Home అంతర్జాతీయ వార్తలు కష్టకాలంలో భారత్‌కు అమెరికా ఆపన్న హస్తం

కష్టకాలంలో భారత్‌కు అమెరికా ఆపన్న హస్తం

US aid to India in tackling Covid 19 second wave

సహజ మిత్ర దేశానికి బాసటగా అగ్ర రాజ్యం
పక్షం రోజుల్లోనే రూ.3500 కోట్ల సాయం
ఔదార్యం చాటుకున్న కార్పొరేట్ దిగ్గజాలు
ప్రతిరోజూ భారత్‌కు ప్రత్యేక విమానాల్లో
కోట్ల విలువైన వైద్య పరికరాలు, ఔషధాలు

వాషింగ్టన్: కొవిడ్19 సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌కు అమెరికా నుంచి అనూహ్య తోడ్పాడు అందుతోంది. భారత్‌ను తమ సహజ భాగస్వామిగా పేర్కొనే అమెరికా అగ్రనేతలు అది నిజమేనని ఇప్పుడు రుజువు చేసుకుంటున్నారు. ఆపదలో ఉన్న మిత్ర దేశాన్ని ఆదుకోవడంలో తమ హృదయాన్ని పరిచినట్టుగా స్పందిస్తున్నారు. ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫోన్ సంభాషణ అనంతరం ఆ దేశం నుంచి అందుతున్న ఇబ్బడిముబ్బడి సహాయమే అందుకు నిదర్శనం. పక్షం రోజులు గడవకముందే భారత్‌కు అమెరికా నుంచి అందిన సహాయం విలువ దాదాపు 50 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.3500 కోట్లు) చేరుకున్నది.

గత నెల చివరన మోడీతో మాట్లాడిన బైడెన్ భారత్ పట్ల తన సంఘీభావాన్ని చాటారు. కొవిడ్19ను ఎదుర్కోవడంలో అన్ని విధాలా భారత్‌కు సహకరిస్తామని, కలిసి పని చేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. మహమ్మారి ప్రారంభదశలో మన ఆస్పత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోతుండగా భారత్ తన స్నేహ హస్తాన్ని అందించిందంటూ బైడెన్ తన దేశ పౌరులకు గుర్తు చేశారు. ఇప్పుడు భారత్‌కు మనం సహాయం అందించాల్సిన సమయమంటూ పిలుపునిచ్చారు. దాంతో, అమెరికాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఊహించనిరీతిలో భారత్ పట్ల తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నాయి. ఇక అక్కడి భారత అమెరికన్లు తమ మాతృ దేశాన్ని ఆదుకునేందుకు మనస్ఫూర్తిగా ముందుకు వస్తున్నారు.

ఇప్పటి వరకు భారత్‌కు అందిన 50 కోట్ల డాలర్ల విలువైన సహాయంలో అమెరికా పాలనా యంత్రాంగం నుంచి 10 కోట్ల డాలర్లు( దాదాపు రూ.700 కోట్లు), ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించిన(అత్యవసర ఔషధాలను పంపిస్తామని చెప్పింది) 7 కోట్ల డాలర్లు( రూ.510 కోట్లు), ప్రభుత్వం తరఫున 17.55 కోట్ల డాలర్ల విలువైన 4,50,000 డోసుల రెమ్‌డెసివిర్ డోసులున్నాయి. విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తోపాటు మాస్టర్ కార్డు సంస్థ చెరో కోటి డాలర్ల చొప్పున సహాయం ప్రకటించాయి. గూగుల్ 1.8 కోట్ల డాలర్లు ప్రకటించింది. అమెరికాలోని దిగ్గజ సంస్థల గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ 3 కోట్ల డాలర్ల విలువైన అత్యవసర ఔషధాలు పంపిస్తామని తెలిపింది. అంతేగాక ప్రతిరోజూ భారత్‌కు అమెరికా నుంచి ప్రత్యేక విమానాల ద్వారా వేలాది ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లు, వైద్య పరికరాలు, ఔషధాలు అందుతున్నాయి.

భారత అమెరికన్ వినోద్‌ఖోస్లా తన వంతుగా కోటి డాలర్లు, కార్పొరేట్ సంస్థ అధినేత జాన్ టి చాంబర్స్ 10 లక్షల డాలర్లు ప్రకటించారు. సేవా ఇంటర్నేషనల్ కోటీ 50 లక్షల డాలర్లు, జైషెట్టీ 40 లక్షల డాలర్లు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ 67 లక్షల డాలర్లు, మెర్క్ 50లక్షల డాలర్లు, వాల్‌మార్ట్ 50 లక్షల డాలర్లు విరాళమిస్తామని ప్రకటించాయి. ఈ నెల చివరికల్లా భారత్‌కు అమెరికా నుంచి అందే సహాయం విలువ దాదాపు 100కోట్ల డాలర్లు (రూ.7000 కోట్లు)మేర ఉంటుందని యుఎస్ ఇండియా స్ట్రేటజీ అండ్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్‌కు చెందిన ముకేశ్ అఘీ అంచనా వేశారు. గతేడాది అమెరికాలో కొవిడ్19 తీవ్రరూపంలో విరుచుకుపడ్డవేళ భారత ప్రజల నుంచి మానవీయ స్పందన వ్యక్తమైంది.

అది అమెరికన్లతో అనుబంధాన్ని పెంచింది. అందుకు అక్కడి భారత అమెరికన్లు కూడా ఓ ఉత్ప్రేరకంగా పని చేశారు. ఒకరి కష్టాలకు ఒకరు బాసటగా నిలవడం ప్రభుత్వాల స్థాయి నుంచి రెండు దేశాల పౌరుల వరకు ఆత్మీయ బంధాన్ని పెనవేసిందని యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు నిషాదేశాయ్ బిస్వాల్ అన్నారు. భారత్‌కు అవసరమైన సాయమందించేందుకు అమెరికా అధికారులతో భారత అధికారులకు మధ్య సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేశారు. అమెరికాలోని మధ్యవర్తులు అక్కడి మన రాయబారి తారాంజిత్‌సింగ్‌సంధూతో మాట్లాడ్తూ ఇంకా మీ దేశానికి ఎలాంటి సహాయం కావాలో చెప్పండి చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం అన్నారంటే భారత్ పట్ల అక్కడి ప్రతి హృదయం ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోగలం.