాజ్యసభలో ఉత్తరప్రదేశ్‌నుండి గల 31మంది సభ్యులలో 9మంది సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ 2న ముగియనుంది. అంతేకాకుండా గత జులైలో బహుజన సమాజ్‌వాది పార్టీ నేత మాయావతి తన రాజ్యసభ సీటుకు రాజీనామా చేశారు. ఫలితంగా రాష్ట్రంనుంచి ఎగువసభకు పది ఖాళీలకు ఎన్నికలు జరుగుతాయి. రిటైర్ అవుతున్న రాజ్యసభ సభ్యులలో సమాజ్ వాది పార్టీ సభ్యులు నరేష్ అగర్వాల్, జయా బచ్చన్, కిరణ్‌మై నందా, అలోక్ తివారీ, మునోవర్ సలీం, దర్శన్‌సింగ్ యాదవ్ కూడా ఉన్నారు. అలాగే బిజెపి సభ్యుడు వినయ్ కతియార్, బిఎస్‌పికి చెందిన ఎం.అలీ, కాంగ్రెస్ కు చెందిన ప్రమోద్ తివారీ కూడా రిటైరవుతున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ లో మొత్తం 312 సీట్లతో బిజెపి ఎనిమిది సీట్లను రాజ్యసభకు సులభంగా గెలిపెంచుకోగలిగే పరిస్థితిలో ఉంది. ఇంతవరకు ఎగువసభలో చెప్పుకోదగ్గ సీట్లుగల సమాజ్‌వాది పార్టీకి అసెంబ్లీలో బలం 47కు తగ్గిపోవడంతో ఒకే ఒక్కరిని రాజ్యసభకు గెలిపించుకోగలదు. పదవ సీటుకు ఉమ్మడి అభ్యర్థికి మిగులు ఓట్లను సమీకరించుకోగలిగితే ప్రతిపక్షం గెలుస్తుంది.
ఎన్నికలకోసం ఐక్యఫ్రంట్ ఏర్పాటు అంశాన్ని అప్పుడే చర్చించ
లేమని మూడు ప్రధాన ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. తమ అభ్యర్థిని బలపరచటానికి బిఎస్‌పి అంగీకరిస్తే తమ పార్టీ చాలా సంతోషిస్తుందని సమాజ్‌వాది పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ అన్నారు. ఈ అంశంలో పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఇంకా ఒక నిర్ణయానికి రావలసి ఉందని బిఎస్‌పి నాయకుడు సతీష్ శర్మ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో తనది స్వల్ప పాత్ర మాత్రమే అని, అందుకే చొరవ తీసుకోవలసినది ఇతర పార్టీలేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలలో ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థులను నిలబెడితే గోరఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌సభ సీట్లకు జరగనున్న ఉప ఎన్నికలపై ప్రభావం బలంగా ఉండడమే కాక 2019 సార్వత్రిక ఎన్నికలప్పుడు నిర్ణయాత్మక పోరాటానికి బాటపడుతుందని కూడా కీలక ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తమ లోక్‌సభ సీట్లకు రాజీనామా చేసి గత ఏడాది కొత్త పదవులు చేపట్టడంతో ఆ ఎన్నికలు అవసరపడుతున్నాయి. .
యునైటెడ్ ప్రోగ్రెసివ్ ఎలియన్స్ (యుపిఎ) ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ 17 ప్రతిపక్షాల సమావేశానికి గత ఏడాది అధ్యక్షత వహించారు. తరువాత ప్రతిపక్షాల ఐక్యత నినాదం ఇటీవల కాలంలో జోరందుకుంది. పార్లమెంటు లోపల వెలుపల జాతీయ ప్రాధాన్యత గల అంశాలపట్ల ఐక్యవైఖరిని అవలంబించాలని సోనియా ఆ సమావేశంలో నొక్కి చెప్పారు. తరువాత ప్రతిపక్ష ఐక్యత చర్చలు ఊపందుకున్నాయి. ఏది ఏమైనా ఆ సమావేశంలో బిఎస్‌పి గైర్హాజరవడంతో ఈ ఐక్యతా విన్యాసాలకు ఎదురయ్యే సవాళ్లపై ప్రశ్నలు తలెత్తాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఏడాదే వ్యవధి ఉంది. అందుచేత ప్రతిపక్షాలు ఇప్పటినుంచే పకడ్బందీగా అడుగులు వేయవలసి ఉంది. అప్పుడే బిజెపికి గట్టి పోటీ ఐక్యప్రతిపక్షం ఇవ్వగలుగుతుంది. ఎన్నికల రీత్యా ప్రాధాన్యంగల ఉత్తరప్రదేశ్ చుట్టూ ప్రతిపాదిత ప్రతిపక్షాల ఉమ్మడి ఫ్రంట్ ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉంటాయి.
బిజెపి 2014లో ఆ రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ సీట్లలో 72 సొంతం చేసుకుంది. అలాగే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో కూడా తిరుగులేని విజయం సాధించింది. ప్రతిపక్షాలు ఆ రాష్ట్రంలో ఐక్యపోరాటం ఇస్తేనే బిజెపిని ఎదురొడ్డగలవు. మాయావతిని కూడా కలుపుకుపోతేనే సమర్ధమైన ఐక్య పోటీని బిజెపికి ప్రతిపక్షాలు ఉత్తరప్రదేశ్‌లో ఇవ్వగలవు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో అధ్వాన్నంగా వచ్చిన బిఎస్‌పి రాజకీయ పండితులు పోటీనుంచి లేనట్లే భావిస్తున్నారు. ఐనప్పటికీ రాష్ట్ర రాజకీయాలలో మాయావతి ఇంకా కీలక పాత్ర పోషించగలరనే భావించాలి. ఎందుకంటే ఓటర్లలో ఆమెకు గల జాతవ్‌ల మద్దతు చెక్కుచెదరకుండా కొనసాగుతోంది. మాయావతి ప్రతిపక్షాల ఐక్యఫ్రంట్ లో కొనసాగితే దాదాపు 50సీట్లలో ఫ్రంట్‌కు బలం ఉండగలదని సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడొకరు వ్యాఖ్య చేశారు.
మాయావతితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఈ అంశంపై సంప్రదింపులు సాగిస్తున్నారని తృణమూల్ నాయకుడు చెప్పారు. మాయావతి డిమాండ్లపట్ల కాంగ్రెస్ కూడా పట్టువిడుపు ధోరణితో కొనసాగాలని ఆయన సూచించారు. ఉదాహరణకు గుజరాత్‌లో బిఎస్‌పికి జత సీట్లు కాంగ్రెస్ ఇచ్చి వుంటే ప్రతిపక్షాల ఐక్యతా నినాదానికి గట్టి బలం చేకూరేదని ఆయన పేర్కొన్నారు. భాగస్వామ్యాలు కుదుర్చుకోవడంపట్ల తాను చిత్తశుద్ధితో ఉన్నట్లు కాంగ్రెస్ చాటుకోవలసి ఉందని ఆయన సూచించారు. ప్రతిపక్షాల ఐక్యవేదిక భవిష్యత్‌లో ఏర్పడడం, ఏర్పడకపోవడం పూర్తిగా మాయావతి వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని తృణమూల్ నేత చెప్పారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడగానే సమాజ్‌వాది పార్టీ అధిపతి అఖిలేశ్ యాదవ్, బిఎస్‌పి నాయకురాలు మాయావతి తమ విభేదాలను పక్కనపెట్టి భవిష్యత్‌లో కలిసికట్టుగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించారు. అయితే అప్పట్లో యాదవ్ తమ పార్టీకి పొత్తులపై నమ్మకం లేదని ప్రకటించారు. దీనిపై మాయావతి మౌనం వహించారు. ఉత్తరప్రదేశ్‌లో గత డిసెంబర్‌లో జరిగిన స్థానిక ఎన్నికలలో తన పార్టీ విజయం సాధించాక మాయావతి పొత్తులపై మనసువిప్పి చెప్పకుండా మౌనం వహిస్తున్నారని బిఎస్‌పి నేతలు కొందరు తెలిపారు. క్షేత్రస్థాయిలో తమ విజయాలను పెంచుకోవడానికి మాయావతి, యాదవ్ ఇరువురూ ముందుగా ప్రయత్నిస్తారు. అలా చేయడంవల్ల వారు బేరసారాల విషయంలో పట్టుబట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సీట్ల పంపిణీ దశకు ప్రతిపక్ష ఐక్యవేదిక చర్చలు చేరుకున్నప్పుడు క్షేత్రస్థాయి విజయాలు వారికి బాగా అక్కరకు వస్తాయి. తమపై కొన్ని కోర్టు కేసులు ఉన్నందువల్ల ఇప్పటికిప్పుడు తమ ఉద్దేశాలను బయటపెట్టుకోవడం ప్రతిపక్షనాయకులకు ఇష్టంలేదు. ముఖ్యం గా బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను కటకటాల వెనుక నిలబెట్టిన ప్రస్తుత సమయంలో దూకుడుగా వ్యవహరించడానికి ప్రతిపక్ష నాయకులు భయపెడుతున్నారు. ప్రతిపక్ష శిబిరం చీలిపోయి ఉండేలా చూడాలని బిజెపి కోరుకుంటోంది. దానిలోనే
ఆ పార్టీకి నిజమైన ఊరట దాగిఉంది.

* అనితా కత్యాల్