Home ఎడిటోరియల్ సౌత్ సీలో చైనా పెత్తనం

సౌత్ సీలో చైనా పెత్తనం

US- Chine

 

గత కొన్ని వారాలుగా మళ్ళీ దక్షిణ చైనా సముద్రం వార్తల్లోకి వచ్చింది. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్ ఓడల విషయంలో అనేక ఉద్రిక్త సంఘటనలకు దక్షిణ చైనా సముద్రం వేదికయ్యింది. చైనా సముద్రంపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న దేశాలు కొంత అమెరికా సహాయంతో ప్రతిఘటించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం, శక్తివనరులకు కేంద్రం వంటిది. అలాంటి ప్రాంతంలో చైనా ప్రయత్నాలు, ముఖ్యంగా వియత్నాం ప్రత్యేక ఆర్ధికమండలిలో చైనా సృష్టించిన ప్రతిష్ఠంభన ఆసియాన్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ముఖ్యాంశం. ఈ సమావేశం జులైలో జరిగింది.

పది ఆగ్నేయాసియా దేశాలు ఆసియాన్ లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇటీవలి సంఘటనలు, భూభాగాలపై వాదప్రతివాదాలు ఆందోళనకరమైనవని చాలా మంది విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. అయితే చైనా దౌత్యవేత్త యాంగ్ యీ మాత్రం ఇతర దేశాలను హెచ్చరిస్తున్నారు. పాతకాలం నుంచి వస్తున్న వివాదాలను రాజేయవద్దని అంటున్నారు. ఆసియాన్ దేశాలకు సంబంధించి కోడ్ ఆఫ్ కాండాక్ట్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. దక్షిణ చైనా సముద్రాంలో చాలా పెద్ద భాగం తమదే అని చైనా వాదిస్తుంది. ఏటా దాదాపు 3.4 ట్రిలియన్ డాలర్ల షిప్పింగ్ ఈ ప్రాంతం నుంచి జరుగుతుంది. చైనా వాదనను మలేషియా, ఫిలిప్పిన్స్, తైవాన్, వియత్నాం తదితర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.

చైనా చారిత్రకంగా ఈ సమస్యపై అనుసరిస్తున్న విధానాలను మార్చుకుంది. దక్షిణ చైనా సముద్రం కీలకసమస్యగా 2010 తర్వాతి నుంచి చైనా పేర్కొంటూ వస్తోంది. ఈ విషయంలో చర్చలకు అవకాశమే లేదంటోంది. అప్పటి నుంచి చైనా ఇక్కడి పరిస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ సైన్యాన్ని పెంచడం, కృత్రిమ దీవులు నిర్మించడం వంటి కార్యకలాపాలు చేపట్టింది. చైనా సవాలును గుర్తించడంలో అమెరికా చాలా ఆలస్యం చేసింది. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికా కూడా దక్షిణ చైనా సముద్రం విషయంలో తమకు హక్కులున్నాయని బలంగా వాదించడం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలోని దేశాలకు మద్దతివ్వడంతో పాటు ఫ్రీడం ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్లు నిర్వహించింది. ఇటీవల జరిగిన ఆసియాన్ సమావేశంలో కూడా అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో ఈ విషయం గురించి మాట్లాడారు. దక్షిణ చైనా సముద్రం, చైనా మేకాంగ్ నదిపై నిర్మిస్తున్న ఆనకట్టల విషయంలో ఆగ్నేయాసియా దేశాల హక్కులను హరిస్తుందని విమర్శించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా దాష్టికాలను ప్రశ్నించాలని ఈ దేశాలను కోరారు. చైనా ఆనకట్ట కట్టడం వల్ల ఆగ్నేయాసియాలో మేకాంగ్ నది నీటిమట్టం చాలా తగ్గిపోయిందని, దశాబ్దాలుగా ఇంత తక్కువ నీటిమట్టం ఎప్పుడు లేదని అన్నారు.

మరోవైపు అమెరికా చైనాల మధ్య వాణిజ్యయుద్ధం కొనసాగుతోంది. చైనా ఉత్పత్తులపై అమెరికా 300 బిలియన్ డాలర్ల టారిఫ్ పెంచింది. సెప్టెంబరు 1 నుంచి ఈ కొత్త టారిఫ్ అమలులోకి వస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యయుద్ధం ఉద్రిక్తతలకు దారితీస్తుంటే, మరోవైపు చైనా విషయంలో ప్రాంతీయ దేశాలు ఎలా వ్యవహరించాలనే అయోమయంలో ఉన్నాయి. ఫిలిప్పిన్స్ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా మనీలా వద్ద సముద్ర జలాల్లో ఐదు చైనా ఓడలు ప్రయాణించాయని ఫిలిప్పిన్స్ చెప్పింది. ఫిలిప్పిన్స్ అంతర్భాగమైన తీటూ దీవి చుట్టు చైనా నౌకలు తిష్ఠవేయడాన్ని కూడా ఖండిస్తూ దౌత్యపరంగా ఫిలిప్పిన్స్ అభ్యంతరాలు ప్రకటించింది. ఇంతకు ముందు ఫిలిప్పిన్స్ ప్రత్యేక ఆర్ధిక మండలి పరిథిలో ఒక ఫిలిప్పిన్స్ ఓడను చైనా చేపల నౌక ముంచేసింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని చైనా తర్వాత ప్రకటించింది.

మలేషియా తీరంలోని ఆయిల్ రిగ్ వద్ద మేలో ఒక చైనా కోస్ట్ గార్డ్ నౌక కనిపించింది. ఆ తర్వాత ఒక చైనా సర్వే నౌక వచ్చింది. దాంతో పాటు మరికొన్ని నౌకలు కూడా వచ్చాయి. వియత్నాం ప్రత్యేక ప్రాంతంలోని చమురు క్షేత్రంలో ఈ నౌకల కార్యకలాపాలు ప్రారంభించాయి. దాంతో 2014 తర్వాత అత్యంత తీవ్రమైన ప్రతిష్ఠంభన ఈ ప్రాంతంలో ఏర్పడింది. తమ జలాల నుంచి చైనా సర్వే నౌకను తొలగించాలని వియత్నాం డిమాండ్ చేస్తోంది. చైనా బెదిరింపు చర్యలను అమెరికా ఖండిస్తూ వియత్నాంకు మద్దతిచ్చింది. చైనా రెచ్చగొట్టేలా, ప్రాంతీయ అస్థిరతను పెంచేలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. విచిత్రమేమంటే, వియత్నాంలోని ఈ వివాదాస్పద ప్రాంతంలోనే రష్యా ప్రభుత్వ చమురు సంస్థ కూడా పనిచేస్తోంది. చైనాకు వ్యతిరేకంగా రష్యా ముందుకు వచ్చే అవకాశాలు లేవు. రష్యా చైనాల మధ్య ఇటీవల సన్నిహిత స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి.

చైనా ఈ ప్రాంతంలో తన పెత్తనం చెలాయించాలని చూస్తోంది. ఇక్కడ సముద్రంపై ఆధిపత్యం తన చేతుల్లో ఉండాలని ప్రయత్నిస్తోంది. కాని ఈ ప్రయత్నాలు ఆసియాన్ దేశాలకు రుచించడం లేదు. అమెరికా ప్రారంభించిన ఇండో పసిఫిక్ స్ట్రాటజీ విషయంలో ఆసియాన్ దేశాలు సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నాయి. చైనాకు ఇండో పసిఫిక్ స్ట్రాటజీ రుచించడం లేదు. అందువల్ల ఈ ప్రాంతంలో సముద్రజలాలపై తన ఆధిపత్యాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించే ప్రయత్నాల్లో ఉంది. ఈ ప్రాంతంలోని దేశాలు, ఇతర ప్రాంతాల దేశాలతో కలిసి ఇక్కడి చమురు క్షేత్రాల్లో కార్యకలాపాలు ప్రారంభించకుండా అడ్డుకట్ట వేయాలనుకుంటోంది.

దక్షిణ చైనా సముద్రం విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా భారతదేశం మౌనంగానే ఉంది. వియత్నాం ఈ విషయమై భారతదేశానికి సమాచారమిచ్చినా ఇంతవరకు ప్రతిస్పందన లేదు. చైనాతో ఇతర వ్యవహారాల్లో ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బహుశా ఇండియా మౌనం వహిస్తూ ఉండవచ్చు. కాని ఇండియా కూడా ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో భాగంగా ఉంది కాబట్టి చైనా ఏ దృష్టితో చూస్తుందో అర్ధం చేసుకోవడం కష్టం కాదు. భారతదేశం ఈ విషయంలో ఈ ప్రాంతంలోని చిన్న దేశాలకు మద్దతుగా మాట్లాడకపోతే చైనా తనకు తిరుగులేదని అనుకుంటుంది. అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోదు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తత పెరుగుతున్నప్పుడు మాట్లాడకపోతే, తర్వాత ఇండో పసిఫిక్ ప్రాంతం గురించి మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో మౌనం వహించినంత మాత్రాన చైనా మనకు అనుకూలంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పలేం.

                                                                                                  – (హర్ష్ వి పంత్, డైలీ ఓ)

US increased tariffs of $ 300 billion on Chinese products