Wednesday, March 22, 2023

ఉర్సు ఉత్సవాలు షురూ

- Advertisement -

god

*గంధం యాత్రలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
* మూడు రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాలు
* 7న కళాకారుల కవ్వాలి
* ఊరేగింపులో నెలకొన్న ఉద్రిక్తత

మన తెలంగాణ / నల్లగొండ ప్రతినిధి : నల్లగొండ జిల్లా కేంద్రంలో లతీపుల్లాఖాద్రి గుట్టపై గురువారం ఉ ర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రజాప్రతినిధు లు, అధికారుల సమక్షంలో ముస్లిం మత పెద్దలు గం ధం ఊరేగింపు యాత్రను సాగించడంతో ఉర్సు వేడుకలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. మత సామరస్యానికి ప్రతీకగా హిందు, ముస్లిం ప్రజలు కలిసి జరుపుకునే ఉత్సవాల్లో నల్లగొండ దర్గా ఉత్సవం గొప్పది. అల్లాను ప్రార్థించేందుకు జిల్లా నుంచే కాక రాష్ట్ర నలు మూలల నుంచి ప్రజలు ఉర్సు ఉత్సవాలకు ముస్లింలు, మత ప్రవక్తలు పెద్ద ఎత్తున హాజరవుతారు. కోరిన కోరికలు నెరవేరతాయన్న నమ్మకంతో భక్తులు ఇక్కడికి వస్తారు. క్రీ.శ. 960 -నుంచి1050ల కాలంలో ఇస్లామ్ మత ప్రబోధకుడు సయ్యద్‌షా లతీఫ్‌ఖాద్రి దేవరకొండ ప్రాంతం నుంచి నల్లగొండకు చేరుకొని మత ప్రబోధన చేస్తూ గుట్టపైనే సమాధి అయ్యాడని ప్రచారంలో ఉంది. బాగ్దాద్ నుంచి వచ్చిన అతని కుమారులు షేక్ అల్లా వుద్దీన్, షేక్ ఫరీద్‌లు కూడా గుట్టపైనే సమాధి అయ్యారని వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ప్రజలు ఈ ఉర్సు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉర్సు ఉత్సవాల వల్ల సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖశాంతులతో, సిరి సంపదలతో జీవిస్తారని ప్రజల నమ్మకం.

ఉర్సు ఉత్సవాలను గంధం యాత్రతో ప్రారంభిస్తారు. స్థానిక మధినా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం సాయంత్రం 5.30గంటలకు ఉర్సు గంధం యాత్ర బయల్దేరి రాత్రి 8గంటలకు దర్గా మెట్ల దగ్గరకు చేరుకుంటుంది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ డి.వి శ్రీనివాసులు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాసగౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు అక్కడికి హాజరై ఉర్సు గంధానికి స్వాగతం పలికారు. అక్కడ నుంచి అధికారికంగా మూడు రోజుల పాటు ఉర్సు ఉత్సవాలు సాగుతాయి. 6న తాలుక్‌దారి మసీదులో మౌలానా మహ్మద్, మొయినుద్దీన్ ఖాద్రిలు ప్రవక్తపై ప్రసంగాలు చేస్తారు. 7న గుట్ట మెట్ల వద్ద కళాకారులతో కవ్వాలి  ఉర్సు
నిర్వహిస్తారు. దర్గా ఉత్సవాలు అధికారంగా మూడు రోజుల పాటు నిర్వహించిన అనధికారికంగా మరో 15 రోజుల పాటు కొనసాగుతోంది. ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉర్సు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. దర్గాను రంగు రంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. భక్తులకు బస, మంచినీటి సౌకర్యం, కల్పించారు. ప్రత్యేక నమాజ్ వసతి, మూత్రశాలల ఏర్పాట్లు చేశారు. గుట్ట కింది భాగంలో దుకాణాల సముదాయాలు వెలిశాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా వాహనల తనిఖీలను ముమ్మరం చేశారు. మఫ్టి పోలీసులను రంగంలోకి దించారు. సిసి, డ్రోన్ కెమెరాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముతావల్లి జాఫర్, సమీ ఉల్లాఖాద్రి, బషారత్‌ఖాద్రీ, మైనార్టీ నాయకులు అఫాన్‌అలీ, తాజుద్దీన్, ఇబ్రహిం తదితరులు పాల్గొన్నారు.
ఊరేగింపులో నెలకొన్న ఉద్రిక్తత
ఉర్సు ఊరేగింపులో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మదినా మసీదు నుంచి గంధం హండిను లతీపుల్లాఖాద్రి గుట్టపైకి తీసుకవెళ్లే సమయంలో కంచర్ల భూపాల్‌రెడ్డి కుడిచేయి లేకపోవడంతో ఎడమచేయితో పాత్రను ముట్టుకోవడంతో తప్పుగా భావించి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గంధం హండిను వదిలి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్, టిఆర్‌ఎస్ వర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఇరుపార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో పోలీసులు భారీగా మోహరించి కార్యకర్తలను దూరంగా తరిమివేశారు. అనంతరం గంధం రేగింపు యాత్ర సాగింది. ఇది రానున్న జిల్లా రాజకీయ వేడికి సంకేతమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News