Home ఎడిటోరియల్ బైడెన్ యుద్ధ వైరాగ్యం!

బైడెన్ యుద్ధ వైరాగ్యం!

US does not seek new cold war, says joe bidenపెద్ద పులి మాంసాహారం మానేసినట్టు అమెరికా యుద్ధ కాంక్షను విడిచిపెడుతుందట. ఇది ఎవరో చెప్పిన బోగట్టా కాదు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నోటి నుంచి వచ్చిన మాటే ఇది. మొన్న మంగళవారం నాడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య దేశాల సమావేశంలో మాట్లాడుతూ అమెరికా ఇక అనవసరమైన యుద్ధాల్లో పాల్గోబోదని బైడెన్ ప్రకటించారు. అంటే ఇంత కాలం అమెరికా చేసినవి అనవసరమైన యుద్ధాలేనని ఆయన అంగీకరించినట్టేనా? పెద్ద ఎత్తు మానవ విధ్వంసకరమైన ఆయుధాలున్నాయని చెప్పి, రసాయనిక అస్త్రాలను తయారు చేస్తున్నారనే నెపం చూపి సద్దాం హుస్సేన్ పాలనలోని ఇరాక్‌పై క్రూర మృగాల మూక మాదిరిగా అమెరికా, దాని దన్ను దేశాల గుంపు చేసిన యుద్ధం అవసరమైనదేనా? అక్కడ అటువంటి ఆయుధాలేమీ లేవని వాటి తయారీ యత్నాల జాడ కూడా లేదని తమ సంస్థలే నిగ్గు తేల్చినా వినకుండా సద్దాం హుస్సేన్‌ను సపరివారంగా బలి తీసుకునేంత వరకు సాగించిన ఆ యుద్ధం అమెరికాకు ఏ విధంగా అవసరమైందో బైడెన్ చెప్పాలి. అలాగే నిన్నటి వరకు రెండు పదుల సంవత్సరాల పాటు అఫ్ఘాన్‌లో సైన్యాన్ని మోహరించి ఏ టెర్రరిస్టులను అమెరికా అంతమొందించిందో వివరించాలి.

టెర్రరిజంపై యుద్ధం అనంతమైనదని, దానికి మూలంలో గల సామాజిక, ఆర్థిక చిక్కు ముడులను విప్పకుండా అది సమసిపోదనే ఎరుక రానంత వరకు ఎటువంటి ప్రయోజనం కలుగబోదని ప్రపంచాధినేతలు, దేశదేశాల పాలకులు తెలుసుకొనే సమయం రావాలని కోరుకోడం తప్ప ఎవరూ ఏమీ చేయగలిగేది ఉండదు. అఫ్ఘాన్ నుంచి అత్యంత అసమర్థ నిష్క్రమణకు నాయకత్వం వహించిన బైడెన్ శ్మశాన వైరాగ్యం వంటి యుద్ధ క్షేత్ర వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు ఆయన మాటలు ధ్వనిస్తుంటే ఆశ్చర్యపడవలసిన పని లేదు. ప్రపంచం ముందు నేడున్న సవాళ్లను బల ప్రయోగం ద్వారా, యుద్ధాలతో పరిష్కరించలేమని, విరామం లేని దౌత్య యత్నాల శకాన్ని ఆవిష్కరిస్తానని బైడెన్ అన్నారు. ఈ నూతన శకారంభంలో చైనాతో సామరస్యపూర్వక పరిష్కార మార్గం కూడా ఉంటుందా అని అమెరికా అధ్యక్షుని ప్రశ్నించాలి. ఈ ప్రశ్నకు ఆయన నుంచి అవునని సమాధానం రాబట్టడం కష్టం. 20 సంవత్సరాల క్రితం 2001 సెప్టెంబర్ 11 మంగళవారం ఉదయం తనపై జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి పురికొల్పిన యుద్ధాల్లో అమెరికా చెప్పనలవికాని విధ్వంసాన్ని సృష్టించింది.

అదే సమయంలో అమిత నష్టాలనూ చవిచూసింది. వీటిలో అమెరికా స్వయంగా 8 ట్రిలియన్ డాలర్లు నష్టపోయింది. ఈ యుద్ధాల్లో తన సైనికులను అసంఖ్యాకంగా కోల్పోయింది. అసాధారణమైన రక్తపాతానికి కారణమైంది. విదేశాల్లో అమెరికా చేస్తున్న యుద్ధాల వల్ల తమ సైనికులు దుర్మరణం పాలవడం అమెరికన్లను తీవ్ర క్షోభకు గురి చేసింది. ఈ కారణంగా అమెరికా ఎక్కడెక్కడి యుద్ధ క్షేత్రాల నుంచి తప్పుకోవాలని సంకల్పించింది. గత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికన్ సేనలను వీలైనంత తొందరగా వెనక్కు రప్పించుకోడానికి వేసిన దారినే ఉపయోగించుకొని ఆ కార్యక్రమాన్ని బైడెన్ ప్రభుత్వం ఒక తీరు తెన్నూ లేకుండా పూర్తి చేసి అపఖ్యాతి పాలైంది. అఫ్ఘానిస్తాన్‌పై ఆకలిగొన్న సింహాల్లా తాలిబన్లు విరుచుకుపడి అక్కడి మానవ హక్కులను మళ్లీ బలి తీసుకోడం మొదలు పెట్టడానికి బైడెన్ ప్రభుత్వం చేతగాని నిష్క్రమణ తీరే కారణమైంది. బైడెన్ తీసుకున్న చర్యల వల్లనే ఇప్పుడు అఫ్ఘాన్ ప్రజలు ఆకలి మంటలతో అలమటిస్తున్నారు. టెర్రరిజం, వాతావరణ మార్పులు, కరోనా వంటి అంతర్జాతీయ విపత్తులను ఎదుర్కోడానికి అమెరికా తన పాత, కొత్త పొత్తులను పటిష్ఠం చేసుకుంటుందని బైడెన్ ప్రకటించారు.

బైడెన్ యుద్ధ వైరాగ్యం చైనా విషయంలో, ఇజ్రాయెల్ వంటి పొగరుబోతు దేశాల సందర్భంలో పని చేయదని బోధపడుతున్నది. తన అదుపాజ్ఞల్లోకి రాకుండా స్వతంత్రంగా బలపడుతున్న శక్తుల విషయంలోనూ తనకు ప్రీతిపాత్రమైన దేశాల విషయంలోనూ అమెరికా పూర్వపు విధానాలనే కొనసాగిస్తుందని భావించాలి. చైనాను హద్దుల్లో ఉంచే విషయంలో అమెరికా పదునుగానే వ్యవహరిస్తుందని ఇటీవల అది బ్రిటన్, ఆస్ట్రేలియాలతో కలిసి చేసుకున్న సైనిక ఒప్పందం (అకుస్) రుజువు చేస్తున్నది. ఆస్ట్రేలియాకు అణుజలాంతర్గాముల సరఫరా కోసం ఫ్రాన్స్‌ను కాదని అమెరికా కుదుర్చుకున్న ఈ ఒప్పందం దక్షిణ చైనా సముద్రంలో చైనాను నిలువరించడం కోసమేనని అర్థమవుతున్నది. ఒకవైపు యుద్ధ వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకోవైపు ఇటువంటి అతిపెద్ద యుద్ధాలను ప్రేరేపించే చర్యలకు అమెరికా తలపడడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

US does not seek new cold war, says joe biden