Thursday, April 25, 2024

సివిల్స్‌లో నారీ మణిహారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : యుపిఎస్‌సి నిర్వహించిన సివిల్స్ 2022 తుది ఫలితాల్లో నారీశక్తి విజయకేతనం ఎగురవేసింది. 933 మంది ఈ పరీక్షలలో క్వాలిఫై కాగా వీరిలో యువతులకే వరుసగా నాలుగు టాప్ ర్యాంకుల్లో మహిళలే నిలిచారు. ఢిల్లీ యూనివర్శిటీ గ్రాడ్యుయెట్ ఇషితా కిశోర్ టాపర్‌గా తొలిస్థానం దక్కించుకున్నారు. మంగళవారం యుపిఎస్‌సి ఈ ఫలితాలను వెలువరించింది. వరుసగా రెండో స్థానంలో గరిమా లోహియా, మూడో స్థానంలో ఉమా హారతి ఎన్, నాలుగవ ర్యాంకులో స్మృతీ మిశ్రా నిలిచారు. వీరిలో లోహియా, మిశ్రాలు ఢిల్లీ వర్శిటీ పట్టభద్రులు. కాగా హారతి ఐఐటి హైదరాబాద్ బిటెక్ డిగ్రీ హోల్డర్. ఈ అత్యంత కీలకమైన సివిల్స్ పరీక్షలలో యువతులు వరుసగా అగ్రస్థానంలో రాణించడం ఇది రెండోసారి. 2021 సివిల్స్‌లో శృతి శర్మ, అంకిత అగర్వాల్, గామిని సింగ్లాలు మూడు ర్యాంకులు తెచ్చుకున్నారు.

ఇప్పుడు సివిల్స్‌లో క్వాలిఫై అయిన వారిలో 613 మంది పురుషులు, 320 మంది స్త్రీలు ఉన్నారని పబ్లిక్ సర్వీసు కమిషన్ తెలిపింది. ఇక టాప్ 25లో 14 మంది మహిళలు, 11 మంది మగవారు ఉన్నారు. దేశంలో ప్రధానమైన పరిపాలనా విభాగాలలో అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు అర్హమైన ఐఎఎస్, ఇపిఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత అధికారులను ఎంపిక చేసేందుకు యుపిఎస్‌సి మూడు దశల పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్, మొయిన్ తరువాతి ఇంటర్వూల ద్వారా అభ్యర్థుల వడబోత జరుగుతుంది. యుపిఎస్‌సి పరీక్షలు ప్రతిభావంతులైన యువతకు ఛాలెంజ్‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో అమ్మాయిలు రాణిస్తూ ఉండటం విశేష అంశం అయింది. ఇప్పుడు టాపర్‌గా నిలిచిన ఇషితా కిశోర్ మిలిటరీ కుటుంబం నుంచి వచ్చారు. తన మూడో ప్రయత్నంలో భాగంగా ఈ శిఖరం చేరారు.

తొలి రెండు ప్రయత్నాలలో ఆమె కనీసం క్వాలిఫై కూడా కాలేదు. అయితే ఏ విధంగా కూడా నిరాశ నిస్పృహలను దరిచేరనివ్వకుండా మూడో ప్రయత్నంలో టాపర్‌గా నిలిచారు. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రధాన సబ్జెక్టుగా తీసుకున్న ఆమె ఢిల్లీ వర్శిటీకి చెందిన శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎకనామిక్ హానర్స్ చేశారు. లోహియా కిరోరిమల్‌కాలేజీలో కామర్స్ పట్టభద్రురాలు. ఆమె రెండో ర్యాంక్ తెచ్చుకున్నారు. హారతి ఐఐటి హైదరాబాద్ నుంచి బిటెక్ చేశారు. మూడో ర్యాంకు సాధించిన ఈ యువతి ఆంథ్రాపాలాజీని ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. ఇక ఢిల్లీ వర్శిటీకే చెందిన మిశ్రా మిరందా కాలేజీ నుంచి బిఎస్‌సి గ్రాడ్యుయెట్ . జువాలజీని ఆప్షనల్‌గా ఎంచుకుని సివిల్స్ రాశారు. ఈసారి అర్హత సాధించిన వారిలో 345 మంది జనరల్ కేటగిరి వారు.

99 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గం (ఇడబ్లుఎస్), 263 మంది ఒబిసిలు , 154 మంది ఎస్‌సి, 72 మంది ఎస్‌టిలు . సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అర్హతల ప్రాతిపదికన సివిల్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుంది. ఇప్పటికే 1022 వెకెన్సీలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. 180 మంది ఐఎఎస్ , 38 ఐఎఫ్‌ఎస్, 200 ఐపిఎస్ భర్తీలు జరగాల్సి ఉంది. కాగా గ్రూప్ ఎ సెంట్రల్ సర్వీసెస్‌లో 473 , గ్రూప్ బి సర్వీసెస్‌లో 131 పోస్టులకు ఖాళీలు ఉన్నాయని యుపిఎస్‌సి తెలిపింది. యుపిఎస్‌సి పరీక్షలు రాసిన వారు వివరాలను క్యాంపస్‌ల్లోని పరీక్షా కేంద్రాల వద్ద ఉండే సహాయక కేంద్రాల నుంచి తెలుసుకోవచ్చు.

లేదా సంబంధిత ఫోన్ల నుంచి సమాచారం తీసుకోవచ్చు. 2022 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు గత ఏడాది జూన్ 5న జరిగాయి. దీనికి మొత్తం 11,35,697 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వీరిలో 5,73,735 మంది నిజానికి పరీక్షలు రాశారు. తరువాత సెప్టెంబర్‌లో జరిగిన మొయిన్స్‌కు అర్హులైన 13090 మంది హాజరయ్యారు.
కలనిజమాయో ..కష్టం ఫలించే
టాపర్ ఇషితా కిశోర్ ఆనందం
సివిల్స్‌లో టాపర్ అయిన ఇషితా కిశోర్ ఢిల్లీ వర్శిటీ విద్యార్థి. తండ్రి భారతీయ వాయుసేన అధికారి. ఇప్పుడు తనకు సివిల్స్ టాప్ ర్యాంకు రావడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందని ఇషితా తెలిపారు. ఫలించిన ఈ కలతో తనకు మరింత ఆత్మవిశ్వాసం నెలకొందని తెలిపిన ఇషిత తాను ఐఎఎస్‌ను అయిన తరువాత మహిళా సాధికారతకు పాటుపడుతానని తెలిపారు. వారిలో ఆత్మస్థయిర్యం పెంచేలా చేయడం తన కర్తవ్యం అన్నారు. ప్రధమ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. తన కుటుంబం తనకు సర్వదా వెన్నంటి ప్రోత్సహించిందని, విఫలాల దిశలో వెన్నుతట్టి నిలిచిందని, ముందుకు సాగిపోవాల్సి ఉంటుందని పేర్కొందని, దీనివల్ల తాను ఈ విజయం సాధించానని తెలిపారు.

రెండుసార్లు పరీక్షలలో విఫలం అయ్యానని అయితే ఈసారి తాను విజయం సాధించానని చెప్పిన ఇషితా ఇంట్లో చిన్న. సోదరుడు లాయర్‌గా ఉన్నారు. తల్లి ప్రైవేటు స్కూల్ టీచరు. తన కష్టమే తన విజయానికి దారితీసిందని ఆమె తెలిపారు. తాను ఐఎఎస్‌ను ఎంచుకున్నానని తెలిపిన ఆమె ఉత్తరప్రదేశ్ కేడర్‌కు ప్రాధాన్యత ఇస్తానని వివరించారు. ఆమె జాతీయ స్థాయి ఫుట్ బాల్ క్రీడాకారిణి. సుబ్రతో కప్ టోర్నమెంట్‌లో 2012లో పాల్గొన్నానని వివరించారు. గ్రేటర్ నోయిడాలో నివసించే యువతి వరుసగా నాలుగు టాప్ ర్యాంకులు తనలాగానే మహిళలకు దక్కడం మరింత సంతోషం కల్గించిందని వివరించారు. తల్చుకుంటే అందుకు అనుగుణంగా కష్టపడితే కాదేదీ యువతికి అసాధ్యం అని ఈ పరీక్షా ఫలితాలు రుజువు చేశాయని ఇషితా చాటిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News