Home ఎడిటోరియల్ ట్రంప్ నిర్వాకం

ట్రంప్ నిర్వాకం

US Dropped out of WHO

 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశాడు. కీలక మానవ వికాస రంగాల్లో అంతర్జాతీయ సహకారమనే బంతికి మరో పదునైన తూటు పొడిచాడు. వాతావరణ మార్పులపై 2015లో కుదిరిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్టు మూడేళ్ల క్రితం 2017 జూన్ 1న ప్రకటించి ట్రంప్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశాడు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్‌ఒ)తో తెగతెంపులు చేసుకోడానికి నిర్ణయించి విశ్వ జన హానికి దారి తీసే మరో మూర్ఖమైన చర్యకు పాల్పడ్డాడు. ఆయన ఈ దురుద్దేశాన్ని నెలన్నర క్రితమే బయటపెట్టాడు. కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో డబ్య్లూహెచ్‌ఒ సవ్యంగా వ్యవహరించలేదని, తీవ్ర నిర్వహణ లోపాలున్నాయని ఆరోపించాడు. అందుచేత దానికి నిధులు నిలిపివేయదలచానని ఏప్రిల్ 15న ప్రకటించాడు.

ఆ దుస్సంకల్పాన్ని పలు దేశాలు, అనేక మంది ఆరోగ్య నిపుణులు తీవ్రంగా ఖండించినా ట్రంప్‌లో మార్పు రాలేదు. డబ్య్లూహెచ్‌ఒ నుంచి వైదొలగే నిర్ణయం తీసుకునే అధికారం దేశాధ్యక్షునికి లేదని అది రాజ్యాంగ విరుద్ధమనే వ్యాఖ్యానం అమెరికన్ ప్రముఖుల నుంచి వినవస్తున్నది. అంతిమంగా అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఏమి చెబుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే డబ్య్లూహెచ్‌ఒకి అమెరికా విరాళం ఆగిపోతుంది. దాని ఆక్సిజన్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాణం పోసుకున్నది. ఆ ప్రక్రియలో అమెరికా అతిపెద్ద పాత్ర పోషించింది. అప్పటి నుంచి మిగతా అన్ని దేశాల కంటే ఎక్కువగా విరాళాన్ని కూడా డబ్య్లూహెచ్‌ఒకు అది ఇస్తున్నది. ప్రస్తుతం ఏడాదికి 450 మిలియన్ డాలర్లను సమకూరుస్తున్నది. దేశదేశాల్లోని ప్రజారోగ్య నిపుణులందరి మేధస్సును ఒక్క చోట చేర్చి గిలకొట్టి ప్రపంచానికి సవాలుగా ఉన్న రుగ్మతలపై విజయం సాధించడంలో డబ్య్లూహెచ్‌ఒ విశేషంగా పాటుపడింది.

ప్రపంచ వ్యాప్తం గా 700 ప్రజారోగ్య సంస్థలు డబ్య్లూహెచ్‌ఒ కృషిలో పాలు పంచుకుంటున్నాయి. ప్రపంచ ప్రజలందరూ పూర్తి ఆరోగ్యంతో బతికే లక్షాన్ని సాధించడమే పరమావధిగా అది పని చేస్తున్నది. ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేని దేశాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చేయూతను అందించడంలో అనితర సాధ్యమైన పాత్రను పోషిస్తున్నది. ప్రపంచ దేశాలు దానికి అందిస్తున్న సాయమే దీనిని సుసాధ్యం చేస్తున్నది. అతిపెద్ద దాత అయిన అమెరికా తప్పుకోడం వల్ల ఈ కృషి కుంటుపడుతుంది. వైరస్‌లకు టీకాలు కనుగొనడం దగ్గర నుంచి ఎప్పటికప్పుడు కొత్తగా తలెత్తే ఆరోగ్య సమస్యలను సమర్థంగా పరిష్కరించడంలో డబ్లుహెచ్‌ఒ సాధిస్తున్న ప్రగతికి తీవ్ర అవరోధం ఏర్పడుతుంది. దానితో సరితూగ గల ప్రత్యామ్నాయ వ్యవస్థ ఇప్పటికైతే లేదు. కరోనాకు ఇంకా మందు కనుగొనవలసి ఉన్న దశలో, ఊహించని స్థాయిలో అది వణికిస్తున్న సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని, అమెరికాను కూడా మరింత అభద్రతలోకి నెట్టివేస్తుంది.

అమెరికాలో కరోనా మృతుల సంఖ్య లక్ష దాటిన ఘోర పరిణామానికి ట్రంప్ వహించిన చెప్పనలవికానంత నిర్లక్షమే కారణమన్నది రూఢి అయిపోయింది. డబ్లుహెచ్‌ఒను బోనులో నిలబెట్టి ఆ విమర్శను తన మీద నుంచి మళ్లించడానికే ఆ సంస్థతో తెగ తెంపుల నిర్ణయానికి దుస్సాహసించాడు. అంతర్జాతీయ సహకారంతో నడుస్తున్న సంస్థలకు తలవాటా విరాళాలిచ్చే బాధ్యత నుంచి తప్పుకోడం ద్వారా దేశ ఖజానాకు మేలు చేస్తున్నానని ఆ విత్తంతో దేశంలోని యువతకు ఉపాధులు, ఉద్యోగాలు కల్పించగలుగుతానని ప్రచారం చేసుకొని తన సంప్రదాయ అతి జాతీయ వాద ఓటును నిలబెట్టుకోడం, పెంచుకోడం లక్షమని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. చైనాను మరింతగా బాధించడం కూడా డబ్య్లూహెచ్‌ఒపై ట్రంప్ తాజా బాణం సంధించడానికి ఒక కారణం. డబ్య్లూహెచ్‌ఒ చైనా పట్ల మెతకగా ఉంటున్నదని కరోనా వైరస్ అక్కడ పుట్టి వ్యాపించడం ప్రారంభించినంత వరకు ఉదాసీనత వహించిందన్నది ట్రంప్ ఆరోపణ.

తన విధి విధానాల్లో మార్పులు తీసుకురావడానికి తాము చేసిన సూచనలను పాటించలేదన్న నిందను కూడా డబ్య్లూహెచ్‌ఒపై వేశాడు. ఆ సూచనలేమిటో బయటి ప్రపంచానికి తెలియవు. వాటిని ఆచరణలో పెట్టడానికి కనీసం నెల రోజులైనా వేచి చూడకుండా వారం దినాలకే డబ్య్లూహెచ్‌ఒకి అమెరికా చేత సెలవు చెప్పించాడు. ట్రంప్ తీసుకున్న చర్య ప్రమాదకరమైనదని అమెరికన్ మెడికల్ అసోషియేన్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్య గమనించదగినది. ట్రంప్ చర్య సంకుచిత దృష్టితో కూడినది, రాజకీయ దురుద్దేశంతో తీసుకున్నదని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్, ఉష్ణ మండల ఔషధాల అధ్యయనశాల డైరెక్టర్ పీటర్ ప్లాట్ అభిప్రాయపడ్డారు. ఇలా ఒకరేమిటి ప్రపంచమంతా తప్పు తప్పని కోడై కూసినా మనసు మార్చుకోకుండా డబ్య్లూహెచ్‌ఒకు మద్దతు ఉపసంహరించుకున్న అమెరికా అధ్యక్షుడు ప్రస్తుత అత్యంత సంక్షోభ సమయంలో ప్రపంచాన్ని దిక్కులేని స్థితిలోకి నెట్టి వేశాడు.