Home అంతర్జాతీయ వార్తలు ట్రంప్ భారత పర్యటన ఖరారు

ట్రంప్ భారత పర్యటన ఖరారు

Donald Trump

 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ముహూర్తం ఖరారయింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఆయన భారత్‌లో అధికారికంగా పర్యటిస్తారని శ్వేతసౌధం మంగళవారం ప్రకటించింది. ట్రంప్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తన సతీమణి, ప్రథమ పౌరురాలు మెలానియాతో కలిసి భారత్ రానున్న ట్రంప్ ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో పర్యటించనున్నారని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి స్టెఫానీ గ్రిషమ్ ప్రకటించారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ ఆహానంపై ట్రంప్, ఆయన సతీమణి భారత్‌లో పర్యటించనున్నట్లు ఢిల్లీలో విదేశాంగ శాఖ తెలిపింది. గత వారంలో మోడీ, ట్రంప్ పర్యటనపై ఫోన్‌లో చర్చించారని గ్రిషమ్ తెలిపారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారన్నారు.

అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించడం వరసగా ఇది మూడో సారి. ఇంతకు ముందు బరాక్ ఒబామా 2010, 2015 సంవత్సరాల్లో భారత్ సందర్శించారు. ఉభయ దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ట్రంప్ భారత్‌లో పర్యటించడాన్ని ఇరు దేశాల్లోని వ్యాపార వర్గాలు స్వాగతించాయి. దీంతో గత కొన్ని నెలలుగా తలెత్తిన వాణిజ్య విభేదాలు సమసిపోతాయని ఆకాంక్షించాయి. దీన్ని కీలక పర్యటనగా పేర్కొన్న ‘ భారత అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక’ అధ్యక్షుడు ముకేశ్ ఆఘి.. అమెరికా అధ్యక్షుడు భారత్‌లో పర్యటించడం ఇది వరసగా మూడో సారని గుర్తు చేశారు. ట్రంప్ భారత్‌ను కీలక భాగస్వామిగా భావిస్తున్నారన్న విషయం ఈ పర్యటనతో స్పష్టమవుతోందన్నారు. భారత్‌కు 1.9 బిలియన్ డాలర్ల విలువైన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్‌ను విక్రయించడానికి ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన కొద్ది గంటలకే ట్రంప్ భారత పర్యటనకు సంబంధించిన ప్రకటన వెలువడడం గమనార్హం.

ఇదిలా ఉండగా ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్‌లో ‘ హౌడీమోడీ’ తరహా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారన్న ఊహాగానాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఈ పర్యటనలో ప్రధానంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా చైనాతో తొలి దశ ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప్ భారత్‌తోను అదేతరహా విధానానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలాగే చైనా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, ఇరాన్‌లలో తాజా పరిస్థితులపై ప్రధానంగా ఇరువురు నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. చమురు, సహజవాయువు భద్రతపై అమెరికానుంచి భారత్ హామీని కోరేందుకు యత్నిస్తోంది. కాగా ట్రంప్ పర్యటన సందర్భంగా పలు సైనిక ఒప్పందాలు కూడా ఖరారయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

US President Donald Trump to visit India on February 24, 25