Friday, March 29, 2024

పాకిస్థాన్ నుంచి లండన్‌కు యురేనియం పార్శిల్?

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పాకిస్థాన్ నుంచి అత్యంత కీలకమైన యురేనియం బయటి దేశాలకు సరఫరా అవుతోందా? లండన్‌లోని హిత్రో అంతర్జాతీయ విమానాశ్రయానికి గత నెలలో యురేనియం మిళితం అయి ఉన్న ఓ కార్గో ప్యాక్ వచ్చిందని, ఇది పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి వచ్చిందని బ్రిటన్ పత్రికలు ప్రముఖంగా వార్తలు వెలువరించాయి. అయితే ఈ వార్తలను పాకిస్థాన్ గురువారం ఖండించింది. కరాచీ నుంచి యురేనియం పార్శిల్ వచ్చిందనే వార్తలలో నిజం లేదని అధికార వర్గాలు ఇస్లామాబాద్‌లో తెలిపాయి.

అయితే లండన్‌లో యురేనియంను తనిఖీ బృందాలు స్వాధీనం పర్చుకోవడం బ్రిటన్‌లో సంచలనం అయింది. సంబంధిత విషయంపై ఇప్పటికే ఉగ్రవాద నిరోధక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. పాకిస్థాన్ నుంచే ఈ యురేనియం స్క్రాప్‌లో మిళితం అయి ఉందని, కరాచీ నుంచి ఇది వచ్చిందని సన్ పత్రిక ప్రముఖ వార్త ప్రచురించింది. ఈ వార్తను ఖండించిన పాకిస్థాన్ అధికార యంత్రాంగం తమకు దీని గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదని తెలిపింది. సంబంధిత వార్త సరికాదని తాము విశ్వసిస్తున్నామని పాక్ విదేశాంగ ప్రతినిధి ముంతాజ్ జహ్రా పేర్కొన్నట్లు డాన్ పత్రిక తెలిపింది.

గత నెల 29వ తేదీన ఒమన్ ఎయిర్ పాసింజర్ విమానం డబ్లు వై 101 నుంచి వచ్చిన కార్గో ప్యాక్‌లో యురేనియం ఉన్నట్లు గుర్తించారని వెల్లడైంది. పాకిస్థాన్‌లో యురేనియం నిల్వలను నిక్షిప్తం చేసుకుని, అణ్వాయుధాల తయారీకి కొన్ని సంస్థలు అక్రమంగా రవాణా చేస్తున్నాయని, ఇందుకు పాక్ సైనిక మాజీ అధికారులు, కొందరు సైంటిస్టులు తమ వంతు పాత్రను పోషిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News