Home హైదరాబాద్ పట్టణ ప్రణాళిక లోపంతోనే… నగరాల్లో వరదలు

పట్టణ ప్రణాళిక లోపంతోనే… నగరాల్లో వరదలు

Urban planning disaster ... floods in cities

అర్బన్ ప్లడింగ్
సదస్సులో ఆర్థిక శాఖ
ముఖ్య కార్యదర్శి
రామకృష్ణరావు 

మన తెలంగాణ/సిటీబ్యూరో: సరైన పట్టణ ప్రణాళికలోపం, అప్రతిహాతంగా పెరుగుతున్న నగర జనాభా, నాలాలు, చెరువుల అక్రమణలు నగరాలలో తరచుగా ఏర్పడే ముంపు సమస్యకు ప్రధాన కారణమని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ప్రణాళిక సంస్థ ఆధ్వర్యంలో ‘అర్బన్ ప్లడింగ్’ అనే అంశంపై వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌కు జిహెచ్‌ఎంసి కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి, ముంబాయి ఐఐటి ప్రొఫెసర్ కపిల్‌గుప్త, భారత వాతావరణ శాఖ డైరక్టర్ డాక్టర్ వై.కె.రెడ్డిలు పాల్గొన్నారు. రామాకృష్ణరావు మాట్లాడుతూ కేవలం విపత్తుల సమయాల్లో మాత్రమే వాటి నివారణ చర్యలపై చర్చ జరుగుతుందని అన్నారు. అర్బన్ ప్లడింగ్‌తో పాటు అన్ని రకాల విపత్తులకు శ్వాశత పరిష్కార మార్గాలను చేపట్టాలని అన్నారు. ఈ ప్రక్రియలో భారీ మొత్తంలో నిధులను వెచ్చించాల్సి అవసరం ఉంటుందని, ప్రాధాన్యతల వారిగా ఈ పనులను చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

నాలాలపై 28వేల అక్రమణలు బల్దియా కమిషనర్ డాక్టర్ బి.జనార్ధన్‌రెడ్డి
జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నాలాల వెంట 28వేల అక్రమణలు ఉన్నాయని, వీటిని తొలగించాలంటే సామాజిక, ఆర్థిక శాంతి భద్రతలు తదితర కోణాల నుంచి చూడాల్సిన ఉంటుందని అన్నారు. అయితే నాలాలపై అత్యంత కీలకంగా ఉన్న 47 అవరోదాలను రూ.230 కోట్ల వ్యయంతో తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపిందని, దీనిలో భాగంగా పనులు ప్రారంభించామని అన్నారు. నగరంలో ప్రతిరోజు కనీసం ఒక కోటి ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారని, వీటిలో దాదాపు 70 శాతానికి పైగా ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు నాలాల్లో వేయడం ద్వారా వర్షపునీరు పారకుండా వరదలకు కారణమవుతున్నాయని అన్నారు. నగరంలో వరదనీటి కాల్వల నిర్మాణానికి రూ.12వేల కోట్ల అవసరమవుతాయని అంచనా వేశామని అన్నారు. 425 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో భవన నిర్మాణ వ్యర్థాలు సమస్యగా మారాయని, వీటిని తొలగించి, పునర్ వినియోగం చేసేందుకు సి అండ్ డి వెస్ట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. గతంలో చెరువుగా ఉన్న ఉన్న ఏనుగుల కుంట చెరువును వెంగళరావు పార్కుగా రూపొందించడంతో వర్షపు నీటి నిల్వకు అస్కారం లేకుండా ఉండి, పంజాగుట్ట మోడల్ హౌజ్ వద్ద చిన్న పాటి వర్షానికే జలమయం అవుతుందని గుర్తు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పుల ద్వారా భారీ వర్షాల ఆగమనాన్ని ముందుగానే తెలుసుకునే వీలవుతుందని, తద్వారా ముందు జాగ్రత్త చర్యలకు కూడా అవకాశం ఏర్పడుతుందన్నారు. నగరంలో నాలాల అక్రమణలను తొలగించి, విస్తరించడంలో భాగంగా చేపట్టిన చర్యల్లో తొలగించిన పేదల నివాసాలకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని, అక్రమ నిర్మాణాలకు నష్టపరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ఎస్.కె.మీరా, అభిలాష్, డాక్టర్ వై.కె.రెడ్డిలు పాల్గొన్నారు.