Home అంతర్జాతీయ వార్తలు విమాన ఇంజిన్ ధ్వంసం.. కూలిన శకలాలు

విమాన ఇంజిన్ ధ్వంసం.. కూలిన శకలాలు

US plane scatters engine debris over Denver homes

 

అమెరికాలో తృటిలో తప్పిన పెను ముప్పు

బ్రూమ్‌ఫీల్డ్: అమెరికాలో ఓ విమానం ఇంజిన్ పేలి, కొన్ని శకలాలు కింద ఉన్న డెన్వెర్ శివార్లలో పడ్డాయి. ప్రయాణికులతో వెళ్లుతున్న విమానానికి తృటిలో పెను ముప్పు తప్పింది. విమానం ప్రయాణిస్తుండగా ఇంజిన్‌లో ఆకస్మికంగా యాంత్రిక లోపం ఏర్పడింది. దీనిని గుర్తించి పైలెట్ విమానాన్ని అత్యవసరంగా దింపే క్రమంలో ఇంజిన్ దెబ్బతిన్న భాగాలు కిందపడ్డాయి. ఓ శకలం అయితే కొద్దిలో ఓ ఇంటిపై పడాలి. కానీ కొద్దిలో ముప్పు తప్పింది. విమానం అయితే అత్యవసర రీతిలో సురక్షితంగా నేలవాలింది. ప్రయాణికులు ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777200 విమానం అత్యవసరంగా డెన్వెర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తిరిగి దిగాల్సి వచ్చింది.

ఆదివారం ఈ ఘటన జరిగింది. విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీనిని గుర్తించి వెంటనే రీ ల్యాండింగ్ చేయడంతో పెను ముప్పు తప్పింది. కానీ శివార్లలో శకలాలు పడటంతో స్థానికులు కలవరం చెందారు. ఈ విమానం డెన్వెర్ నుంచి హానోలూలుకు వెళ్లాల్సి ఉంది. విమానంలో ఈ ఘటన దశలో231 మంది ప్రయాణికులు, పది మంది సిబ్బంది ఉన్నట్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ తెలిపింది. అతి పెద్ద వృత్తాకారపు భాగాలు కింద పడిన దృశ్యాలను స్థానిక పోలీసు విభాగం వెలువరించింది. విమానం ల్యాండింగ్ దశలో ప్రయాణికులు భయంతో వణికిపొయ్యారు. ఇంజిన్ దెబ్బతిన్న విషయం తెలియడంతో విమానానికి ఏమైనా అవుతుందనే భయంతో గడిపారు.

ఓ ఇంటికి అతి సమీపంలోనే ఇంజిన్ శకలాలు పెద్ద ఎత్తున పడటంతో ఇంటిలోని వారు పిడుగులు కానీ పడలేదు కదా అని పరుగులు తీయాల్సి వచ్చింది. మరో వైపు ప్రయాణికులు తమ భయానక క్షణాలను విమానం నుంచి దిగిన తరువాత తమవారికి తెలియచేసుకున్నారు. మరికొద్ది సేపటిలో విమానం నిర్ణీత ఎత్తుకు చేరుకునే దశలో ఇంజిన్ దెబ్బతిన్న విషయాన్ని గుర్తించారు. క్యాబిన్‌లో భారీ పేలుడు సంభవించి ఇంజిన్ దెబ్బతిందని, ఈ దశలో పెద్దగా వెలుగువచ్చిందని సిబ్బంది తెలిపారు.మొత్తం మీద ఈ ఘటన నుంచి బయటపడటం తమకు అత్యద్భుతం అయిందని ప్రయాణికులు తెలిపారు. విమానం దిగుతున్న సమయంలో గిరికీలు కొట్టింది.

క్రమేపీ నేలపై పడిపోతుందని అనుకున్నామని ప్రయాణికుడు డేవిడ్ డెలూసియా తెలిపారు. ఇక చావు తప్పదని అనుకున్నానని, ఏదో విధంగా బయటపడ్డానని చెప్పారు. విమానంలో పేలుడు చప్పుళ్లు వినబడ్డాయని ఇక్కడి ప్రాంతవాసులు తెలిపారు.దీనితో విమానానికి ఏమై ఉంటుందనే ఆందోళన నెలకొంది. విమానంలో నుంచి పొగలు రావడం, తరువాత శకలాలు కింద పడటం తమను భయపెట్టాయని చెప్పారు. నేలపై పడుతున్న శకలాలు తమకు కింది నుంచి భారీ ఈటెలలాగా అన్పించాయని స్థానికుడు టైలెర్ థాల్ తెలిపారు. విమానంలోని ఓ ఇంజిన్ దెబ్బతినడం, పేలడం వంటి పరిణామాలతో ఈ ఘటనపై అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పటికిప్పుడు దీనిపై ఏమీ చెప్పలేమని, దర్యాప్తు తరువాతనే అన్ని విషయాలు నిర్థారణ అవుతాయని అధికారులు తెలిపారు.