Home అంతర్జాతీయ వార్తలు త్వరలో గుడ్ న్యూస్

త్వరలో గుడ్ న్యూస్

US has corona testing programme better in World: Trump

ఎక్కువ పరీక్షల వల్లే పాజిటివ్ కేసులు
4.5 కోట్ల మందికి పరీక్షలు జరిపాం
మరణాల సంఖ్య కూడా అమెరికాలో తక్కువ
వ్యాక్సిన్‌పై త్వరలోనే శుభవార్త వింటాం
చైనా చేసింది ఎలా మరచిపోగలం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాల కన్నా మెరుగైన అత్యంత విస్తృతమైన కొవిడ్-19 పరీక్షా కార్యక్రమం అమెరికా నిర్వహిస్తోంందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ దేశాలలోనే అత్యంత తక్కువ సంఖ్యలో కరోనా మరణాలు తమ దేశంలోనే సంభవిస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 33 లక్షలు దాటగా 1.35 లక్షల మంది రోగులు మృత్యువాత పడ్డారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలోనే కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఫ్లోరిడా, టెక్సాస్, క్యాలిఫోర్నియా వంటి అమెరికాలోని రాష్ట్రాలు ప్రాణాంతకమైన ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తమ దేశంలో పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడానికి తాము చేస్తున్న అత్యంత విస్తృతమైన కరోనా పరీక్షలే కారణమని ట్రంప్ వెల్లడించారు. మరే దేశంలోను ఈ విధంగా పరీక్షలు నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా మరే దేశంలోను లేని విధంగా మరణాల సంఖ్య కూడా అత్యంత తక్కువగా తమ దేశంలోనే ఉందని కూడా సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన చెప్పారు.

పరీక్షలు చేస్తేనే కేసులు బయటపడతాయని, మేము విస్తృత రీతిలో పరీక్షలు జరుపుతున్నందువల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని ట్రంప్ అన్నారు. కొన్ని దేశాలలో రోగి ఆస్పత్రికి వెళితేనే పరీక్షలు జరుపుతున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అందుకే వారి వద్ద కేసులు ఉండడం లేదని ఆయన చెప్పారు. అదే సమయంలో మన దేశంలో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో మనం చాలా విశేషమైన కృషి చేస్తున్నామని, క్యాక్సిన్‌ను కనుగొనడంలో కాని, రోగులకు వైద్యం అందచేయడంలో కాని మన కృషి గొప్పగా ఉందని ఆయన అన్నారు. త్వరలోనే ఒక శుభవార్తను వినగలమని భావిస్తున్నామని ఆయన ప్రకటించారు.చైనా, రష్యా, ఇండియా, బ్రెజిల్ వంటి దేశాలను తీసుకుంటే వారి టెస్టింగ్‌లకు మన దేశంలో జరిగే టెస్టింగ్‌లకు చాలా తేడా ఉందని, అక్కడ కేసులు తక్కువగా ఉండడానికి మన దేశంలో కేసులు ఎక్కువగా ఉండడానికి మనం విస్తృతంగా జరుపుతున్న టెస్టింగ్ కార్యక్రమమే కారణమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికాలో ఇప్పటివరకు 4.5 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించామని, అందులో సగం మాత్రమే చేసి ఉంటే బహుశా కేసుల సంఖ్య కూడా అంతే తక్కువగా ఉండేదని ట్రంప్ తెలిపారు. అందులో సగం పరీక్షలు మాత్రమే చేసి ఉంటే కేసుల సంఖ్య కూడా సగం మాత్రమే ఉండేదని ఆయన అన్నారు. అప్పుడు మనల్ని కూడా అందరూ పరీక్షలు జరపడంలో మీరు చాలా గొప్పగా కృషి చేస్తున్నారని పొగిడి ఉండేవారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచానికి చైనా వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ మరచిపోరాదని ఒక ప్రశ్నకు జవాబిస్తూ ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా కారణంగా ప్రపంచమంతా ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. దాన్ని చైనా ప్లేగు అంటారా, చైనా వైరస్ అంటారా లేక మరేదైనా పేరు పెడతారా మీ ఇష్టం..దానికి 20 వేర్వేరు పేర్లు ఉన్నాయి. ప్రపంచానికి వారు చేసిన పనిని మరచిపోలేము అంటూ ట్రంప్ నిరసించారు. కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి చైనా కారణమని, అత్యంత రహస్యంగా, మోసపూరితంగా, తప్పును కప్పిపుచ్చుకునే రీతిలో వ్యవహరించిన చైనాను పూర్తిగా బాధ్యురాల్ని చేయాలని అమెరికా సీనియర్ అధికారులు పదేపదే కోరుతున్నారని ట్రంప్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం యథాతథంగా ఉంటుందని ఆయన చెప్పారు. చైనా మన దగ్గర కొనుగోలు చేస్తోందని, వారు కొంటారో లేదో అది వారి ఇష్టం..ఒప్పందం మాత్రం యథాతథంగా ఉంది అని ట్రంప్ స్పష్టం చేశారు.

US has corona testing programme better in World: Trump